హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఆవిర్భావ దినోత్స వ వేడుకల సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన పోలీస్ దళాల కవాతు ప్రదర్శనలో ప్రత్యేక రక్షణ దళం (ఎస్‌పీఎఫ్-) అద్భుత ప్రతిభ కనబరిచింది. క్రమశిక్షణ, అడుగడుగునా దేశభక్తి ఉట్టిపడేలా సాగిన ఈ పరేడ్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో ఎస్‌పీఎఫ్ బలగాలు ద్వితీయ బహుమతిని కైవసం చేసుకున్నాయి.
ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు దక్కడంపై ఎస్‌పీఎఫ్ విభాగంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఎస్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్ (డీజీ) ఐపీఎస్ స్వాతి లక్రాను ఆ శాఖ ఉన్నతాధికారులు, కమాండెంట్లు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రస్థాయిలో విభాగం కీర్తిని ప్రతిష్టాత్మకంగా నిలిపినందుకు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. డీజీని కలిసిన వారిలో కమాండెంట్లు త్రినాథ్, దేవిదాస్, జంగయ్యతో పాటు అసిస్టెంట్ కమాండెంట్లు రంజిత్, సన్యాసిరావు, సత్తయ్య, రాజు, ఇన్‌స్పెక్టర్ అశోక్ ఉన్నారు.
