- ఆగస్టు 3 నాటికి 100% డిజిటలైజేషన్ పూర్తి చేయాలని కలెక్టర్లకు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియకు, ప్రభుత్వం పేదలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఎలాంటి సంబంధమూ లేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. సర్ ప్రక్రియ పురోగతి, ఫారాల డిజిటలైజేషన్ అంశాలపై జిల్లా ఎన్నికల అధికారులు, కలెక్టర్లతో ఆయన బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల్లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, ‘సర్’అనేది కేవలం పారదర్శకమైన, తప్పులు లేని ఓటరు జాబితా రూపకల్పనకు మాత్రమే ఉద్దేశించిందని వివరించారు.
ఎన్యూమరేషన్ ఫారాలను సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు కేవలం మరో 5 రోజుల గడువు మాత్రమే మిగిలి ఉందని, అందుకే ఆగస్టు 3 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 100 శాతం డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ మొత్తం 76 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందని, గ్రామీణ ప్రాంతాల్లో ఇది 90 శాతానికి చేరిందని తెలిపారు. ఖానాపూర్, బాల్కొండ, ఎల్లారెడ్డి, హజూర్ నగర్, నర్సంపేట్, వర్ధన్నపేట, పరకాల, బోధన్ నియోజకవర్గాల్లో వంద శాతం డిజిటలైజేషన్ పూర్తి చేసిన అధికారులను సీఈవో ప్రత్యేకంగా అభినందించారు.
పట్టణ ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్
శేరిలింగంపల్లి, రంగారెడ్డి, మేడ్చల్, గ్రేటర్ హైదరాబాద్ (జీహెచ్ఎంసీ) పరిధితోపాటు నిజామాబాద్, వరంగల్, ఖమ్మంలాంటి ప్రధాన పట్టణాల్లో ప్రత్యేక దృష్టి సారించి గడువులోగా డిజిటలైజేషన్ పూర్తి చేయాలని కలెక్టర్లను సీఈవో సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. ఎన్యూమరేషన్ ఫారాలను అప్‌లోడ్ చేసేటప్పుడు ఓటర్ల పేర్లు, వివరాలు తప్పులు లేకుండా నమోదు చేసేలా బీఎల్వోలు, సూపర్ వైజర్లు అత్యంత జాగ్రత్త వహించాలని, ఈ ప్రక్రియను ఈఆర్వోలు, ఏఈఆర్వోలు నిరంతరం సమీక్షించాలని సూచించారు.
డిజిటలైజేషన్ ప్రక్రియలో ఏమాత్రం అలసత్వం వహించినా క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పనులను వేగవంతం చేయాలని, ముఖ్యంగా ఒకే కుటుంబానికి చెందిన సభ్యులందరి ఓట్లు వేర్వేరు చోట్ల కాకుండా ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
వీఐపీ ఓటర్ల మ్యాపింగ్
ఓటర్ల జాబితా సమగ్రత కోసం నిబంధనలు పాటించాలని అధికారులకు సీఈవో సూచించారు. ఓటర్లలో మరణించిన వారు, ఇళ్లు మారిపోయిన వారు, అందుబాటులో లేని వారి తుది జాబితాను సిద్ధం చేసే సమయానికి అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు చెందిన బీఎల్‌ఏల(పోలింగ్ ఏజెంట్లు) సంతకాలను తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించారు. పారదర్శకతను పెంపొందించే క్రమంలో జిల్లా, ఈఆర్వో, ఏఈఆర్వో, బీఎల్వో స్థాయిల్లో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించే సమావేశాలను వీడియో రికార్డింగ్ చేసి పక్కాగా డాక్యుమెంట్ చేయాలని వెల్లడించారు. వీటితోపాటు ప్రముఖులు, వీఐపీ, వీవీఐపీ ఓటర్ల వివరాలను ప్రత్యేకంగా గుర్తించి మ్యాపింగ్ చేయాలని ఆదేశించారు.
