వాసన తెలియని బేకర్!
లక్షల్లో జీతం. కానీ, తను కోరుకున్న జీవితం కోసం వద్దనుకుందామె. ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి బేకింగ్ వైపు నడిచింది. అందరూ ఎగతాళి చేశారు. అందుకు కారణం ఆమె లక్షలు తెచ్చిపెట్టే ఉద్యోగాన్ని వదిలేయడం కాదు. అసలు వాసన తెలియని అమ్మాయి బేకింగ్ ఎలా చేస్తుందని. అయినా వెనక్కి తగ్గలేదామె.. ‘ఎవరేం అనుకుంటే నాకేంటి? ’ అని ఎదురు ప్రశ్నించింది. ఇప్పుడు ప్రొఫెషనల్ బేకర్‌గా, ఫుడ్ ఇన్నొవేటర్గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఇన్స్పిరేషనల్ ఉమెన్ పేరు గౌరీ వర్మ. ఢిల్లీకి చెందిన ఆమె గురించి..
కంటి చూపు, వినికిడి లోపాల గురించి దాదాపుగా అందరికీ తెలుసు. కానీ, అసలు వాసన చూడలేని జబ్బు ఒకటుందన్న విషయం చాలామందికి తెలియదు. ప్రపంచంలో అతి అరుదైన వ్యాధుల్లో ఒకటైన దీన్ని ‘అనోస్మియా’ అంటారు. ఈ వ్యాధి బారినపడ్డ వాళ్లు ఎప్పటికీ వాసన చూడలేరు. అయితే గౌరీ వర్మకి ఈ సమస్య పుట్టుకతో వచ్చింది కాదు. తన కలల తీరాన్ని అందుకుంటున్న మార్గంలో ఎదురైంది ఈ సమస్య ఆమెకి. అలాగని కుంగిపోలేదామె. ధైర్యంగా నిలబడింది. గెలిచింది.
వాసన కోల్పోయింది
ఊహ తెలిసినప్పట్నించీ గౌరీకి బేకింగ్‌పై ఇంట్రెస్ట్ ఉంది. అందుకే ఐదేండ్ల వయసులోనే తల్లితో కలిసి కేక్ తయారుచేసిందామె. ఫ్రెండ్స్ బర్త్‌డేలకి కూడా తనే స్వయంగా కేక్ చేసుకొని తీసుకెళ్లేది. స్విమ్మింగ్‌లోనూ రాకెట్లా దూసుకెళ్లేది గౌరి. కాస్త బొద్దుగా ఉన్నప్పటికీ.. నీళ్లల్లో చేప పిల్లలా కదులుతుండేది. అది గమనించిన వాళ్ల నాన్న ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇప్పించాడు. ఆరు నెలల్లోనే బేసిక్స్ నుంచి నేషనల్ లెవల్ ఈవెంట్స్ వరకూ వెళ్లింది. అలా పదిహేనేండ్ల వయసులో స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు గౌరి తలకి గాయం అయింది. ఆ గాయం వల్ల వాసన గుర్తించే శక్తిని కోల్పోయింది. సర్జరీ చేస్తే వాసన తిరిగొచ్చే అవకాశం యాభై శాతం ఉందన్నారు డాక్టర్లు. కానీ, దురదృష్టం కొద్దీ ఆ ఆపరేషన్ కూడా ఫెయిలైంది. గాయం వల్ల తనకిష్టమైన స్విమ్మింగ్‌కి దూరమైంది. వాసన తెలియనప్పుడు బేకింగ్ ఎలా చేస్తుంది అనుకున్నారు అంతా. కానీ, బేకింగ్‌పై ఆమెకున్న ఇష్టానికి, వాసన తెలియకపోవడం పెద్ద అడ్డంకి కాలేదు. వాసన తెలియకుండా కేక్‌లు, బిస్కెట్ల తయారీనా? ఎటు చూసినా ఇదే ప్రశ్న. కుకింగ్ చేయడానికి వాసనెందుకు.. రుచి చూడటానికి నాలుక ఉంటే చాలన్నది గౌరి వాదన. మొదట చుట్టు పక్కల వాళ్లంతా తప్పుబట్టినా.. ఆమె చేతి కమ్మటి కుకీస్, కేక్‌లు తిన్నాక అప్పటివరకు వాళ్లకున్న అనుమానాలన్నీ తీరిపోయాయి. దాంతో ఆమెను ఎంకరేజ్ చేశారు. ఆ ప్రోత్సాహంతోనే బేకింగ్‌పై మరింత ప్యాషన్ పెంచుకుంది గౌరి. ఒక పక్క ఉద్యోగం చేస్తూనే తన ప్యాషన్‌ని కంటిన్యూ చేసింది. వరల్డ్‌లోనే టాప్ కంపెనీలతో కలిసి పనిచేసిందామె. అప్పుడే ఇండియన్ మార్కెట్లోని బేకరి ఇంగ్రెడియెంట్స్‌ని బాగా గమనించింది. వాటిల్లో చాలా మటుకు ఇతర దేశాల నుంచి వచ్చిన ప్రొడక్ట్స్ ఉన్నాయి. అందులోనూ ఆ దేశాల్లో వాటికి డిమాండ్ లేక ఇక్కడి మార్కెట్లోకి తీసుకొస్తున్నారని తన స్టడీలో తెలుసుకుందామె. పైగా ఫుడ్ టెక్నాలజీ ప్రకారం ఒక్కటే బ్రాండ్ ప్రొడక్ట్స్ అయినప్పటికీ ప్రాంతాన్ని బట్టి టేస్ట్, స్మెల్ మారతాయి. అందుకే మన వాతావరణానికి తగ్గట్టు సొంతంగా బేకరీ ఇంగ్రెడియెంట్స్ తయారు చేయాలనుకుంది. అందుకోసం ఉద్యోగాన్ని వదిలేసి.. జి’ఎస్ పెటిస్సరీతో పాటు కన్ఫెక్ట్ అనే షుగర్ పేస్ట్ కంపెనీ కూడా మొదలుపెట్టింది. అయితే మార్కెట్ కూడా వాసనే తెలియని అమ్మాయి ప్రొడక్ట్స్ తయారుచేయడాన్ని ఒప్పుకోలేదు. కానీ, తర్వాత అందరూ కన్వీన్స్ అయ్యారు.
నమ్మకాన్ని గెలుచుకుంది
వాసన తెలియకుండా బేకింగ్ అంటే మొదట కొంతమంది కస్టమర్స్ వెనకడుగేశారు. ఆమె ఇంగ్రెడియెంట్స్ కొనడానికి కూడా ఆసక్తి చూపించలేదు. ‘మేడమ్ గారు ఇదంతా హాబీగా చేస్తుంద’న్న మాటలూ వినిపించాయి. ఆ మాటల్ని తప్పని నిరూపించడానికి..చాలా కష్టపడింది గౌరి. ఆ కష్టంతో మెల్లిగా కస్టమర్స్ నమ్మకాన్ని గెలుచుకుంది. రీసెంట్గా ‘ఇండియాస్ బెస్ట్ షుగర్ పేస్ట్ బ్రాండ్’గా గౌరి ‘కన్ఫెక్ట్’కి అవార్డు కూడా దక్కింది.
వాసనని బట్టే వంట రుచి చెప్పేస్తారు చాలామంది. అలానే నేను డిష్‌ని చూసి చెప్పేస్తా. టేస్ట్‌ని బట్టి కావాల్సిన ఇంగ్రెడియెంట్స్‌ని అడ్జెస్ట్ చేసుకుంటా. అయితే ఈ జర్నీ అంత ఈజీ ఏం కాదు. ప్రతి అడుగులో ఓ సవాలు ఎదురైంది. నన్ను నేను నమ్మడం వల్లే వాటన్నింటినీ దాటి ఇక్కడి వరకు రాగలిగా. నేను చేసిన ఇంగ్రెడియెంట్స్తోనే కేక్స్, బిస్కెట్స్, స్వీట్స్... వంటి బేకరీ ఐటమ్స్ తయారు చేయడం నా స్పెషాలిటీ. అవి ఇంతమందికి నచ్చడం చాలా సంతోషాన్నిస్తోంది.
