కరీంనగర్ వెలుగు, నెట్వర్క్: అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ అని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో మంగళవారం నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అభివృద్ధిలో కరీంనగర్ జిల్లా ఆదర్శంగా నిలుస్తుందని, జిల్లా సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌష్ ఆలం, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్, డిప్యూటీ మేయర్ వై సునీల్ రావు, కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్ పాల్గొన్నారు.
జగిత్యాల కలెక్టరేట్‌లో నిర్వహించిన వేడుకల్లో మైనారిటీ శాఖ మంత్రి మహ్మద్ అజహారుద్దీన్ జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి జిల్లా ప్రజలకు ప్రగతి సందేశం అందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్‌కుమార్ పాల్గొన్నారు. కోరుట్లలో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ క్యాంపు ఆఫీస్, బీఆర్ఎస్ ఆఫీస్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.
పారదర్శక పాలన అందిస్తున్నాం
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తోందని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఆయన రాజన్న సిరిసిల్ల పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సిరిసిల్లలోని నేతన్నలకు చేతి నిండా పనితో భరోసా కల్పించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీకి ఇప్పటిదాకా రూ.291 కోట్లు మంజూరు అయినట్లు చెప్పారు.
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో..
రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు మంగళవారం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా జరిగాయి. రామగుండం క్యాంప్ ఆఫీస్‌లో ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్, సింగరేణి ఏరియా ఆఫీస్‌లలో ఆర్జీ 1 జీఎం డి.లలిత్ కుమార్, ఆర్జీ 2 జీఎం బి.వెంకటయ్య, ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్ ఆవరణలో హెడ్ ఎస్కె జిందాల్, రామగుండం కమిషనరేట్ ఆఫీస్‌లో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, బల్దియాలో మేయర్ మహాంకాళి స్వామి పాల్గొన్నారు. పెద్దపల్లి కలెక్టరేట్‌తో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని ఆఫీసులు, మండలాలు, గ్రామాల్లో మంగళవారం తెలంగాణ అవతరణ వేడుకలు జరిగాయి. కలెక్టరేట్‌లో విప్ విజయరమణారావు జెండా ఆవిష్కరించి మాట్లాడారు.
తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్
నిజామాబాద్ వెలుగు, నెట్వర్క్: ఉమ్మడి నిజామాబాద్జిల్లాలో రాష్ట్ర అవతరణ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. నిజామాబాద్ పోలీస్‌పరేడ్‌గ్రౌండ్‌లో జరిగిన వేడుకల్లో ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా సభలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని పాలన తెలంగాణను దేశంలో మొదటిస్థానంలో నిలబెట్టిందన్నారు. సర్కార్ స్కూళ్లలో వసతులు మెరుగుపర్చామని, ప్రైవేట్‌కు పోటీగా బోధన సాగడంతో టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధించినట్లు చెప్పారు. వైద్యం, వ్యవసాయం, ఇరిగేషన్, విద్యుత్ తదితర అన్ని శాఖల పనితీరులో మార్పులు తెచ్చామన్నారు. అంతకుముందు తెలంగాణ పార్కులో అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయిచైతన్య, ఎమ్మెల్యేలు భూపతిరెడ్డి, పైడి రాకేశ్‌రెడ్డి, అడిషనల్ కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగరావు, ఉర్దూ అకాడమీ చైర్పర్సన్ తాహెర్, డీఎఫ్‌వో సిద్ధార్థ్ తదితరులు పాల్గొన్నారు.
అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యం
కామారెడ్డి కలెక్టరేట్‌లో జరిగిన వేడుకల్లో ప్రభుత్వ సలహాదారు వి.హన్మంతరావు పాల్గొని జాతీయ జెండాను అవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని తెలిపారు. కలెక్టర్ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్చంద్ర, జిల్లా లైబ్రరీ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామ సర్కిల్లో ఏర్పాటు చేసిన 30 ఫీట్ల భారీ జాతీయ జెండాను ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి ఆవిష్కరించారు. అంకాపూర్ దేశానికే ఆదర్శమన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జెండా ఆవిష్కరించారు.
