- కల్వకుర్తి ఆయకట్టు ప్రశ్నార్థకం.. ఆగస్టు వరకు కాల్వల నీరు బంద్?
నాగర్ కర్నూల్, వెలుగు: వర్షాభావ పరిస్థితులతో శ్రీశైలం ప్రాజెక్టు వెలవెల బోతున్నది. జులై రెండో వారంలోనూ కృష్ణా బేసిన్ లోని కృష్ణా నదితో పాటు ఉపనదులకు వరద ప్రవాహం మొదలు కాకపోవడంతో ప్రాజెక్టు అడుగంటింది. శ్రీశైలం రిజర్వాయర్‌లో ప్రస్తుతం 39 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఉన్న ఈ నీటిని 5 జిల్లాల తాగు నీటి అవసరాలకు వాడుతున్నారు. దీంతో ఈ ప్రాజెక్టు కింద ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది. నిరుడు ఎగువన కురుసిన భారీ వర్షాల కారణంగా వరద ప్రవాహంతో జూన్ 29న శ్రీశైలం ప్రాజెక్ట్‌లో ఒక గేట్ ఎత్తి నీటిని దిగువకు వదిలారు. సరిగ్గా జులై 12న 10 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు.
ఈ ఏడాది జులై1న శ్రీశైలం ప్రాజెక్ట్ రిజర్వాయర్ వివరాలు వెబ్‌సైట్‌లో నమోదు చేసిన కేఆర్‌ఎంబీ అధికారులు.. గడిచిన 12 రోజులుగా ఆ వివరాలను మాత్రం బయటకు వెల్లడించడం లేదు. కృష్ణానది బ్యాక్ వాటర్‌పై నిర్మించిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద వానాకాలంలో దాదాపు 4.51 లక్షల ఎకరాలు సాగుకావాల్సి ఉండగా.. జులై రెండో వారంలో సగానికిపైగా విత్తనాలు వేయలేని పరిస్థితి నెలకొన్నది. బోర్ల కింద నీటి వసతి ఉన్న రైతులు మాత్రమే పత్తి, మక్కజొన్న వేసుకున్నారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్‌లోని ఎల్లూరు, సింగోటం, జొన్నలబొగడ, గుడిపల్లిగట్టు రిజర్వాయర్లలో నామమాత్రంగా కూడా నీటి నిల్వలు లేవు. ప్రధాన కాల్వలు ఎక్కడికక్కడ ఎండిపోయి కనిపిస్తున్నాయి.
ఎల్లూరు పంప్‌హౌస్ నుంచి మిషన్ భగీరథ తాగునీటి అవసరాల కోసం ఒక పంప్ నడిపిస్తున్నారు. కేఎల్‌ఐ స్కీమ్‌లోని 28, 29, 30 ప్యాకేజీల కింద కొల్లాపూర్, వనపర్తి, నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, జడ్చర్ల నియోజకవర్గాల పరిధిలో 4,51,450 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. గడిచిన రెండు మూడేండ్లుగా విస్తారంగా వర్షాలు కురియడంతో కేఎల్‌ఐ ప్రాజెక్టు కింద నీటిని ఎత్తిపోయాల్సిన అవసరం రాలేదు.
ఆగస్టు వరకు కాల్వల నీళ్లు కష్టమే
కొల్లాపూర్ మండలం రేగుమాన్గడ్డ దగ్గర కృష్ణా బ్యాక్ వాటర్‌ను వినియోగించుకునేలా చేపట్టిన కల్వకుర్తి ఎత్తిపోతల స్కీం ద్వారా 4 రిజర్వాయర్లను నింపి 3 ప్రధాన ప్యాకేజీల ద్వారా నీటి సరఫరా ఇప్పట్లో సాధ్యం కాదని ఇరిగేషన్ అధికారులు అంటున్నారు. కృష్ణా నదికి వరద ప్రవాహం మొదలైతే ఆగస్టు నెల మధ్యలో నీటిని ఎత్తిపోసి కాల్వల ద్వారా సాగుకు ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సాగునీటి లభ్యతపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు వ్యవసాయ, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు, గ్రామ సర్పంచులు, కార్యదర్శులు కృషి చేయాలన్న ఆదేశాలు వెలువడ్డాయి.
