ప్రచారానికి వడదెబ్బ!.. ఉదయం 10 లోపు, సాయంత్రం 6 తర్వాతే లీడర్ల క్యాంపెయిన్

ప్రచారానికి వడదెబ్బ!.. ఉదయం 10 లోపు, సాయంత్రం 6 తర్వాతే లీడర్ల క్యాంపెయిన్
  • మధ్యాహ్నమంతా పార్టీ ఆఫీసుల్లోనే క్యాడర్​తో మంతనాలు
  • లేదంటే ఏసీ ఫంక్షన్ హాళ్లలో మీటింగ్స్ 
  • రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వడగాలులు
  • పలుచోట్ల 45 డిగ్రీలు దాటిన టెంపరేచర్లు 

కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలో ఎండలు మండిపోతుండడంతో లోక్​సభ ఎన్నికల ప్రచారంలో జోష్ తగ్గింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ 43 నుంచి 45 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు నమోదవుతుండడంతో వడదెబ్బ భయానికి అన్ని పార్టీల అభ్యర్థులు, నాయకులు మధ్యాహ్నం అయిందంటే బయటకు రావడం లేదు. రోజూ ఏసీ గదుల్లో ఉండే లీడర్లు ఎండ దెబ్బకు భయపడి తెల్లవారుజామున 6 గంటలకే రోడ్డెక్కుతున్నారు. మార్నింగ్ వాక్, కాలనీలు, అపార్ట్​మెంట్ల సమావేశాలతో ఉదయం 10 గంటల్లోపే ప్రచారం ముగిస్తున్నారు. ఆ తర్వాత ఏదైనా ఏసీ ఫంక్షన్ హాల్​లో పబ్లిక్ మీటింగ్స్ లేదా పార్టీ ఆఫీసుల్లో ముఖ్య  కార్యకర్తల సమావేశాల్లాంటివి నీడపట్టున నిర్వహిస్తున్నారు. 

మళ్లీ ఎండ తగ్గాక సాయంత్రం 6 గంటలకు రోడ్డు షోలు, కార్నర్ మీటింగ్స్ పెట్టుకుంటున్నారు. రాష్ట్రంలో అభ్యర్థులందరీ రోజువారీ షెడ్యూల్ దాదాపు ఇలాగే ఉంటున్నది. 

మిగిలింది 15 రోజులే..

ఏప్రిల్ కావడంతో రాష్ట్రంలో కొద్ది రోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఆరేడు గంటల వరకు వడగాలులు వీస్తున్నాయి. దీంతో ఎన్నికల  ప్రచారానికి, మీటింగ్ లకు నాయకులు పైసలు ఇస్తామన్నా జనాలు రావడం లేదు. మరోవైపు ప్రచారం చేసేందుకు పార్టీల లీడర్లు, కార్యకర్తలు కూడా జంకుతున్నారు.  

ఎన్నికల ప్రచారానికి మరో15 రోజులే గడువు ఉంది. లోక్ సభ స్థానం పరిధి ఎక్కువగా ఉన్నందున ఆయా పార్టీల అభ్యర్థులు ప్రతి రోజూ ఉదయం నుంచి రాత్రి వరకు తిరిగినా పావు వంతు గ్రామాలు కూడా కవరయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఎండల ధాటికి అభ్యర్థులు లోక్ సభ పరిధిలోని మండల కేంద్రాల్లో తప్ప.. గ్రామాలకు వెళ్లి ప్రచారం చేసే అవకాశం లేదు.

కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్  ప్రతిరోజూ ఉదయం ఏదైనా నియోజకవర్గ స్థాయి మీటింగ్ కు అటెండ్ అయి.. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కరీంనగర్ లోని తన ఆఫీసులో కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. గురువారం నిర్వహించిన నామినేషన్ ర్యాలీలో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఎండతో ఇబ్బందిపడ్డారు. కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రావు, బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ మధ్యాహ్నం తమ ఆఫీసుల్లోనే సమావేశాలు నిర్వహిస్తున్నారు.   

మరో మూడు రోజులు వడగాలులు

మండుతున్న ఎండలు, వడగాలులతో రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. దీంతో క్యాంపెయిన్ కు వెళ్లే  లీడర్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాష్ట్రంలో శుక్రవారం అత్యధికంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో మూడు రోజులు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.