చెరువు మట్టికి ఎక్కడ లేని డిమాండ్

చెరువు మట్టికి ఎక్కడ లేని డిమాండ్
  • సర్కారు నిర్లక్ష్యంతో దోచుకుంటున్న అక్రమార్కులు

హైదరాబాద్ : చెరువుల్లో మట్టి కొన్ని పంచాయతీలకు, ప్రభుత్వానికి కోట్లు కురిపిస్తోంది. గతంలో మిషన్ కాకతీయ కింద టీఆర్ఎస్​ సర్కారు రూ.9వేల కోట్లకు పైగా ఖర్చు చేసి చెరువుల్లో పూడికతీయిస్తే, ఇప్పుడు పంచాయతీలకే ఉల్టా కోట్లు ఇచ్చి మరీ మట్టి తవ్వుకపోతున్నారు. పెద్ద ఎత్తున వ్యవసాయ భూములను వెంచర్లుగా మారుస్తుండడం, రోడ్ల విస్తరణ, ప్రాజెక్టుల నిర్మాణానికి, ఇటుకల తయారీకి భారీగా మట్టి అవసరం అవుతుండడంతో కాంట్రాక్టర్లంతా ఇప్పుడు చెరువుల వైపు చూస్తున్నారు. దీంతో చెరువుమట్టికి ఎక్కడ లేని డిమాండ్ ​వచ్చింది. కానీ సర్కారు దీనిని సరిగ్గా ఉపయోగించుకోకపోవడం వల్ల చాలాచోట్ల అక్రమార్కులపాలవుతోంది.

జిల్లాల ఏర్పాటు తర్వాత పెరిగిన డిమాండ్​ :-
కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందు మిషన్​కాకతీయ పేరుతో చెరువుల్లో మట్టి తొలగించేందుకు సర్కారు కోట్లు ఖర్చు చేయగా, ప్రస్తుతం సీన్​ రివర్స్​అయింది. 2016లో జరిగిన జిల్లాల విభజన తర్వాత  పట్టణీకరణ పెరిగిపోయింది. ప్రభుత్వమే పనిగట్టుకొని 70కి పైగా మేజర్​గ్రామపంచాయతీలను చుట్టుపక్కల గ్రామాలతో కలిపి మున్సిపాలిటీలుగా మార్చింది. దీంతో రియల్​ఎస్టేట్​విస్తరించి పొలాలు వెంచర్లుగా మారుతున్నాయి. కన్​స్ట్రక్షన్స్​ఎక్కువై ఇటుక అవసరం పెరిగింది. కొత్తగా కట్టే ఇరిగేషన్​ప్రాజెక్టులు, నేషనల్​హైవేల విస్తరణకూ భారీ ఎత్తున మట్టి అవసరమవుతోంది. గతంలో గుట్టల నుంచి, ఫారెస్ట్​ నుంచి మట్టి అక్రమ రవాణా ఎక్కువగా జరిగేది. ఈ దందాపై అటవీ అధికారులు ఉక్కుపాదం మోపుతుండడంతో చెరువులపై పడ్డారు. 

 

స్థానిక డిమాండ్​కు అనుగుణంగా :-
పెద్దపల్లి జిల్లాలో 2018 వరకు 20 ఇటుక బట్టీలుండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 136కు చేరింది. ఇటుక తయారీలో వాడే మట్టికి డిమాండ్​పెరగడంతో గుర్తించిన ప్రభుత్వం చెరువుల్లో మట్టి తవ్వకాల బాధ్యతలను మైనింగ్ శాఖకు అప్పగించింది. దీంతో జిల్లాలోని చెరువుల్లో మట్టి తవ్వకాల కోసం జోరుగా వేలం పాటలు నడుస్తున్నాయి. ఒక్కో టన్నుకు మైనింగ్​శాఖ రూ.36 చొప్పున వసూలు చేస్తుండగా, ఇందులోంచి రూ.9 డిస్ట్రిక్​డెవలప్​మెంట్​ఫండ్​కు జమ చేస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో పాలమూరు– రంగారెడ్డి పనులు నడుస్తుండగా కావాల్సిన మట్టి కోసం కాంట్రాక్టర్లు చెరువులపై పడ్డారు. అధికారికంగా ఒకటి, రెండు చెరువుల్లో పర్మిషన్​ తీసుకొని వందల చెరువుల్లో మట్టి తవ్వకాలు చేపడ్తున్నారు. ఈ క్రమంలో ఇక్కడ చెరువుల్లో మట్టి  కోట్లలో పలుకుతోంది. తిమ్మాజీపేట మండలంలోని మారేపల్లి, ఆవంచ, బుద్ధసముద్రం, నేరేళ్లపల్లి, పోతిరెడ్డిపల్లి చెరువుల నుంచి మట్టి తవ్వకాల కోసం పంచాయతీలతో రూ. కోటి చొప్పున అగ్రిమెంట్లు చేసుకున్నారు. బిజినేపల్లి మండలం బోయపూర్, లింగమయ్య కుంట, గుడ్లనర్వ, ఖానాపూర్, రసూల్ కుంట చెరువులు కూడా రూ.కోటి పలికాయి. శాయిన్​పల్లిలో మూడు  కుంటలకు రూ.25 లక్షలు, వసంతాపూర్​లో మూడు కుంటలకు రూ.25లక్షలు ఇచ్చారు. వట్టెంకట్ట పనులు చేస్తున్న హెచ్ఈఎస్​ కంపెనీకి పాలెం పెంటోని చెరువు శిఖం భూముల నుంచి నల్లమట్టి తరలించేందుకు మైనర్ ఇరిగేషన్ శాఖ పర్మిషన్ ఇచ్చింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్ గూడెం నుంచి గోపాల్​రావు పేట వరకు నేషనల్ హైవే కోసం కాంట్రాక్టర్లు చుట్టూ ఉన్న ఊళ్లలోని చెరువుల నుంచి మట్టి తరలించుకపోతున్నారు. కొందరు కాంట్రాక్టర్లు రాయల్టీ చెల్లిస్తుండగా.. మరికొందరు సర్పంచ్ లకు పెద్దమొత్తంలో ముట్టజెప్పి మట్టిని తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి.  నారాయణపేట జిల్లాలో ఇటుక బట్టీల యజమానులు సర్పంచులతో రూ.లక్షల్లో అగ్రిమెంట్లు చేసుకొని అనధికారికంగా మట్టి తవ్వుకొని పోతున్నారు. తవ్వకాలను ఆపేందుకు ఇరిగేషన్ అధికారులు ప్రయత్నిస్తే టీఆర్ఎస్​ లీడర్లు జోక్యం చేసుకుంటున్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చెప్యాల ఊర చెరువు నుంచి మట్టి తరలించేందుకు గ్రామ పంచాయతీలో తీర్మానం చేసి పర్మిషన్​ ఇచ్చారు. ఇక్కడ ఒక్కో క్యూబిక్​ మీటర్​కు గనుల శాఖకు రూ.  30,  ఇరిగేషన్ శాఖకు రూ. 70 రాయల్టీ కింద చెల్లిస్తుండడం విశేషం. 

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం రెడ్డిఖానాపూర్ మామిడి చెరువులో మట్టి తవ్వకాల కోసం గ్రామ పంచాయతీ ఏప్రిల్ లో వేలం వేయగా, గ్రామానికి చెందిన కొందరు పెద్దలు రూ. కోటి 90 లక్షలకు దక్కించుకున్నారు. మిషన్​ కాకతీయ కింద  రూ. 75 లక్షలు కట్టి మరో కాంట్రాక్టర్​ అదే చెరువు నుంచి మట్టిని తవ్వుకునేందుకు కలెక్టర్​నుంచి పర్మిషన్​తీసుకున్నారు. తమ గ్రామానికి రావాల్సిన వేలం డబ్బు సర్కారుకు పోతుండడంతో ఆవేశానికి లోనైన గ్రామస్థులు ఇటీవల కాంట్రాక్టర్​చేపడుతున్న మట్టి తవ్వకాలకు అడ్డు తగిలారు

అనధికారికంగా తవ్వకాలు :-
తెలంగాణలో మొత్తం 46 వేల చెరువులున్నాయి. మిషన్​ కాకతీయ కింద ప్రభుత్వం నాలుగు విడతల్లో 22వేల చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టింది. ఇందుకోసం రూ. 9వేల కోట్ల దాకా ఖర్చు చేసింది. అప్పట్లో మట్టిని ఉచితంగా రైతుల పొలాలకు  తరలించింది. మొదటి, రెండు విడతల్లో చెరువు మట్టిని పొలాలకు తోలుకున్న రైతులు ఆ తర్వాత పెద్దగా ఇంట్రెస్ట్​ చూపలేదు. ఆ తర్వాత కూడా ప్రతీ ఏప్రిల్, మే నెలల్లో అడపాదడపా చెరువుల్లో పూడిక తీత పనులు చేస్తున్నారు.  కానీ ఇందుకోసం ఇప్పుడు సర్కారు ఎలాంటి ఫండ్స్ ఖర్చు పెట్టే పరిస్థితి లేకుండా పోయింది. ఆయాచోట్ల మట్టికి ఉన్న డిమాండ్​ఆధారంగా మైనింగ్​, కొన్నిచోట్ల ఇరిగేషన్​ఆఫీసర్లు క్యూబిక్​మీటర్​కు ఇంత అని రేట్​ఫిక్స్​చేసి పర్మిషన్లు ఇస్తున్నారు. అధికారికంగా పర్మిషన్​ తీసుకున్న కాంట్రాక్టర్ల నుంచి కొన్ని పంచాయతీలు గ్రామాభివృద్ధి ఫండ్స్​వసూలు చేస్తుండగా, ఇంకొన్ని పంచాయతీలు అనధికారికంగా వేలం పాటలు నిర్వహించి మరీ మట్టి తవ్వకాలకు పర్మిషన్​ఇస్తున్నాయి. ఈ క్రమంలో తెరవెనుక పెద్దమొత్తంలో పైసలు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.

మరిన్ని వార్తల కోసం : -

ఒక్క వాడ మునిగితే హైదరాబాద్‌‌ మునిగిందని రాయొద్దు


30 ఏండ్లు దాటినోళ్లందరికీ బీపీ, షుగర్ చెక్ చేయాలి