పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

 

  • ఎండల నేపథ్యంలో ఉదయం 8.30కే జెండా ఆవిష్కరణ
  • జిల్లాలవారీగా జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల
  • గంటన్నరలోనే ఆవిర్భావ వేడుకలు పూర్తి కావాలని అధికారులకు సీఎం ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల(జూన్ 2)ను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ సందర్భంగా జిల్లాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే మంత్రులు, ప్రముఖుల జాబితాను విడుదల చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌‌‌‌లోని పరేడ్ గ్రౌండ్స్‌‌‌‌లో జూన్ 2న ఉదయం 8:30 గంటలకు సీఎం రేవంత్​ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించనుండగా, జిల్లాల్లో ఉదయం 8 గంటలకు నిర్దేశించిన ప్రముఖులు పతాకావిష్కరణ చేస్తారు.

 మండుటెండల కారణంగా ఈసారి  రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవ వేడుకలను ఉదయం పూట నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు. పరేడ్​గ్రౌండ్స్​లో జరిగే వేడుకలను ఉదయం 8.30కే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. జాతీయ పతాకావిష్కరణతో పాటు అవతరణ ఉత్సవ కార్యక్రమాలను గంటన్నర వ్యవధిలో పూర్తి చేయాలని సూచించారు. ఎండ తీవ్రత దృష్ట్యా వేడుకలకు హాజరయ్యే అతిథులకు, ప్రజలకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.

జిల్లాల్లో జెండా ఎగురవేయనున్నది వీళ్లే.. 

ఆదిలాబాద్‌‌‌‌లో మహ్మద్ అలీ షబ్బీర్, భద్రాద్రి కొత్తగూడెంలో తుమ్మల నాగేశ్వరరావు, హనుమకొండలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాలలో మహమ్మద్ అజారుద్దీన్, జయశంకర్ భూపాలపల్లిలో యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జనగామలో బీర్ల అయిలయ్య, జోగులాంబ గద్వాలలో జితేందర్ రెడ్డి, కామారెడ్డిలో వి. హనుమంతరావు, కరీంనగర్‌‌‌‌లో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జెండా ఎగురవేస్తారు.

అలాగే ఖమ్మంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కుమ్రంభీం ఆసిఫాబాద్‌‌‌‌లో బండ ప్రకాశ్, మహబూబాబాద్‌‌‌‌లో జె. రాంచందర్ నాయక్, మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌లో జూపల్లి కృష్ణారావు, మంచిర్యాలలో హరకార వేణుగోపాల్ రావు, మెదక్‌‌‌‌లో వివేక్ వెంకటస్వామి, మేడ్చల్‌‌‌‌లో కె. కేశవరావు, ములుగులో సీతక్క, నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌లో జి. చిన్నారెడ్డి, నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నారాయణపేటలో వాకిటి శ్రీహరి, నిర్మల్‌‌‌‌లో వేముల వీరేశం, నిజామాబాద్‌‌‌‌లో పి. సుదర్శన్ రెడ్డి, పెద్దపల్లిలో చింతకుంట విజయ రమణారావు, రాజన్న సిరిసిల్లలో ఆది శ్రీనివాస్, రంగారెడ్డిలో దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సంగారెడ్డిలో దామోదర రాజనర్సింహ, సిద్దిపేటలో పొన్నం ప్రభాకర్ పతాకావిష్కరణ చేస్తారు.

ఇక సూర్యాపేటలో నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, వికారాబాద్‌‌‌‌లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, వనపర్తిలో పట్నం మహేందర్ రెడ్డి, వరంగల్‌‌‌‌లో కొండా సురేఖ, యాదాద్రి భువనగిరిలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని ప్రభుత్వం పేర్కొంది.