స్టార్ హాస్పిటల్స్ డేటా హ్యాక్..రోగుల డేటా లీక్‌పై కలకలం

స్టార్ హాస్పిటల్స్ డేటా హ్యాక్..రోగుల డేటా లీక్‌పై కలకలం
  • స్టార్ హాస్పిటల్స్ డేటా హ్యాక్..
  • టీజీసీఎస్‌‌బీలో ఫిర్యాదు, కేసు నమోదు 

హైదరాబాద్‌‌, వెలుగు: స్టార్ హాస్పిటల్స్ డేటా హ్యాకింగ్‌‌కు గురైంది. సంస్థకు చెందిన రహస్య డేటాతో పాటు హాస్పిటల్స్‌‌లోని పేషెంట్స్‌‌కు సంబంధించిన వ్యక్తిగత డేటాను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. https://warehouse.diy డొమైన్‌‌లోని వెబ్‌‌సైట్‌‌లో పోస్ట్ చేశారు. ఈ మేరకు యునిమెడ్ హెల్త్‌‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో రాహుల్ మెడక్కర్ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్‌‌బీ)లో ఫిర్యాదు చేశారు. సీఎస్‌‌బీ అధికారులు ఎఫ్‌‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఎఫ్‌‌ఐఆర్‌‌‌‌లో పేర్కొన్న ప్రధాన అంశాల మేరకు.. యునిమెడ్ హెల్త్‌‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ స్టార్ హాస్పిటల్స్‌‌ను నిర్వహిస్తోంది. సాధారణ వ్యాపార కార్యకలాపాల్లో భాగంగా సంస్థ సున్నితమైన డేటాతో పాటు రోగుల హెల్త్‌‌ప్రొఫైల్‌‌ డేటాను అత్యంత రహస్యంగా స్టోర్‌‌‌‌ చేస్తున్నది. ఈ సమాచారాన్ని కేవలం విక్రేతల ద్వారా పొందే సేవలకు మాత్రమే పరిమితంగా పంచుకుంటారు. 

ఈ కార్యకలాపాలన్నీ అధికారిక వెబ్‌‌సైట్ starhospitals.in  ద్వారా, తగిన లాగిన్ ఆధారాలతోనే జరుగుతాయి. అయితే, తమ డేటాను హ్యాక్ చేసి, ఒక అభ్యంతరకరమైన వెబ్‌‌సైట్‌‌లో అప్‌‌లోడ్ చేయడం ద్వారా దుర్వినియోగానికి పాల్పడ్డారని స్టార్ హాస్పిటల్స్ సీఈఓ రాహుల్ మెడక్కర్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సీఎస్‌‌బీ పోలీసులు ఎఫ్‌‌ఐఆర్ నమోదు చేసి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.