లక్ష రూపాయల సాఫ్ట్ వేర్ ఉద్యోగం.. 26 ఏళ్ల అమ్మాయి..అమ్మపై బెంగతో ఆత్మహత్య

లక్ష రూపాయల సాఫ్ట్ వేర్ ఉద్యోగం.. 26 ఏళ్ల అమ్మాయి..అమ్మపై బెంగతో ఆత్మహత్య

 హైదరాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ నెలకు లక్షరూపాయలు సంపాదిస్తూ హాయిగా జీవితం ఎంజాయ్ చేయాల్సిన అమ్మాయి హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. పెళ్లి చేసుకుంటే అనారోగ్యంతో ఉన్న తన తల్లి.. ఎక్కడ ఒంటరై పోతుందేమోనని బెంగతో ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలిచివేస్తోంది. 

అసలేం జరిగిందంటే..?

ఆదివారం హుస్సేన్ సాగర్​లో దూకి ఆత్మహత్య చేసుకున్న యువతిని పోలీసులు సోమవారం ట్రేస్ అవుట్ చేశారు. లేక్ ఇన్​స్పెక్టర్ ఆర్. వెంకటేశ్వర్లు వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ బైంసాకు చెందిన విజయలక్ష్మి (26) తన తండ్రి చనిపోవడంతో తల్లితో కలిసి కూకట్​పల్లిలోని మోతి నగర్​లో అద్దెకు ఉంటోంది. ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ నెలకు లక్ష రూపాయల జీతం తీసుకుంటోంది.

తల్లి పూర్తిగా అనారోగ్యంతో ఉండడంతో ఆమె బాగోగులు చూసుకుంటోంది. కజిన్  బ్రదర్స్ వీరికి అండగా ఉంటూ విజయలక్ష్మికి పెండ్లి సంబంధాలు చూస్తున్నారు. దీంతో “నేను పెండ్లి చేసుకుని వెళ్లిపోతే తల్లికి చాలా ఇబ్బంది అవుతుంది” అనే ఆలోచనతో ఆమె అనేకసార్లు మదన పడేదని బాధిత కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో ఏం చేయాలో తెలియక తన ల్యాప్​టాప్​లో “ఆత్మహత్య ఎలా చేసుకోవాలి” అని సెర్చ్ చేసింది.

జనవరి 31న రాపిడో టూ వీలర్ బుక్ చేసుకుని మధ్యాహ్నం 12:30 గంటలకు ట్యాంక్ బండ్ చేరుకుని అన్నమయ్య విగ్రహం వద్ద హుస్సేన్ సాగర్​లో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె కజిన్​బ్రదర్స్ కూకట్‌పల్లి పీఎస్​లో ఫిర్యాదు చేయగా, డెడ్​బాడీని ట్రేస్ చేశారు. ల్యాప్​టాప్​లో ఆత్మహత్య ఎలా చేసుకోవాలనే సెర్చ్ కనిపించినట్లు లేక్ పోలీసులు తెలిపారు. తల్లి అనారోగ్యం, పెండ్లి సంబంధాలు మానసిక బాధతో విజయలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నట్లు ఇన్​స్పెక్టర్ తెలిపారు.