V6 News

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ క్షమాపణలు చెప్పాలి

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ క్షమాపణలు చెప్పాలి

దేశంలో జరుగుతున్న అత్యాచారాలపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ మహిళా కమిషన్ తీవ్రంగా మండిపడింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి 'రేపిస్టులు' అని సంబోధించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అత్యాచార నిందితులను ఉరితీసే చట్టం అమల్లోకి వచ్చిన తర్వాతే దేశంలో అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయని, రేపిస్టులపై చట్టానికి కేంద్రం బాధ్యత వహించాలని రాజస్థాన్ సీఎం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో DCW  తీవ్రంగా స్పందించింది. ఇటీవల ఢిల్లీలో నిరుద్యోగం, ధరల పెరుగుదలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బ్లాక్ ప్రొటెస్ట్ లో రాజస్థాన్ ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఈ నేపథ్యంలో రాజస్థాన్ సీఎం చేసిన వ్యాఖ్యలు అత్యాచార బాధితుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఢిల్లీ మహిళా కమిషన్ ఆరోపించింది. ఆయన రేపిస్టుల భాష ఉపయోగించడం మానేయాలని, అతను నిర్భయను ఎగతాళి చేసిన తీరు అత్యాచార బాధితుల సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని చెప్పుకొచ్చింది. చిన్న పిల్లలపై రేపిస్టులను ఉరితీసే చట్టం తీసుకురావడానికి తాము చాలా కష్టపడ్డామని ఢిల్లీ కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ చెప్పారు. ఇలాంటి పనికిమాలిన వ్యాఖ్యలు చేయడానికి బదులు రాజస్థాన్‌లోనే అనేక అత్యాచార కేసులు నమోదవుతున్నందున చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాల్సిన బాధ్యత సీఎం అశోక్ గెహ్లాట్‌పై ఉందన్నారు.

నిర్భయ తల్లి ఆశాదేవి ఆవేదన..

నిర్భయ కేసు తర్వాత నిందితులను ఉరి తీయాలన్న డిమాండ్ ఊపందుకున్నదని, ఆ తర్వాత చట్టం అమల్లోకి వచ్చిందని, అప్పటి నుంచి అత్యాచారం, హత్య కేసులు పెరిగాయనడంపై నిర్భయ తల్లి ఆశాదేవి కూడా స్పందించారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. అశోక్ గహ్లాట్ వ్యాఖ్యలు నేరస్తులకు మద్దతిచ్చేవిగా ఉన్నాయని విమర్శించారు. అత్యాచారానికి పాల్పడేవారిని ఉరితీసే చట్టం రాకముందే ఎంతోమంది బాలికల హత్యలు జరిగాయని ఆశాదేవి గుర్తు చేశారు. ప్రజల మనస్థత్వంలో మార్పురాకపోవడమే అమ్మాయిలపై హత్యాచారాలకు కారణమని.. చట్టాలు కాదని ఆమె ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ తెలిపారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన వ్యాఖ్యలు ఎంతో ఇబ్బందికమైనవని.. హత్యాచార బాధితుల కుటుంబాలను ఆయన ఎగతాళి చేశారని తెలిపారు. నిర్భయ చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొచ్చిందని ఆశాదేవి గుర్తు చేశారు. హత్యాచార బాధితుల పట్ల సానుభూతి లేకపోవడమే కాకుండా నిందితులకు మద్దతిచ్చేలా రాజస్థాన్ సీఎం వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించారు. దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పడంతో పాటు, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆశాదేవి డిమాండ్ చేశారు.