నష్టాల్లో క్లోజ్ అయిన మార్కెట్లు.. ఇన్వెస్టర్ల సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి

నష్టాల్లో క్లోజ్ అయిన మార్కెట్లు.. ఇన్వెస్టర్ల సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి

అంతర్జాతీయ ప్రతికూల పవనాలకు తోడు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తోడవ్వడంతో భారత స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాలను చవిచూశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్, నిఫ్టీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒకే రోజు దాదాపు రూ.4 లక్షల కోట్ల మేర ఆవిరైంది నేడు ఒక్కరోజే. మార్కెట్ క్లోజింగ్ సమయానికి నిఫ్టీ కీలకమైన 24,000 స్థాయి కంటే దిగువకు పడిపోగా.. సెన్సెక్స్ కూడా 830 పాయింట్ల పతనాన్ని నమోదు చేసింది.

ఈ భారీ పతనానికి ప్రధానంగా 6 కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భగ్గుమనడం. ఇరాక్ సెక్యూరిటీ అధికారుల సమాచారం ప్రకారం ఇరాన్ పేలుడు పదార్థాలతో కూడిన బోట్లు రెండు ఆయిల్ ట్యాంకర్లను ఢీకొట్టడంతో సరఫరాకు అడ్డంకులు పెరిగాయి. దీనివల్ల బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా 9 శాతం పెరిగి 100 డాలర్ల మార్కును దాటింది. చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే భారత్ వంటి దేశాలకు ఇది పెద్ద దెబ్బ. చమురు ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం పెరిగి, దిగుమతి బిల్లు భారమవుతుందనే ఆందోళన పెట్టుబడిదారులను కలవరపెట్టింది.

రెండోది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న సంచలన నిర్ణయం. భారత్, చైనా, ఈయూ సహా 16 ప్రధాన వాణిజ్య భాగస్వామ్య దేశాలపై సెక్షన్ 301 కింద కొత్త వాణిజ్య విచారణను అమెరికా ప్రారంభించింది. దీనివల్ల ఎగుమతులపై టారిఫ్ పడే అవకాశం ఉందన్న వార్తలు ట్రేడ్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీనికి తోడు మార్కెట్ భయాందోళనలను సూచించే ఇండియా విక్స్ సూచీ 6 శాతం పెరిగి 22.32కు చేరింది.

ఇక రూపాయి విలువ పతనం కూడా మార్కెట్‌ను కుంగదీసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 31 పైసలు క్షీణించి 92.32 వద్ద ఆల్-టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయింది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గత 7 ట్రేడింగ్ సెషన్లలోనే రూ.39వేల కోట్లకు పైగా షేర్లను విక్రయించగా.. నేడు కూడా సుమారు రూ.6వేల 267 కోట్ల మేర అమ్మకాలు జరిపారు. ఆసియా మార్కెట్ల నుంచి వచ్చిన బలహీనమైన సంకేతాలు కూడా తోడవడంతో ఇన్వెస్టర్లు ఒక్కరోజే రూ.4 లక్షల కోట్లు నష్టపోవాల్సి చూడాల్సి వచ్చిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇరాన్ యుద్ధం ముగింపునకు వచ్చి పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటే తప్ప మార్కెట్లు బుల్ జోరును అందుకోలేవని వారు అంటున్నారు.