హైదరాబాద్: శంకర్ పల్లి రైల్వేస్టేషన్ సమీపంలో రైలు బోగీ కింద స్వల్పంగా మంటలు రావడంతో కలకలం రేగింది. హైదరాబాద్ నుంచి బెల్గవి వెళుతున్న స్పెషల్ రైలు శంకర్ పల్లి రైల్వే స్టేషన్ దగ్గరకు వస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. రైల్వే సిబ్బంది అప్రమత్తమై మంటలు ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది.
బ్రేక్ జామ్ అవడంతో నిప్పు రవ్వలు చెలరేగి మంటలు వచ్చినట్లు రైల్వే సిబ్బంది తెలిపారు. బోగీ వెనక ఉన్న మొదటి ప్యాసింజర్ డబ్బాలో ప్రమాదం జరిగింది. మంటలు ఆర్పిన అనంతరం నిపుణుల సూచనల మేరకు రైలు బయల్దేరింది.
2025 ఆగస్టులో కూడా ఈ తరహా ఘటనే మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్ లో జరిగింది. స్టేషన్లో నిలిపి ఉన్నరెస్ట్ కోచ్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్తోనే ప్రమాదం జరిగిందని అధికారులు తేల్చారు.
ప్రమాదం జరిగిన సమయంలో కోచ్లో నలుగురు ఉద్యోగులు ఉండగా, మంటలను గుర్తించి కంపార్ట్మెంట్ తలుపులు తెరిచి బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రైల్వే స్టేషన్ కు చేరుకొని రెస్ట్ కోచ్ లో చెలరేగిన మంటలను అదుపు చేశారు. స్టేషన్ ఆవరణ లో దట్టమైన పొగలు వ్యాపించడంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురయ్యారు.
