70 ఏండ్లైనా సామాజిక న్యాయం దక్కలె

70 ఏండ్లైనా సామాజిక న్యాయం దక్కలె

విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో కోటా కల్పించాలి
బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్య డిమాండ్

హైదరాబాద్‌, వెలుగు: అన్ని కులాలకు జనాభా నిష్పత్తిలో న్యాయం జరగాలని రాజ్యాంగంలో పేర్కొన్నప్పటికీ 70 ఏండ్లు గడిచినా బీసీలకు సామాజిక న్యాయం జరగలేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు. అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని బీసీ భవన్​లో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్‌.కృష్ణయ్య మాట్లాడారు. దేశంలో 80 శాతం జనాభా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజ్యాధికారం సాధించినప్పుడే అంబేడ్కర్ కు నిజమైన నివాళి అని అన్నారు.

ఇటీవల కేంద్రం చేసిన సర్వే ప్రకారం 72 ఏండ్లలో దేశంలో రాజకీయ రంగంలో బీసీలకు 14%, కేంద్ర ఉద్యోగాల్లో 12%, న్యాయ వ్యవస్థలో 2%, పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య రంగాల్లో ఒక శాతం, ప్రైవేట్‌ ఉద్యోగాల్లో 2% మాత్రమే ప్రాతినిథ్యం ఉందన్నారు. 56 శాతం జనాభా ఉన్న బీసీలకు ఇంత తక్కువ ప్రాతినిథ్యం ఉంటే ఇదేలా ప్రజాస్వామ్యం అవుతుందని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని, అప్పుడే సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లపల్లి అంజి, పగిళ్ల సతీష్‌, కృష్ణ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.