17 ఏండ్లకే ఓటుకు దరఖాస్తు

17 ఏండ్లకే ఓటుకు దరఖాస్తు

పద్మారావునగర్​, వెలుగు: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్త ఓటర్ల నమోదు, సవరణలు, ఆధార్​ లింకేజీల కోసం రాష్ట్రంలో  శని, ఆదివారాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్​రాజ్​ తెలిపారు. శనివారం ఆయన జీహెచ్ఎంసీ కమిషనర్​ లోకేశ్​​ కుమార్​ తో కలసి పద్మారావునగర్ లోని సర్దార్​ పటేల్ కాలేజీలో ఏర్పాటు చేసిన  బూత్​ లెవల్​ అధికారి (బీఎల్వో) శిబిరాన్ని సందర్శించారు. కొత్త ఓటర్ల నమోదు, తదితర ప్రక్రియలపై సిబ్బందిని ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన ‘వెలుగు’తో మాట్లాడుతూ 18 ఏండ్లు నిండిన వారితో పాటు 17 ఏండ్లు పూర్తయిన వారి నుంచి కూడా ఓటు హక్కుకు దరఖాస్తులను స్వీకరిస్తున్నామని తెలిపారు. వారికి 18 ఏండ్ల వయసు రాగానే ఆటోమెటిక్​గా ఓటు హక్కు వస్తుందన్నారు. ఈ నెల 26, 27 తేదీలతో పాటు వచ్చే నెల 3, 4 వ తేదీల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి, కొత్త ఓటర్ల నమోదును వేగవంతం చేస్తామన్నారు. అర్హత కలిగిన  కొత్త ఓటర్లు తమ పేర్లు  నమోదు చేసుకోవాలని కోరారు.