ముస్లిం రిజర్వేషన్లను బరాబర్ ఎత్తేస్తం : కిషన్  రెడ్డి

ముస్లిం రిజర్వేషన్లను బరాబర్ ఎత్తేస్తం : కిషన్  రెడ్డి
  • ఆ రిజర్వేషన్లతో బీసీలకు అన్యాయం
  • కాంగ్రెస్ పార్టీ దేశానికి పట్టిన దరిద్రం 
  • బీజేపీ స్టేట్​ చీఫ్​ కిషన్​రెడ్డి కామెంట్స్​
  • రాష్ట్రంలో బీసీ కోటాకు గండికొడుతున్నారని ఆరోపణ
  • ఐఎన్​సీ అంటే ఇటలీ నేషనల్ కాంగ్రెస్ ​పార్టీ అని ఎద్దేవా

హైదరాబాద్, వెలుగు: మతం పేరుతో తీసుకొచ్చిన ముస్లిం రిజర్వేషన్లను బరాబర్  ఎత్తేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్  రెడ్డి అన్నారు. ముస్లింలను బీసీలుగా మారుస్తూ, బీసీలకు అన్యాయం చేస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లకు గండి కొడుతున్నది ఎవరో సీఎం రేవంత్  రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆ పార్టీ రాష్ట్ర నాయకులు బంగారు శ్రుతి, ప్రేమేందర్ రెడ్డి, ప్రకాశ్ రెడ్డి, అమర్ నాథ్, సునీతతో కలిసి మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడారు. దేశంలో కాంగ్రెస్  పార్టీ దిగజారి వ్యవహరిస్తున్నదన్నారు.

కాంగ్రెస్  పార్టీ బ్రిటిష్  ప్రతినిధిగా ఇటలీకి చెందిన సోనియా గాంధీని దేశానికి ప్రధానిని చేయాలనే ప్రయత్నం చేసిందని, ఆ ప్రయత్నాన్ని బీజేపీ అడ్డుకున్నదని చెప్పారు. ఇండియన్  నేషనల్  కాంగ్రెస్ కాస్తా ఇటలీ నేషనల్​ కాంగ్రెస్​గా మారిపోయిందని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనుచూపు మేరలో కూడా లేదన్నారు. దేశంలో ఉన్న సమస్యలన్నింటికీ కాంగ్రెస్​ పార్టీనే కారణమని, దేశానికి పట్టిన దరిద్రం కాంగ్రెస్  అని ఆయన ఫైర్  అయ్యారు. ఎన్నికల వ్యవస్థ నిర్వీర్యం కావడానికి, అవినీతి, పేదరికం పెరగడానికి కాంగ్రెస్సే కారణమన్నారు.

పదేండ్ల కిందే ప్రజలు ఆ దరిద్రాన్ని వదిలించుకున్నారని చెప్పారు. కాంగ్రెస్...​ జిన్నా కాంగ్రెస్​గా మారిందన్నారు. ఆర్టికల్ 370 కారణంగా 42 వేల మందిని పొట్టనపెట్టుకున్నారని, 73 ఏండ్ల పాటు రాజ్యాంగాన్ని అవహేళన చేసిందని మండిపడ్డారు. లోక్​సభ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే కుట్రపూరితమైన ఆలోచనతో ఆ పార్టీ నేతలు బీజేపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అలాగే బీఆర్  అంబేద్కర్, మాజీ ప్రధాని పీవీ నరసింహారావును కూడా కాంగ్రెస్  పార్టీ అవమానించిందన్నారు. తాము మాత్రం లోక్​సభలో అంబేద్కర్  చిత్రపటం పెట్టి ఆయనను గౌరవించామని పేర్కొన్నారు. అలాగే పీవీ సేవలను గుర్తించి ఆయనకు భారతరత్న ఇచ్చామని తెలిపారు.