కోల్‌కతా: ఇండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ మరోసారి బ్యాట్ పట్టాడు. బౌండ్రీలు కొట్టి అదరగొట్టాడు. తన ట్రేడ్‌మార్క్ ఆఫ్‌సైడ్ డ్రైవ్స్‌తో ఫోర్లు, క్రీజు ముందుకొచ్చి సిక్సర్లు కొట్టాడు. శుక్రవారం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన బీసీసీఐ ఏజీఎమ్ ఫెస్టివల్ మ్యాచ్ ఇందుకు వేదికైంది. అయితే, దాదా బ్యాట్‌తో మెరిసినా అతని కెప్టెన్సీలోని బీసీసీఐ ప్రెసిడెంట్స్ ఎలెవన్ ఒక్క రన్ తేడాతో జై షా కెప్టెన్సీలోని సెక్రటరీ ఎలెవన్ చేతిలో ఓడిపోయింది. బీసీసీఐ ఏజీఎంకు ముందు జరిగిన ఈ15 ఓవర్ల ఫ్రెండ్లీ మ్యాచ్‌లో తొలుత సెక్రటరీ టీమ్ 128/3 స్కోరు చేసింది. ఛేజింగ్‌లో ఆరో నంబర్‌లో ఫినిషర్‌గా వచ్చిన గంగూలీ 20 బాల్స్‌లోనే 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 రన్స్ చేశాడు. కానీ, మ్యాచ్ రూల్స్ ప్రకారం తను రిటైరవగా.. తర్వాత ప్రెసిడెంట్స్ టీమ్ తడబడి 127/5 స్కోరు వద్దే ఆగి ఓడిపోయింది. సెక్రటరీ టీమ్ కెప్టెన్ జై షా (3/58) తన స్పెల్‌లో అజరుద్దీన్ (2) సహా ముగ్గురిని ఔట్ చేసి త జట్టును గెలిపించాడు. అంతకుముందు అజరుద్దీన్‌తో కలిసి కొత్త బాల్‌తో బౌలింగ్ చేసిన గంగూలీ ఓ వికెట్ కూడా పడగొట్టాడు.

