- ప్రధాని కామెంట్స్‌తో రియల్టీ, జ్యువెలరీ షేర్లు క్రాష్
- రూ.10 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు
- 95.76 కి పడిన రూపాయి విలువ
- రూ.1,959 కోట్ల షేర్లను అమ్మిన విదేశీ ఇన్వెస్టర్లు
ముంబై: స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు కూడా నష్టాల బాట పట్టాయి. ముడి చమురు ధరలు పెరగడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, విదేశీ ఇన్వెస్టర్ల (ఎఫ్‌ఐఐల) అమ్మకాలు, రూపాయి విలువ రికార్డు స్థాయికి పడిపోవడం వంటి అంశాలు మంగళవారం మార్కెట్ పతనానికి కారణమయ్యాయి. బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ సుమారు రెండు శాతం పడ్డాయి. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు కూడా రెండున్నర శాతానికి పైగా నష్టపోయాయి. జియోపొలిటికల్ టెన్షన్లు తగ్గి, ద్రవ్యోల్బణ ఆందోళనలు స్థిరపడే వరకు మార్కెట్‌లో బేరిష్ ట్రెండ్ కొనసాగుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
2 సెషన్లలో రూ.16 లక్షల కోట్లు ఉఫ్
నిఫ్టీ మంగళవారం 1.83 శాతం నష్టపోయి 23,380 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 1,456 పాయింట్లు (1.92 శాతం) పడిపోయి 74,559 వద్ద సెటిలైంది. ఇన్వెస్టర్ల సంపద రూ.10 లక్షల కోట్లు తగ్గింది. గత రెండు సెషన్లలో రూ.16.6 లక్షల కోట్లు ఆవిరైంది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 2.5 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీ 3.2 శాతం నష్టపోయాయి. ప్రధాని మోదీ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ప్రోత్సహించడం, గోల్డ్ కొనుగోళ్లను వాయిదా వేయాలని పిలుపివ్వడంతో జ్యువెలరీ, రియల్టీ షేర్లు భారీగా పడ్డాయి. నిఫ్టీ రియల్టీ 4 శాతం నష్టపోయింది. అనంత్‌రాజ్ షేర్లు6.25 శాతం, ప్రెస్టీజ్ 5.50 శాతం, లోధా 5 శాతం పతనమయ్యాయి. కల్యాణ్ జ్యువెలర్స్ 6 శాతం, తంగమయిల్ జ్యువెలరీ 8 శాతం, పీఎన్‌జీ జ్యువెలర్స్ 5 శాతం పడ్డాయి.
23,800 పైనే ర్యాలీ!
టెక్నికల్‌గా చూస్తే నిఫ్టీకి 23,150 వద్ద కీలక మద్దతు దొరుకుతుందని రెలిగేర్ బ్రోకింగ్ ఎనలిస్ట్ అజిత్ మిశ్రా తెలిపారు. మార్కెట్ మళ్ళీ పుంజుకోవాలంటే 23,800 స్థాయిని దాటాలని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఫార్మా, హెల్త్‌కేర్, ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ వంటి రంగాలలో కొన్ని షేర్లను కొనుగోలు చేయొచ్చని సలహా ఇచ్చారు. ముడి చమురు ధరలు పెరగడంతో ఓఎన్‌జీసీ వంటి చమురు ఉత్పత్తి సంస్థలు లాభపడతాయని, అదే సమయంలో పెయింట్, ఏవియేషన్, కెమికల్ కంపెనీలు నష్టపోతాయన్నారు.
మార్కెట్ పడడానికి గల కారణాలు..
- 1) అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు ఆగిపోవడంతో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 107.60 డాలర్లకు చేరుకుంది. దీని ప్రభావంతో రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 95.76 వద్ద సరికొత్త రికార్డు కనిష్టానికి పడిపోయింది.
- 2) పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది. చర్చలలో పురోగతి కనిపిస్తే తప్ప మార్కెట్లు కోలుకునే సంకేతాలు కనిపించడం లేదు.
- 3) పెట్రోల్, వంట నూనెలు, బంగారం దిగుమతులపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను మార్కెట్ ముందస్తు హెచ్చరికగా భావిస్తోంది. ద్రవ్యోల్బణం పెరుగుతోందని, విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరిగిందని ఎనలిస్టులు చెబుతున్నారు.
- 4) ఓపెన్‌ఏఐ నేరుగా పెద్ద కంపెనీల్లో ఏఐ ఇంజినీర్లను ప్రవేశపెట్టే మోడల్ ప్రకటించింది. దీంతో ఇన్ఫోసిస్ షేర్లు 3 శాతం, విప్రో 3.24 శాతం, టీసీఎస్ 3.74 శాతం నష్టపోయాయి.
