- దక్షిణ మధ్య రైల్వే ప్రకటన
హైదరాబాద్, వెలుగు: హోలీ పండుగ సందర్భంగా ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, సౌకర్యవంతంగా ప్రయాణించేలా దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) భారీ ఏర్పాట్లు చేసింది. పండుగ సమయంలో పెరిగే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ప్రధాన సిటీల మధ్య మెరుగైన కనెక్టివిటీని అందించడానికి160 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఈ ప్రత్యేక సర్వీసులన్ని మార్చిలో అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఎస్సీఆర్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి దేశంలోని ప్రధాన గమ్యస్థానాలకు ఈ రైళ్లు బయలుదేరుతాయని చెప్పింది.
పలు కీలక మార్గాల్లో ఈ రైళ్లు నడపనున్నామని పేర్కొంది. విశాఖపట్నం, పాట్నా, రాజ్‌కోట్, సోలాపూర్, బిలాస్‌పూర్, దానాపూర్, రక్సాల్, నహర్లగన్, హజ్రత్ నిజాముద్దీన్, షాలిమార్, హిస్సార్, లక్నో, సంత్రగచ్చి, మాల్దా టౌన్, ఛప్రా వంటి ముఖ్యమైన ప్రాంతాలకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈ ప్రాంతాల నుంచి రిటర్న్ సర్వీసులను కూడా ప్లాన్ చేశామని వివరించింది.
