ఫేస్​బుక్​, వాట్సాప్ ఎందుకు పని చేయలేదంటే..

ఫేస్​బుక్​, వాట్సాప్ ఎందుకు పని చేయలేదంటే..
  • రూటర్లు మొరాయించడంతోనే సమస్య: ఫేస్‌బుక్‌
  • ఫేస్​బుక్ ​ఇంటర్నల్ ​సర్వర్లు కూడా ఆగడంతో లోపలికి వెళ్లలేకపోయిన స్టాఫ్!
  • 2019లోనూ ఇట్లనే జరిగింది.. ఇక ముందు కూడా జరగొచ్చన్న ఎక్స్​పర్ట్స్​

న్యూఢిల్లీ: ఫేస్​బుక్​, వాట్సాప్, ఇన్​స్టాగ్రామ్ సర్వీసులు సోమవారం ఒక్కసారిగా ఆగిపోయిన విషయం తెలిసిందే. దాదాపు 6 గంటల పాటు చాటింగ్, వాయిస్​ కాల్స్, వీడియో కాల్స్​ ఏవీ పనిచేయలే దు. ఈ మూడు ప్లాట్​ఫామ్స్​కు చెందిన వెబ్​సైట్లు, యాప్​లు కూడా ఓపెన్​ కాలేదు. అసలు ఇన్ని గంటల పాటు ఈ సర్వీసులన్నీ ఎందుకు ఆగిపోయాయి? అంత పెద్ద సమస్య ఏమై ఉంటుంది? ఎవరైనా హ్యాక్​ చేశారా లేక హార్డ్​వేర్​ ప్రాబ్లమా లేదంటే కంపెనీలోని వాళ్లే ఏమైనా తప్పు చేశారా?  
ఎందుకు పని చేయలేదంటే..
మనం ఫేస్​బుక్​ను గాని, దానికి సంబంధించిన వాట్సాప్, ఇన్​స్టాగ్రామ్​ను గాని చూడాలనుకుంటే వాటి నెట్​వర్క్​తో మన కంప్యూటర్, ఫోన్​​కనెక్ట్​ అవ్వాలి. ఈ పనిని బార్డర్​ గేట్​వే అనే ప్రోటోకాల్ ​చేస్తుంటుంది. ఈ ప్రోటోకాల్​ పోస్టల్​ సర్వీస్​లాగా పనిచేస్తూ నెట్​వర్క్​తో యూజర్లను కనెక్ట్​ చేస్తుంది. నెట్​వర్క్​కు కనెక్ట్​ అయి ఉంటేనే మనం ఫేస్​బుక్​ సర్వీసులను వాడుకోగలుగుతాం. సోమవారం ఈ కనెక్షనే తెగిపోయింది. ఎలాగంటే ఫేస్​బుక్​ డేటా సెంటర్ల కేబుల్​ వైర్లను ఎవరో ఒకేసారి పీకేసినట్టన్నమాట. సమస్యపై ఫేస్​బుక్​ కూడా క్లారిటీ ఇచ్చింది. తమ డేటా సెంటర్ల మధ్య నెట్​వర్క్​ట్రాఫిక్​ను కో ఆర్డినేట్​ చేసే రూటర్లు మొరాయించడం, కాన్ఫిగరేషన్​ మార్పు వల్లే సమస్య ఏర్పడిందని వివరించింది.
ఆరు గంటల తర్వాత సక్కగైంది
ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఆరు గంటలకు పైగా నిలిచిపోయిన వాట్సాప్, ఫేస్ బుక్,  ఇన్ స్టాగ్రామ్ సేవలు మంగళవారం తెల్లవారుజాము నుంచి మళ్లీ మొదలయ్యాయి. మొదట్లో కనెక్టివిటీ సమస్య కావొచ్చనుకున్నా టెక్నికల్ ఇష్యూతో తమ సైట్లన్నీ ఒకేసారి డౌనైపోయాయని ట్విట్టర్ ద్వారా ఫేస్ బుక్ ప్రకటన చేసింది. కాన్ఫిగరేషన్ మార్పే సమస్యకు కారణమని, యూజర్ల డేటా లీకవడం వంటివి జరగలేదంది. ఇంకా కొన్ని నెట్ వర్కింగ్ సమస్యలున్నాయని, వీటిని 100% పునరుద్ధరించేందుకు టైం పట్టొచ్చని తెలిపింది. ఈ సమస్య దెబ్బకు ఫేస్ బుక్ స్టాక్స్ 5% దాకా పడిపోయాయి.
ఇట్లయితే కష్టమే?
గతంలో 2019లో కూడా ఫేస్​బుక్​ సేవలు రెండు గంటల పాటు నిలిచిపోయాయి. అప్పుడు సర్వర్​కాన్ఫిగరేషన్​లో మార్పు వల్లే సమస్య వచ్చిందని ఫేస్​బుక్ వెల్లడించింది. మున్ముందు కూడా ఇలాంటి సమస్యలు రావని చెప్పలేమని ఎక్స్​పర్ట్స్​ అంటున్నారు. మరోవైపు ఫేస్​బుక్​ ఇటీవల అనేక టెక్నికల్​ పనులను ఒక్కదగ్గరకు తీసుకొచ్చి పని చేస్తోందని ఎక్స్​పర్ట్స్​ అంటున్నారు. ఇలా చేయడం వల్ల ఒక వరుసలోని లైట్​ గనక ఆగిపోతే వరుసగా అన్ని లైట్లు ఆగిపోయినట్టు ఆ సంస్థకు చెందిన వెబ్​సైట్లు, యాప్​లు పని చేయవని వివరిస్తున్నారు. 
ఫేస్​బుక్​ ఆగిపోతే అంతగా ఏమవుతుంది?
ఫేస్​బుక్, వాట్సాప్, ఇన్​స్టాగ్రామ్ లాంటివి ఆగిపో తే చాలామందికి అది జస్ట్​ ఒక చిన్న ఇన్​కన్వీనియన్స్​మాత్రమే. కానీ ప్రపంచవ్యాప్తంగా వీటిపై ఆధారపడి పనిచేస్తున్న రకరకాల బిజినెస్​లు, పనులపై తీవ్ర ప్రభావం పడుతుంది. కస్టమర్లతో, క్లైంట్లతో మాట్లాడేందుకు చిన్న వ్యాపారులు ఇబ్బంది పడతారు. ఈ కరోనా టైమ్​లో సుదూర ప్రాంతాల్లో పనిచేస్తున్న కొన్ని ఆర్గనైజేషన్ల మెంబర్లు కమ్యూనికేషన్ కోసం ఫేస్​బుక్​, వాట్సాప్​సర్వీసులపైనే ఆధారపడుతన్నారు. వీళ్లకూ ఇది సమస్యే. వెబ్​సైట్లకు సంబంధించి డౌన్ ​సమస్యలను గుర్తించే డౌన్ ​డిటెక్టర్.. ఫేస్​బుక్ ​వ్యవస్థలు ఆగిపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా సుమారు కోటికి పైగా సమస్యలు రిపోర్టయినట్టు తెలిపింది. ఇంటర్నెట్​ చరిత్రలో ఇప్పటివరకు ఇదే అత్యధికమని వివరించింది. 
2 వారాల కిందటే ఓ మాజీ ఉద్యోగి ఆరోపణలు
350 కోట్ల మందికి పైగా యూజర్లతో ప్రపంచంలోనే అతి పెద్ద సోషల్ నెట్ వర్కింగ్ మీడియాగా ఎదిగిన ఫేస్ బుక్ విశ్వసనీయతపై ఇటీవల సందేహాలు వస్తున్నాయి. యూజర్ల భద్రత కంటే లాభార్జనకే ఫేస్ బుక్ ప్రాధాన్యమిస్తోందని ఆ కంపెనీ మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్ హాన్ 15 రోజుల క్రితం చేసిన తీవ్రమైన ఆరోపణలు కలకలం రేపాయి. ఫేస్ బుక్ లో ప్రొడక్ట్ ఇంజనీర్​గా చేసిన ఆమె, తన ఆరోపణలకు బలం చేకూర్చే పలు ఇంటర్నల్ డాక్యుమెంట్లను కూడా లీక్ చేసింది.

ఇంత టైమ్​ ఎందుకు పట్టింది?
ఫేస్​బుక్​ సేవలన్నీ ఆగిపోవడంతో సంస్థకు సంబంధించిన లోపలి వ్యవస్థలు కూడా పని చేయకుండా పోయాయి. దీంతో ఫేస్​బుక్​ స్టాఫ్​ సర్వర్లను వాళ్లున్న చోటు నుంచి ఆపరేట్​ చేయలేకపోయారు. లోపలికెళ్లి సమస్యను పరిష్కరిద్దామంటే స్టాఫ్​బ్యాడ్జిలు పని చేయకపోవడంతో వాళ్లను లోపలికి అనుమతించలేదని ఓ టెక్​ రిపోర్టర్​ చెప్పారు. దీని వల్లే సమస్య పరిష్కారానికి చాలా టైమ్​ పట్టిందన్నారు. అయితే కాలిఫోర్నియాలోని శాంటాకార్లాలో ఉన్న సర్వర్​ కంప్యూటర్లను సంస్థ టెక్నికల్​ టీమ్​యాక్సెస్​ చేయగలిగారని, ఆ తర్వాత సమస్యను పరిష్కరించారని ఓ మీడియా సంస్థ రాసుకొచ్చింది. వాళ్లు రిమోట్​గా కాకుండా ఫిజికల్​గా లోపలికెళ్లి సమస్యను పరిష్కరించారని సమాచారం.