తల్లికి అదిరిపోయే రిటైర్‌‌మెంట్ గిఫ్ట్

తల్లికి అదిరిపోయే రిటైర్‌‌మెంట్ గిఫ్ట్

తల్లిదండ్రుల్లో ఎవరైనా రిటైర్ మెంట్ అవుతుంటే.. వారి కుమార్తెలు, కుమారులు ఫంక్షన్ ఏర్పాటు చేయడం.. గిఫ్ట్ లు అందించడం చేస్తుంటారు. మరికొందరు సేవా కార్యక్రమాలు చేస్తారు. ఇలా ఎవరికి తోచింది వారు చేస్తుంటారు. కానీ.. ఓ తల్లికి మాత్రం కుమారుడు జీవితాంతం గుర్తుండిపోయేలా అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. ఆ గిఫ్ట్ చూసిన నెటిజన్లు కుమారుడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. శభాష్ అంటూ ప్రశంసిస్తున్నారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజస్థాన్ అజ్మీర్ లోని తోప్ బ్రా గ్రామంలో సుశీలా చౌహాన్ కుటుంబం నివాసం ఉంటోంది. కేసర్ పురా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. ఈమె కుమారుడు యోగేశ్ చౌహాన్ అమెరికాలో ఉంటున్నాడు. 33 ఏళ్ల పాటు ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తించిన సుశీలా శనివారం పదవీ విరమణ పొందారు.

ఈ విషయం ముందే తెలుసుకున్న యోగేశ్ స్వగ్రామానికి చేరుకున్నాడు. పదవీ విరమణ రోజు తల్లికి అదిరిపోయేలా గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అందుకు ముందుగానే ఏర్పాట్లు చేసుకున్నాడు. శనివారం సుశీలా పదవీ విరమణ అనంతరం ఆమెను హెలికాప్టర్ లో తోప్ బ్రా గ్రామానికి తీసుకెళ్లాడు. హెలికాప్టర్ లో తిరుగుతున్నప్పుడు ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. హెలికాప్టర్ రాగానే గ్రామ ప్రజలు అక్కడకు చేరుకున్నారు. యోగేశ్ ను ప్రశంసలతో ముంచెత్తారు. తాను అమెరికాలో ఉంటున్నానని, అమ్మ పదవీ విరమణ కార్యక్రమం ఉందని తెలియడంతో  ఊరికి వచ్చానని  యోగేశ్ చెప్పాడు. తనకు ఇటీవలే ఆడబిడ్డ జన్మించిందని.. చిన్నారిని హెలికాప్టర్ లో తీసుకురావాలని అమ్మకు కోరిక ఉండేదన్నారు. అది కొన్ని కారణాల వల్ల తీరలేదన్నారు. అందుకే అమ్మను రిటైర్ మెంట్ రోజున హెలికాప్టర్ లో తీసుకరావడం జరిగిందన్నారు.