కౌశిక్ రెడ్డిపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు

 కౌశిక్ రెడ్డిపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు
  • డీజీపీని నివేదిక కోరిన కమిషన్
  • 20లోగా సమర్పించాలని ఆదేశం

బషీర్​బాగ్, వెలుగు: కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంను మతం పేరుతో దూషించారంటూ హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​లో ఫిర్యాదు దాఖలైంది. రాష్ట్ర మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ వైస్ చైర్మన్ ఫహీం ఖురేషి ఈ ఫిర్యాదును సోమవారం నాంపల్లిలోని హెచ్ఆర్సీలో సమర్పించారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు “విషపు మాటలు”గా అభివర్ణించారు. మత విద్వేషాన్ని రెచ్చగొట్టేలా చేసిన ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే 24 గంటల్లోపే పాడి కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేసి తమ సెక్యులర్ వైఖరిని నిరూపించాలని డిమాండ్ చేశారు.

ముస్లింల పట్ల బీఆర్ఎస్ పార్టీ వైఖరి ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమైందని, ఓట్లు వేయకపోతే ముస్లింలను టార్గెట్ చేయాలన్న దృష్టికోణం ఎందుకని ప్రశ్నించారు. పాడి కౌశిక్ రెడ్డి తరచూ అనుచిత వ్యాఖ్యలు చేసి 24 గంటల్లో క్షమాపణలు చెప్పడం అలవాటుగా మారిందని విమర్శించారు. ఈసారి వ్యాఖ్యలు వ్యక్తిగతంగా కాకుండా యావత్ సమాజంపై దాడిగా ఉన్నాయన్నారు. ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరాలతో నివేదిక సమర్పించాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించింది. ఈ నెల 20వ తేదీ ఉదయం 11 గంటల్లోగా నివేదిక అందజేయాలని కమిషన్ స్పష్టం చేసింది.