టెస్సెరాక్ట్‌‌‌‌కు, సీఎం సోదరుడికి సంబంధం లేదు

టెస్సెరాక్ట్‌‌‌‌కు, సీఎం సోదరుడికి సంబంధం లేదు
  •      రేవంత్ కుటుంబంపై ఫేక్ డాక్యుమెంట్లతో తప్పుడు ప్రచారం: మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి కంపెనీకి తక్కువ ధరకే భూములు కేటాయించారంటూ వస్తున్న వార్తలు పచ్చి అబద్ధమని ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. టెస్సెరాక్ట్ అడ్వాన్స్‌‌‌‌డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌‌‌‌కు.. సీఎం సోదరుడికి ఎలాంటి సంబంధం లేదని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా.. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబంపై ఫేక్ డాక్యుమెంట్లతో చేస్తున్నది తప్పుడు ప్రచారమని ఖండించారు. రావిర్యాలలో టెస్సెరాక్ట్ అడ్వాన్స్‌‌‌‌డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌‌‌‌కు భూ కేటాయింపు ప్రక్రియ రహస్యంగా జరగలేదన్నారు. 

బీఆర్ఎస్, బీజేపీ ఆడుతున్న మైండ్‌‌‌‌గేమ్

కన్సల్టేటివ్ కమిటీ ఆన్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ కమిటీ ఆమోదం, పూర్తి పారదర్శకతతో నిబంధనల ప్రకారమే టెస్సెరాక్ట్‌‌‌‌కు భూములను కేటాయించామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. వండి వార్చిన వార్తలతో ప్రజల దృష్టిని మరల్చేందుకు బీఆర్ఎస్, బీజేపీ ఆడుతున్న మైండ్ గేమ్ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ భూ దోపిడీల బాగోతాలు బయటకు రాకుండా అడ్డుకునేందుకు ఆ పార్టీ నేతలు ఆడుతున్న పొలిటికల్ డ్రామా అని విమర్శించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ప్రభుత్వం, సీఎం కుటుంబంపై తప్పుడు సమాచారంతో ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధిని, రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ కుట్ర చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. భూ కేటాయింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం నూటికి నూరు శాతం పారదర్శకత పాటిస్తోందని, ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.     

రాజకీయ లబ్ధికోసమే కేటీఆర్ డ్రామాలు 

రాయదుర్గంలో నిర్మించనున్న పీఎం ఏక్తా మాల్‌‌‌‌పై రాజకీయ లబ్ధి కోసమే కేటీఆర్ పొలిటికల్ డ్రామా ఆడుతున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పీఎం ఏక్తా మాల్ టెండర్లలో ఎటువంటి అవకతవకలు జరగలేదని, పూర్తి నిబంధనల ప్రకారమే అత్యంత పారదర్శకంగా ఈ ప్రక్రియ జరిగిందని పేర్కొన్నారు. పీఎం ఏక్తా మాల్ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్లు, ఫైనాన్షియల్ మోడల్, డీపీఆర్ సహా పూర్తి వివరాలను వెంటనే ప్రభుత్వానికి అందజేయాలని తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ అధికారులను ఆదేశించానన్నారు. జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టులపై కూడా కేటీఆర్ రాజకీయం చేయడం సరికాదని హితవు పలికారు.