విశ్వాసం:సనాతన ధర్మాన్ని తప్పు పట్టడం కాదు.. విషయాన్ని గ్రహించాలి.. అప్పుడే సామాజిక సమస్యలు దూరమవుతాయి..!

విశ్వాసం:సనాతన ధర్మాన్ని తప్పు పట్టడం కాదు.. విషయాన్ని గ్రహించాలి.. అప్పుడే సామాజిక సమస్యలు దూరమవుతాయి..!

ఏనాటి నుంచో సనాతన ధర్మాన్ని విమర్శించటానికి, తప్పు పట్టటానికి ఆయుధంగా ఉపయోగపడుతున్న అంశం.. వర్ణ వ్యవస్థ గురించి ప్రస్తావించిన ఈ మాట . అయితే విమర్శించటానికి ఉపయోగించుకునే ఆయుధాన్ని పిడి మాత్రమే పట్టుకున్నారు కానీ మొత్తాన్ని గ్రహించలేదు. పైగా తాము పెట్టుకున్న రంగు కళ్ళజోళ్ళ నుండి మాత్రమే చూడటం జరిగింది గాని, పూర్తిగా యథార్థాన్ని దర్శించినట్టు కనపడదు. భగవద్గీతలో కనపడే ఈ శ్లోకం పూర్తి పాఠం ఇది. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. . . !

చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశః
 తస్య కర్తారమపి మాం విధ్యకర్తార మవ్యయం

లోకంలో జీవులు తమ తమ స్వభావాల కారణంగా నాలుగు వర్ణాలుగా తమని తామే విభజించుకుంటున్నారు. నిజానికి వారి ప్రకృతిగా ఈ విధమైన విభజన నేనే చేస్తున్నాను. నేను వారిలో ఆత్మస్వరూపుడుగా ప్రకృతికి, ఈ విభజనకి అతీతుడుగా ఉన్నాను.. ఇది శ్లోకానికి ఉన్న సామాన్య భావం.

వర్ణము అనే మాటకి అక్షరము..రంగు అనే అర్థాలున్నాయి.ఛాయ అంటే ...షేడ్... అనే అర్థం కూడా ఉంది. ఇక్కడ విభాగము అనే అర్థం తీసుకోవాలి. మానవులు తమ సదుపాయం కోసం తమ తమ స్వభావాలకి అనుగుణంగా నాలుగు విధాలైన ధర్మాలని అనుసరించి నాలుగు వర్ణాలుగా ఏర్పడ్డారు. ఏ మానవ సమాజం అయినా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ధర్మాలను ఏర్పరచుకొని పనులని పంచుకుంటారు.

 ఒక వ్యక్తి అన్ని పనులు చేయలేడు కదా. ప్రతి మనిషి తన స్వభావాన్ని అనుసరించి తనకు నచ్చిన పనుల్లో నైపుణ్యాన్ని సంపాదించి, ఇతరులకు ఉపయోగపడుతూ, ఇతరుల వల్ల తను కూడా ప్రయోజనం పొందుతుంటాడు.

మనిషి అన్నవాడు చేసే పనులు నాలుగు రకాలుగా మాత్రమే ఉంటాయి.అవి - 1. తెలుసుకోవటం, తెలియచెప్పటం 2. కాపాడుకోవటం, కాపాడటం 3. ఉపయోగపడటం. ఉపయోగించుకోవటం, 4. శరీరాన్ని ఉపయోగించి పనులు సాధించటం.

ఈ నాలుగింటిలో ఏదో ఒక దానికి పనికి వచ్చే స్వభావం ప్రతిమనిషికి ఉంటుంది. ఈ స్వభావాన్ని బట్టి ఒక మార్గం నచ్చుతుంది. దానిలో నైపుణ్యం కలుగుతుంది. దాని వల్ల వృత్తికర్మ ఏర్పడుతుంది.
ఈ విభాగాలనే పెద్దలు నాలుగు వర్ణాలని చెప్పారు. అవే క్రమంగా 1. బ్రాహ్మణధర్మం తెలుసుకోవటం, తెలియ చెప్పటం), 2. క్షత్రియధర్మం (కాపాడుకోవటం, కాపాడటం), 3. వైశ్యధర్మం (ఉపయోగపడటం, ఉపయోగం పొందటం), 4. శూద్రధర్మం (శరీరబలంతో పనులు చేసుకోవటం, చేసి పెట్టటం).

మానవులు అనుసరించే ఏ వృత్తి అయినా. జీవనోపాధికి చేసే ఏ వని అయినా ఈ నాలుగింటిలో
ఏదో ఒకటి అయి ఉంటుంది.ఈ విభజన ప్రపంచంలోని అన్ని నాగరిక సమాజాలలోనూ స్పష్టంగా కనపడుతుంది.స్పష్టంగా నిర్దేశించబడకపోయినా, పైకి కొట్టవచ్చినట్టుకనపడకపోయినా ప్రతి సమాజంలోనూ ఉంది. సమాజంలోనే కాదు, కుటుంబంలో, ఒక సంస్థలో, ప్రభుత్వంలో, ఒక రాజకీయపక్షంలో.. ఒకటేమిటి. ప్రతిచోటా ఉంది.

పాశ్చాత్యులు కూడా సమాజంలో మనుషులని ఈ విధంగానే విభజించారు. పాశ్చాత్య తత్త్వవేత్త, రాజనీతి విశారదుడు అయిన అరిస్టాటిల్ ఈ విభజననిThinkers, Executers, Financiers, Labourers" కుటుంబానికి కూడా ఇదే వ్యవస్థ వర్తిస్తుంది.

ఉదాహరణకి వంట చెయ్యాలంటే ఎట్లా పండాలో తెలియటం జ్ఞానం. లేచి వండటం కార్యం. కావలసిన బియ్యం, పప్పు, ఉప్పు మొదలైనవి పదార్థాలు ఉండటం అదే అర్థం. ఏం వండుతున్నారో తెలియవలసిన పని లేకుండా అడిగినవి అందించటం సేవ, ఈ విధంగా ఏది చెయ్యాలన్నా నాలుగు అంగాలు సహకరించాలి.

సందర్భాన్ని బట్టి ఒకే వ్యక్తి ఈ నాలుగు పనులు చేయటం కూడా చూడవచ్చు. ఈ రకమైన విభజనని శాస్త్రీయంగా చేసి దానికి మూలమైన మనస్తత్వాన్ని, క్రియాశీలతని పరిగణనలోకి తీసుకుని సమాజంలోని మనుషులని వర్గీకరించాడు శ్రీకృష్ణుడు. 

కొసమెరుపుగా చెప్పిన మాట ఈ విభాగాల్లోకి మానవులు స్వయంగా చేరినా, స్వభావాల విభజన చేసింది తనేనని, అందరిలోనూ విభాగాలకి అతీతంగా తాను ఉంటానని చెప్పాడు. అతీతంగా ఉంటాడు కనుకనే ఏ విభాగానికి అయినా చెందేట్టు ప్రవర్తిస్తూ ఉంటాడు. ఒకే వ్యక్తి వేరు వేరు సందర్భాల్లో వేరు వేరు వర్ణాలకి చెందిన వాడుగా ఉండటం సాధ్యమా? తల్లి.. పిల్లలకి బుద్ధి చెప్పేటప్పుడు జ్ఞానస్వరూపిణి వంటలు. వడ్డనలు చేసేప్పుడు కార్యశీలి. ధనరూపంగానో వస్తురూపంగానో కుటుంబానికి తోడుపడినప్పుడు. ఆర్థిక సహాయకురాలు. చిన్న పెద్ద అని చూడకుండా సేవ చేసినప్పుడు సేవకురాలు.

త్రిగుణాల సమ్మేళనం వల్ల ఏర్పడిన స్వభావం కారణంగా ఏర్పడి, స్థిరపడిన వర్గవిభాగం సమాజానికి వర్తిస్తుంది. ఇది స్థూలం, గుణం వల్ల ఏర్పడినది. నిజానికి ఈ రెండూ కలిసి ఉన్నదే దైవ స్వరూపం.
మరొక్క ముఖ్యాంశం.. వర్గం, కులం ఒక్కటి కాదు. ఇది అర్థమయితే ఎన్నో సామాజిక సమస్యలు మటుమాయం అవుతాయని పండితులు చెబుతున్నారు.