- .నోటిఫికేషన్లు చూసి హాస్పిటళ్లకు వెళ్తున్న జనాలు
- ఇలాంటి కేసులు తరచూ వస్తున్నాయంటున్న డాక్టర్లు
- ‘వరల్డ్ హార్ట్ రిథమ్ వీక్’ సందర్భంగా వివరాలు వెల్లడి
హైదరాబాద్‌లో ఉంటున్న ఓ 28 ఏండ్ల యువ వ్యాపారవేత్తకు అప్పుడప్పుడు గుండె వేగంగా కొట్టుకున్నట్టు, తల తిరిగినట్లు అనిపించేది. కొద్ది నిమిషాల్లో మళ్లీ మామూలయ్యేది. అతను ఒత్తిడి, టెన్షన్లు పెరగడం, కాఫీ ఎక్కువగా తాగడం వల్లే అలా జరుగుతోందని భావించాడు. ఎందుకైనా మంచిదని ఓ స్మార్ట్‌వాచ్ కొని పెట్టుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత ఒకసారి కారు నడుపుతుంటే గుండె కొట్టుకునే వేగం పెరిగింది. కొద్దిసేపటికే తల తిరగడం మొదలైంది. స్మార్ట్‌వాచ్‌లో ‘ఇర్రెగ్యులర్ హార్ట్ రిథం’ అని అలెర్ట్ వచ్చింది. వెంటనే హాస్పిటల్‌కు వెళ్లాడు. డాక్టర్లు టెస్ట్‌లు చేసి అతనికి గుండె సమస్య ఉన్నట్టు గుర్తించారు.
ఇటీవల 42 ఏండ్ల ఐటీ ఉద్యోగికి తన హార్ట్ బీట్ అప్పుడప్పుడు కొన్ని క్షణాల పాటు ఆగుతున్నట్టు అనిపించింది. గుండె వేగంగా కొట్టుకోవడం, ఛాతీలో కంపిస్తున్నట్లు కూడా గమనించాడు. అదేటైంలో స్మార్ట్‌వాచ్‌లో AFib (ఏట్రియల్ ఫైబ్రిలేషన్) అనే నోటిఫికేషన్ రావడంతో పాటు వైబ్రేషన్ వచ్చింది. మొదట ఆయన దానిని పెద్దగా పట్టించుకోలేదు. మళ్లీ మళ్లీ అలాగే వస్తుండడంతో భయపడి వెంటనే హాస్పిటల్‌కు వెళ్లాడు. డాక్టర్లు దాదాపు 30 శాతం హార్ట్ బీట్ అసాధారణంగా ఉన్నట్లు తేల్చారు. ‘రైట్ వెంట్రిక్యులర్ కార్డియోమయోపతి’ అనే జన్యుపరమైన గుండె వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. సమయానికి చికిత్స అందడంతో కోలుకున్నాడు.
హైదరాబాద్ సిటీ, వెలుగు: స్మార్ట్ వాచ్‌లు హార్ట్ బీట్‌లో లోపాన్ని ముందే గుర్తించి ఎంతోమంది ప్రాణాలను కాపాడుతున్నాయి. ఈ మధ్య కాలంలో స్మార్ట్‌వాచ్‌ల్లో వచ్చే నోటిఫికేషన్లను నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్లను సంప్రదిస్తున్నవాళ్లు గండం నుంచి గట్టెక్కుతున్నారు. 2024లో సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ బీజేపీ నేత వాకింగ్ చేస్తుంటే ఆయాసం, ఛాతిలో మంటలా అనిపించింది. ఆపిల్ వాచ్‌లో అలర్ట్ రావడంతో వెంటనే డాక్టర్‌ను కలిశాడు. గుండెలో రెండు రక్తనాళాలు మూసుకుపోయాయని తేలింది.
వెంటనే ట్రీట్మెంట్ అందించడంతో ముప్పు తప్పింది. ఇలా స్మార్ట్‌వాచ్‌ల వల్ల గుండె సమస్యలను గుర్తించి, తమ దగ్గరకు వచ్చే వారి సంఖ్య ఈ మధ్య పెరుగుతోందని బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్ డాక్టర్లు చెప్తున్నారు. ‘గుండె స్పందన సక్రమంగా లేదు’ అని స్మార్ట్‌వాచ్ హెచ్చరిస్తే తేలిగ్గా తీసుకోవద్దని సూచిస్తున్నారు. స్మార్ట్‌వాచ్‌లు రోగ నిర్ధారణ పరికరాలు కాకపోయినా, కొంతమేర స్క్రీనింగ్ చేయగలవు అంటున్నారు.
ఈ నోటిఫికేషన్లే స్ట్రోక్, హార్ట్ ఫెయిల్, గుండె ఆకస్మికంగా ఆగిపోవడం వంటి తీవ్రమైన సమస్యలను నివారించడంలో సాయపడుతున్నాయని చెప్తున్నారు. ‘ఏట్రియల్ ఫైబ్రిలేషన్’ లాంటి సమస్యలను ఒక వ్యక్తి తనకు తానుగా ముందుగా గుర్తించడం కష్టం. కానీ.. అలాంటి లోపాలను కూడా స్మార్ట్‌వాచ్‌లు బయటపెడుతున్నాయి. ప్రతి అలర్ట్ తీవ్రమైన సమస్యకు సంకేతం కాకపోయినా, సరైన టైంలో పరీక్షలు చేయించుకోవడం వల్ల రిస్క్‌ను ముందుగానే గుర్తించవచ్చంటున్నారు డాక్టర్లు.
జూన్ 7 వరకు హార్ట్ రిథమ్ వీక్
జూన్ 1 నుంచి 7వ తేదీ వరకు ‘వరల్డ్ హార్ట్ రిథమ్ వీక్–2026’ సందర్భంగా డాక్టర్లు గుండె జబ్బులపై ప్రజలకు అవేర్‌నెస్ కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా బంజారా హిల్స్ కేర్ హాస్పిటల్స్, కార్డియాక్ ఎలక్ట్రో ఫిజియాలజీ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ రామకృష్ణ ఎస్.వి.కె మాట్లాడుతూ ‘‘గుండె సమస్యలతో మా దగ్గరకు వచ్చేవాళ్లను ‘మీకు సమస్య ఉన్నట్టు ఎలా తెలిసింది?’ అని అడిగితే స్మార్ట్‌వాచ్‌ల వల్ల తెలుసుకున్నామని చెప్తున్నారు. స్మార్ట్‌వాచ్‌లలో అలర్ట్ వచ్చినా, ఏ మాత్రం అనుమానం ఉన్నా సరైన టైంలో పరీక్షలు చేయించుకోవాలి” అని సూచించారు.
ఏట్రియల్ ఫైబ్రిలేషన్
ఏట్రియల్ ఫైబ్రిలేషన్ అంటే గుండె స్పందన సరిగ్గా ఉండకపోవడం. ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల మందికిపైగా ఈ సమస్యతో బాధపడుతున్నారు. సరైన టైంలో చికిత్స అందకపోతే స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఐదు రెట్లు పెరిగే ప్రమాదం ఉంది. ఈ సమస్య వృద్ధులకే కాకుండా, పెరుగుతున్న ఒత్తిడి, శారీరక శ్రమ తగ్గిపోవడం, రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, నిద్ర సమస్యలన్న యువత, మధ్య వయస్కుల్లోనూ కనిపిస్తోంది.
దీని లక్షణాలు అప్పుడప్పుడు మాత్రమే కనిపించడం వల్ల ఆందోళన, ఒత్తిడి లేదా అలసటగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. కొందరిలో మొదటి హెచ్చరికే స్ట్రోక్, స్పృహ కోల్పోవడం లేదా ఆకస్మికంగా గుండె ఆగిపోవడం రూపంలో కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా జీవితకాలంలో ప్రతి ముగ్గురిలో ఒకరికి ఏట్రియల్ ఫైబ్రిలేషన్ వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెప్తున్నాయి. దీనివల్ల బ్రెయిన్ స్ట్రోక్ (పక్షవాతం) వచ్చే ప్రమాదం ఐదు రెట్లు పెరుగుతుంది.
హార్ట్ రిథమ్ డిజార్డర్
మన గుండె ఒక క్రమ పద్ధతిలో నిమిషానికి సాధారణంగా 60 నుంచి 100 సార్లు కొట్టుకుంటుంది. గుండెలోని సహజసిద్ధమైన ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఆ లయను నియంత్రిస్తాయి. ఎలక్ట్రికల్ సిగ్నల్స్‌లో లోపం ఏర్పడితే గుండె లయ తప్పుతుంది. దాన్నే హార్ట్ రిథమ్ డిజార్డర్ లేదా ‘అరిథ్మియా’ అని పిలుస్తారు. ఇది మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి.. గుండె సాధారణం కంటే చాలా వేగంగా కొట్టుకోవడం. అంటే నిమిషానికి 100 కంటే ఎక్కువ సార్లు. మరొకటి గుండె చాలా నెమ్మదిగా కొట్టుకోవడం. అంటే నిమిషానికి 60 కంటే తక్కువ. మూడోది గుండె క్రమం తప్పి ఎలా పడితే అలా కొట్టుకోవడం.
ఎందుకు ఇలా అవుతోంది?
ఇలాంటి గుండె సమస్యలు విపరీతంగా పెరగడానికి ముఖ్య కారణాలు తీవ్రమైన మానసిక ఒత్తిడి, నిద్రలేమి. ఇవి ఐటీ ఉద్యోగులు, యువతలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. మధుమేహం (డయాబెటిస్), బీపీ కంట్రోల్‌లో లేకపోతే గుండె కండరాలు దెబ్బతిని లయ తప్పుతుంది. స్మోక్ చేయడం, మందు, అతిగా కాఫీ, ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్ల గుండె ఎలక్ట్రికల్ సిగ్నల్స్ దెబ్బతింటాయి. వ్యాయామం చేయకపోయినా, జంక్ ఫుడ్ ఎక్కువగా తిన్నా ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. వయసు పెరగడం వల్ల కూడా ఎలక్ట్రికల్ వ్యవస్థ బలహీనపడుతుంది.
ఈ లక్షణాలుంటే జాగ్రత్త
- గుండె రేసు గుర్రంలా పరిగెడుతున్నట్లు లేదా ఒక బీట్ మిస్ అయినట్లు అనిపించడం.
- కళ్లు తిరగడం లేదా స్పృహ తప్పడం (డిజినెస్/ఫైన్టింగ్ ). మెదడుకు రక్తం సరిగ్గా అందక తల తిరిగినట్లు కావడం.
- చిన్న పని చేసినా, ఎక్కువసేపు కూర్చున్నా ఊపిరి సరిగ్గా అందకపోవడం.
- ఛాతిలో నొప్పి లేదా అసౌకర్యం, ఛాతిలో భారంగా అనిపించడం.
- తీవ్రమైన అలసట.. రోజంతా నీరసంగా ఉండటం.
