శ్రీలంకలో ఎన్‌కౌంటర్..15 మంది మృతి

శ్రీలంకలో ఎన్‌కౌంటర్..15 మంది మృతి

శ్రీలంకలో హైటెన్షన్ కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి మరో మూడు ప్రాంతాల్లో బాంబులు పేలడంతో ప్రజలంతా భయంతో వణికిపోతున్నారు.  కొలంబోలోని  సమ్మంతురై అనే ప్రాంతంలో తమను భద్రతా దళాలు చుట్టుముట్టాయని తెలియడంతో ముగ్గురు ఉగ్రవాదులు వారిపై కాల్పులు ప్రారంభించారు.  దీంతో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసకున్నాయి. కొంతసేపటి తర్వాత ఆ ఉగ్రవాదులు తమను తాము పేల్చేసుకున్నారు. ఈ ఘటనలో మొత్తం 15 మంది మృతి చెందారు.  మృతి చెందిన వారిలో ముగ్గురు మహిళలు, ఆరుగురు చిన్న పిల్లలు ఉన్నట్టు సమాచారం. పేలుడు జరిగిన ప్రాంతం నుంచి భద్రతా బలగాలు భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. హతమైన ఉగ్రవాదులు నేషనల్ తౌహీద్ జమాత్ (ఎన్‌టీజే) సభ్యులుగా అనుమానిస్తున్నారు.

మరోవైపు  పోలీసుల కూంబింగ్ , కర్ఫ్యూ కొనసాగుతున్నా బాంబులు పేలుతుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన చెందుతున్నారు. తాజా పేలుళ్లతో అప్రమత్తమైన శ్రీలంక సర్కార్.. మరిన్ని బలగాలను మోహరించింది. అనుమానాస్పద ప్రాంతాల్లో పోలీసులు దాడులు చేస్తున్నారు. మరిన్ని ప్రాంతాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న హెచ్చరికలతో దేశమంతా హై అలెర్ట్ ప్రకటించింది శ్రీలంక సర్కార్.