అమిత్‌ అదరకొట్టాడు

అమిత్‌ అదరకొట్టాడు
  • చరిత్ర సృష్టించిన పంగల్‌
  • వరల్డ్‌ బాక్సింగ్‌లో ఫైనల్‌ చేరిన స్టార్‌ బాక్సర్‌
  • నేడు ఒలింపిక్‌ చాంప్‌తో టైటిల్‌ ఫైట్‌
  • కాంస్యం ఖాతాలో వేసుకున్న మనీశ్‌ కౌశిక్‌

ఇండియా స్టార్‌‌ బాక్సర్‌‌, ఆసియా చాంపియన్‌‌ అమిత్‌‌ పంగల్‌‌ (52 కేజీ) వరల్డ్​ బాక్సింగ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో ఫైనల్‌‌కు చేరాడు. మరో యువ బాక్సర్‌‌ మనీశ్‌‌ కౌశిక్‌‌ (63 కేజీ) సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకంతో తన పోరు ముగించాడు. శుక్రవారం జరిగిన సెమీస్‌‌ బౌట్‌‌లో రెండో సీడ్‌‌ అమిత్‌‌ 3–2తో కజకిస్థాన్‌‌ బాక్సర్‌‌ సాకెన్‌‌ బిబొసినొవ్‌‌పై ఉత్కంఠ విజయం సాధించి టైటిల్‌‌ ఫైట్‌‌కు రెడీ అయ్యాడు.

అయితే, కామన్వెల్త్ గేమ్స్‌‌ సిల్వర్‌‌ మెడలిస్ట్‌‌ కౌశిక్‌‌ ఫైనల్‌‌ చేరలేకపోయినా… వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో తొలి ప్రయత్నంలోనే కాంస్యంతో మెప్పించాడు. సెమీస్‌‌లో అతను 0–5తో గత ఎడిషన్‌‌ గోల్డ్‌‌ మెడలిస్ట్‌‌, టాప్‌‌ సీడ్‌‌ ఆండీ గోమెజ్‌‌ క్రుజ్‌‌ (క్యూబా) చేతిలో పరాజయం పాలయ్యాడు. శనివారం జరిగే 52కేజీల ఫైనల్లో పంగల్‌‌.. ఒలింపిక్‌‌ చాంపియన్‌‌ షకొబిదిన్‌‌ జొయిరొవ్‌‌ (ఉజ్బెకిస్థాన్‌‌)తో అమీతుమీ తేల్చుకోనున్నాడు. కాగా, ఒక వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో ఇండియా రెండు మెడల్స్‌‌ నెగ్గడం ఇదే తొలిసారి. గతంలో విజేందర్‌‌ సింగ్‌‌ (2009), వికాస్‌‌ క్రిషన్‌‌ (2011), శివ థాపా (2015), గౌరవ్‌‌ బిధూరి (2017) తలో కాంస్య పతకం గెలిచారు.

పంగల్​ పంచ్​ సూపర్​

సెమీస్‌‌ బౌట్‌‌లో అమిత్‌‌ తనదైన శైలిలో ఆడి ఫలితం రాబట్టాడు. వేగంగా కదులుతూ.. పరిస్థితులకు తగ్గట్టు ఆడిన ఇండియా బాక్సర్‌‌ ప్రత్యర్థి పని పట్టాడు. క్వార్టర్‌‌ఫైనల్లో యూరొపియన్‌‌ గోల్డ్‌‌ మెడలిస్ట్‌‌ అర్టర్‌‌ను ఓడించి వచ్చిన కజక్‌‌ బాక్సర్‌‌ సాకెన్‌‌ బిబొసినొవ్‌‌పై పవర్‌‌ ఫుల్‌‌ పంచ్‌‌లు విసరడంతో పాటు షార్ప్‌‌ డిఫెన్స్‌‌తో ఆకట్టుకున్నాడు.

అయితే, ఫస్ట్‌‌ రౌండ్‌‌లో మాత్రం ప్రత్యర్థి గేమ్‌‌, మూవ్‌‌మెంట్‌‌ను అర్థం చేసుకునేందుకే ఎక్కువ సమయం తీసుకున్నాడు. అదే టైమ్‌‌లో బిబొసినొవ్‌‌ కూడా తొందర పడలేదు. తన హైట్‌‌ను సద్వినియోగం చేసుకొని..అటాక్‌‌ చేసే ప్రయత్నం చేశాడు. కానీ, అతనికి దూరంగా జరుగుతూ తనపై పంచ్‌‌లు పడకుండా అమిత్‌‌ జాగ్రత్త పడ్డాడు. ఒకవేళ పడినా పెద్ద ఇంపాక్ట్‌‌ లేకుండా చూసుకున్నాడు. సెకండ్‌‌ రౌండ్‌‌ నుంచి ఇండియా స్టార్‌‌ వేగం పెంచాడు. క్రమంగా ఎదురుదాడికి దిగిన అమిత్‌‌.. వీలుచిక్కినప్పుడల్లా కజక్‌‌ బాక్సర్‌‌పై పంచ్‌‌లు కొట్టాడు. సాకెన్‌‌ చివరివరకు పోటీ ఇచ్చే ప్రయత్నం చేసినా.. పంగల్‌‌నే విజయం వరించింది. కాగా, మరో సెమీస్‌‌ బౌట్‌‌లో మనీశ్‌‌ కౌశిక్‌‌ మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. క్యూబా బాక్సర్‌‌ క్రుజ్‌‌ అద్భుతమైన కౌంటర్‌‌ అటాకింగ్‌‌ గేమ్‌‌తో అతని పని పట్టాడు.