అనాథ పిల్లలకు ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగాలకు ట్రైనింగ్

అనాథ పిల్లలకు ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగాలకు ట్రైనింగ్
  • జీఎంఆర్​తో మహిళా శిశు సంక్షేమ శాఖ  ఒప్పందం
  • వచ్చే నెల నుంచే మొదటి బ్యాచ్​కు శిక్షణ షురూ
  • అమ్మాయిలకు సాఫ్ట్ వేర్ స్కిల్స్ నేర్పించనున్న ఫిక్కీ
  • ఆశ్రయం ఇవ్వడమే కాదు.. లైఫ్ ఇవ్వడం కూడా మా లక్ష్యం: మంత్రి సీతక్క

హైదరాబాద్, వెలుగు: అమ్మానాన్న లేక అనాథలుగా స్టేట్ హోమ్స్ లో ఉంటూ చదువుకుంటున్న పిల్లలకు ఆశ్రయం ఇవ్వడమే కాదు.. వాళ్లు లైఫ్ లో సెటిల్ అయ్యేలా బడా కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా సోమవారం సెక్రటేరియెట్ లో మంత్రి సీతక్క సమక్షంలో మహిళా శిశు సంక్షేమ శాఖ.. జీఎంఆర్ ఏరో అకాడమీ, ఫిక్కీ (ఎఫ్ఐసీసీఐ), అజీమ్ ప్రేమ్ జీ వర్సిటీలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది.

ప్రభుత్వ సంరక్షణ, శక్తి సదన్ లో పెరుగుతున్న అనాథ పిల్లలకు ఏవియేషన్ రంగంలో ట్రైనింగ్ ఇప్పించేందుకు జీఎంఆర్ ఏరో అకాడమీతో ఒప్పందం జరిగింది. వచ్చే నెల మార్చి నుంచే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వేదికగా పిల్లలకు శిక్షణ మొదలుకానుంది. ఎయిర్ పోర్ట్ ఆపరేషన్స్, కార్గో, గ్రౌండ్ హ్యాండ్లింగ్ వంటి కోర్సుల్లో ట్రైనింగ్ ఇస్తారు. మొదటి విడతలో 20 మంది అనాథ యువతీ, యువకులను ఎంపిక చేసి శిక్షణ ఇస్తారు. కోర్సు పూర్తయ్యాక ప్రైవేట్, ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ లో ఉద్యోగాలు వచ్చేలా చూస్తారు.

అమ్మాయిల కోసం ఏఐ క్లాసులు.. 

పాలిటెక్నిక్ చదువుతున్న అనాథ ఆడబిడ్డలకు సాఫ్ట్ వేర్, డిజిటల్ స్కిల్స్ నేర్పించేందుకు ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ముందుకొచ్చింది. స్వస్తిక్ వికాస్ ఫౌండేషన్ సాయంతో.. క్లాస్ రూమ్ నుంచి కార్పొరేట్ ఆఫీసులో జాబ్ కొట్టేలా ట్రైనింగ్ ఇవ్వనున్నారు. మొత్తం 300 మంది స్టూడెంట్స్ కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలి అనేదానిపై 30 గంటల పాటు ప్రత్యేక క్లాసులు తీసుకుంటారు.

ఆశ్రయంతో పాటు భవిష్యత్తు ముఖ్యమే: సీతక్క

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ‘‘అనాథ పిల్లలను ఆదుకోవడం అంటే వాళ్లకు కేవలం ఆశ్రయం ఇవ్వడం మాత్రమే కాదు.. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేలా భవిష్యత్తును ఇవ్వడం. అందుకే కార్పొరేట్ కంపెనీలతో మాట్లాడి స్కిల్ డెవలప్ మెంట్ ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం. వాళ్లు సొంతంగా ఎదిగేలా చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ అనితా రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా, జీఎంఆర్, ఫిక్కీ, అజీమ్ ప్రేమ్ జీ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.