మున్సిపల్ ఎన్నికల్లో 14 వార్డులు ఏకగ్రీవం.!10 చోట్ల కాంగ్రెస్.. 2 చోట్ల బీఆర్ఎస్

మున్సిపల్ ఎన్నికల్లో  14 వార్డులు  ఏకగ్రీవం.!10 చోట్ల కాంగ్రెస్.. 2 చోట్ల బీఆర్ఎస్
  • 10 చోట్ల కాంగ్రెస్.. 2 చోట్ల బీఆర్ఎస్  కౌన్సిలర్ అభ్యర్థులు గెలుపు
  • రామగుండం, మహబూబ్​నగర్​ కార్పొరేషన్లలో ఇద్దరు కార్పొరేటర్లు
  • ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన.. 2,982 వార్డులకు జరగనున్న ఎన్నిక 
  • బరిలో 12,930 మంది అభ్యర్థులు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా 14 మున్సిపల్ వార్డులు ఏకగ్రీవమైనట్టు బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్​రాణి కుముదిని తెలిపారు. 10 చోట్ల కాంగ్రెస్​, రెండు చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు వార్డు సభ్యులుగా ఎంపికయినట్టు​అధికారికంగా ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,982 వార్డులకు 12,930 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారని.. వీరికి ఎన్నికల గుర్తులు కేటాయించామని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వార్డులకు ఈ నెల 11న పోలింగ్​ నిర్వహిస్తామని అన్నారు. జాతీయ, రాష్ట్ర పార్టీల తరఫున ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్​ అభ్యర్థులకు సైతం గుర్తులు అలాట్​ చేసినట్టు చెప్పారు. అత్యధికంగా కాంగ్రెస్​ నుంచి 2,936, బీఆర్​ఎస్​ నుంచి 2,876, బీజేపీ నుంచి 2,634  మంది, 2,786 మంది ఇండిపెండెంట్​ అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. జనసేన నుంచి 332 మంది పోటీ చేస్తున్నారు. టీడీపీ, వైఎస్సార్​ సీపీ నుంచి కొందరు నామినేషన్లు వేసినప్పటికీ ఆ పార్టీ తరఫున బీ ఫారాలు అందించకపోవడంతో ఆ అభ్యర్థుల నామినేషన్లను రిటర్నింగ్​ఆఫీసర్లు తిరస్కరించారు. ఆప్​ నుంచి 38, బీఎస్పీ 213, సీపీఎం 128, ఎంఐఎం 282, ఏఐఎఫ్​బీ 288, సీపీఐ 168, ఐయూఎంఎల్ నుంచి​ 9 మంది ఎన్నికల బరిలో నిలిచారు.

ఏకగ్రీవంగా గెలిచిన అభ్యర్థులు వీరే..

రాష్ట్ర వ్యాప్తంగా 13 వార్డులు, రెండు డివిజన్​లో గెలిచిన అభ్యర్థుల వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కాంగ్రెస్​ పార్టీ నుంచి రామగుండం మున్సిపల్​ కార్పొరేషన్​ పరిధిలోని 1వ డివిజన్​లో మడిపెల్లి విజయ, మహబూబ్​ నగర్​ కార్పొరేషన్ లో​58వ వార్డులో బి రమాదేవి.. మున్సిపాలిటీల వారీగా భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్​ 17వ వార్డులో చింతల ఉమామహేశ్వరి, యాదగిరి గుట్ట 10వ వార్డులో గుండ్లపల్లి వాణి, ఖమ్మం జిల్లా ఏదులాపురం 15వ వార్డులో తమ్మినేని మంగతాయి, నల్గొండ జిల్లా హాలియా 10వ వార్డులో చంద్రకళ పిల్లి, సూర్యాపేట జిల్లాలోని హుజూర్​నగర్​ 3వ వార్డులో సులువ నాగలక్ష్మీ, కోదాడ 11వ వార్డులో దేవరపల్లి మళ్లీశ్వరీ, 21వ వార్డులో కట్టెబోయిన జ్యోతి, 21వ వార్డులో యెర్నేని కుసుమ కుమారి, మెదక్​ 32వ వార్డులో గొడల మానస, వికారాబాద్​ 1వ వార్డులో అనంత్​ రెడ్డి పటోళ్ల ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు తెలిపారు. అలాగే, బీఆర్​ఎస్​ పార్టీ తరపున గద్వాల జిల్లా ఆలంపూర్​ 10వ వార్డులో పి.విక్రమ్​, వికారాబాద్​ 15వ వార్డులో పి.విజయలక్ష్మీ గెలిచినట్లుగా ఎన్నికల సంఘం ప్రకటించింది.

మూడు ప్రధాన పార్టీలు అన్నీ చోట్లా పోటీ చేయట్లే!

మున్సిపల్​ ఎన్నికల్లో 14 వార్డులు ఏకగ్రీవం కాగా 2,982 వార్డులకు ఎన్నికలు జరగుతున్నాయి. అయితే, ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తుల ప్రకారం మూడు ప్రధాన రాజకీయ పార్టీల తరఫున అభ్యర్థులు అందరూ అన్నీ చోట్ల పోటీ చేయట్లేదు. కాంగ్రెస్​ పార్టీ 46, బీఆర్​ఎస్​ 106, బీజేపీ 348 స్థానాలలో పోటీలో లేదు. లోకల్​ పొత్తులలో భాగంగా ఇతర పార్టీలకు అవకాశం ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతున్నది. కొందరికి బీ ఫారాలు ఇచ్చినా కూడా గడువులోగా వీటిని సబ్​ మిట్​ చేయకపోవడంతో అవి రద్దయ్యాయి.