జగిత్యాల జిల్లాలో తల్లిని పాడుబడ్డ ఇంట్లో వదిలేసిన కొడుకులు

జగిత్యాల జిల్లాలో తల్లిని పాడుబడ్డ ఇంట్లో వదిలేసిన కొడుకులు
  •     విషయం బయటకు పొక్కడంతో ఇంటికి తీసుకెళ్లిన వైనం

కొడిమ్యాల, వెలుగు: మదర్స్  డే రోజే ఓ తల్లిని కొడుకులు పాడుబడ్డ ఇంట్లో ఒంటరిగా వదిలేశారు. నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నప్పటికీ ఆమెను పట్టించుకోకపోవడంతో తిండి, నీళ్లు లేక మతిస్థిమితం కోల్పోయిన స్థితిలో ఆ వృద్ధురాలు అనాథలా మారింది. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన వడ్లకొండ రాజవ్వ(90) కు నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ప్రస్తుతం వారు కరీంనగర్, కోరుట్ల, ముంబైలో నివసిస్తున్నారు. భర్త నారాయణ కొన్నేండ్ల కింద చనిపోవడంతో రాజవ్వ ఒంటరిగా ఉంటోంది. కష్టపడి సంపాదించిన లక్షల ఆస్తులు, రెండు ఇండ్లు, స్థలాలను పిల్లలకు సమానంగా పంచిపెట్టింది. ఆ తరువాత ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. రెండేళ్లుగా కొడుకులు వంతుల వారీగా తల్లిని చూసుకుంటున్నారు. 

ఈక్రమంలో ఆదివారం మదర్స్  డే రోజు ఓ కొడుకు తన వంతు పూర్తయిందని తల్లిని కరీంనగర్  నుంచి తీసుకొచ్చి కొడిమ్యాలలోని పాత ఇంట్లో వదిలేసి వెళ్లిపోయాడు. తినడానికి తిండి, తాగడానికి నీళ్లు లేక ఇబ్బంది పడుతూ రాజవ్వ మతిస్థిమితం కోల్పోయిన స్థితిలో బిక్కుబిక్కుమంటూ కనిపించింది. చుట్టుపక్కల వారు గమనించి ఆమెకు భోజనం, నీళ్లు అందించారు. రాజవ్వకు సరైన వైద్యం అందించి, ఆమె బాగోగులు చూసేలా కొడుకులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే విషయం బయటకు పొక్కడంతో కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో ఉంటున్న కొడుకు వెంటనే కొడిమ్యాలకు చేరుకొని తల్లిని తన వెంట తీసుకెళ్లాడు. పెద్ద మనుషుల సమక్షంలో సమస్యను పరిష్కరించుకుంటామని కుటుంబ సభ్యులు తెలిపారు.