ట్రాక్టర్లను గుంజుకుపోయిన బ్యాంకర్లు

ట్రాక్టర్లను గుంజుకుపోయిన బ్యాంకర్లు

బెల్లంపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని 4 గ్రామ పంచాయతీలకు చెందిన ట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఈఎంఐలు కట్టకపోవడంతో ఎస్ బీఐ అధికారులు లాక్కెళ్లారు. కొత్తగా ఏర్పాటైన ఏడు గ్రామపంచాయతీలకు ట్రాక్టర్లను ప్రభుత్వం స్టేట్ ఫైనాన్స్ కమిషన్  ద్వారా బెల్లంపల్లి ఎస్​బీఐ (స్టేట్ బ్యాంక్​ఆఫ్​ఇండియా) లోన్​తో కొన్నారు. 2019లో ప్రతి గ్రామ పంచాయతీ రూ.2 లక్షల 35 వేల చొప్పున చెల్లించగా, మిగతా రూ.2 లక్షల 3 వేలను బ్యాంక్ ఫైనాన్స్ చేసింది.  ఏడు గ్రామ పంచాయతీలకు ఏడు ట్రాక్టర్లను తీసుకోగా డబ్బులు కట్టేందుకు  36 నెలల కాలపరిమితి విధించారు. నెలకు రూ.15,515 చొప్పున 26 నెలలు ఈఎంఐలు సరిగ్గానే చెల్లించినా, మూడు నెలలుగా కట్టడం లేదు. దీంతో బెల్లంపల్లి మండలంలోని కన్నాల, లింగాపూర్, బుచ్చయ్యపల్లి , అంకుశం గ్రామ పంచాయతీల ట్రాక్టర్లను బుధవారం బెల్లంపల్లి ఎస్ బీఐ అధికారులు లాక్కుపోయారు. ప్రభుత్వం ఈఎంఐ డబ్బులు చెల్లించకపోవడంతోనే ఇలా జరిగిందని పంచాయతీ పాలకవర్గాలు చెబుతున్నాయి.  పంచాయతీల్లో ట్రాక్టర్లు లేకపోవడంతో వీధుల్లో ఎక్కడి చెత్త అక్కడ పేరుకుపోతోంది. ఇప్పటికే సర్కారు ఖజానాలో డబ్బులు లేక ప్రభుత్వ ఉద్యోగులకు ఆలస్యంగా  జీతాలిస్తుండగా, ఇప్పుడు ఆ ఎఫెక్ట్​  పంచాయతీల ట్రాక్టర్ల లోన్లపై పడింది. 

మా ట్రాక్టర్ ను తీస్కపోయిన్రు 

మా గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ను నాలుగు రోజుల కింద బెల్లంపల్లి ఎస్ బీఐ బ్యాంకు ఆఫీసర్లు  తీస్కపోయిన్రు. అడిగితే ఈఎంఐలు కట్టలేదని చెప్పిన్రు. మేము ప్రతి నెలా గ్రామ పంచాయతీ నుంచి ఈఎంఐకి సంబంధించిన 15,515 చెక్కును బెల్లంపల్లి సబ్ ట్రెజరీలో ఇస్తున్నాము. కానీ ప్రభుత్వం డబ్బు జమ చేయడం లేదు. దీంతో బ్యాంకు అధికారులు ట్రాక్టర్​ లాక్కుపోయిన్రు. ట్రాక్టర్ లేకపోవడంతో గ్రామంలో ఎక్కడి పనులు అక్కడనే  ఆగిపోయినయ్.
-  వెంకటేశ్, లింగాపూర్ సర్పంచ్