IPL 2026: జాతీయ జట్టు కోసం ఐపీఎల్‌కు బ్రేక్.. కేకేఆర్‌కు షాక్ ఇచ్చిన రూ. 9.20 కోట్ల ఫాస్ట్ బౌలర్

IPL 2026: జాతీయ జట్టు కోసం ఐపీఎల్‌కు బ్రేక్.. కేకేఆర్‌కు షాక్ ఇచ్చిన రూ. 9.20 కోట్ల ఫాస్ట్ బౌలర్

బంగ్లాదేశ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ ఐపీఎల్ మెగా ఆక్షన్ లో భారీ ధర లభించిన సంగతి తెలిసిందే. ముస్తాఫిజుర్ ను రూ. 9.2 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది. ముస్తాఫిజుర్ కోసం కేకేఆర్ ఎక్కడా తగ్గలేదు. చెన్నై సూపర్ కింగ్స్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ కేకేఆర్ ధాటికి వెనక్కి తగ్గక తప్పలేదు. ముస్తాఫిజుర్ కేకేఆర్ జట్టులోకి వచ్చినా ఆ జట్టుకు చిన్న షాక్ తగిలింది. ముస్తాఫిజుర్ సీజన్ మధ్యలో కొన్ని రోజులు అందుబాటులో ఉండడు. ఏప్రిల్ నెలలో న్యూజిలాండ్ పై బంగ్లాదేశ్ స్వదేశంలో వన్డే సిరీస్ ఆడనుంది. బంగ్లా జట్టులో ముస్తాఫిజుర్ కీలక బౌలర్ కావడంతో జాతీయ జట్టుకు ఆడాల్సి ఉంది. ఈ కారణంతో 8 నుంచి 10 రోజులు ఈ యార్కర్ల వీరుడు ఐపీఎల్ కు బ్రేక్ ఇవ్వనున్నాడు. 

న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో బంగ్లాదేశ్ కు ప్రాతినిధ్యం వహించడానికి ముస్తాఫిజుర్ స్వదేశానికి తిరిగివస్తాడని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) కన్ఫర్మ్ చేసింది. అంతర్జాతీయ మ్యాచ్ లు ఉన్న కారణంగా ఐపీఎల్ సీజన్ మధ్యలో ముస్తాఫిజుర్ దాదాపు ఎనిమిది నుండి పది రోజులు అందుబాటులో ఉండరని క్రికెట్ ఆపరేషన్స్ చైర్మన్ నజ్ముల్ అబెదీన్ ఫాహిమ్ చెప్పుకొచ్చారు. ఈ స్వల్ప విరామం మినహా మొత్తం ఐపీఎల్ సీజన్‌లో ఈ బంగ్లా పేసర్ అందుబాటులో ఉంటాడు. 2027 వన్డే ప్రపంచ కప్‌కు నేరుగా అర్హత సాధించడానికి బంగ్లాదేశ్ కు కివీస్ తో సిరీస్ గెలవడం చాలా కీలకం. 

ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ.2 కోట్లతో ఆక్షన్ లోకి వచ్చినా ముస్తాఫిజుర్ అన్ సోల్డ్ గానే మిగిలిపోయాడు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ప్లే ఆప్స్ ఆడాడు. ఆస్ట్రేలియా క్రికెటర్ జాక్‌‌ ఫ్రేజర్‌‌ మెక్‌‌గర్క్‌‌ ప్లేస్‌‌లో బంగ్లాదేశ్‌‌ సీమర్‌‌ ముస్తాఫిజుర్‌‌ రెహమాన్‌‌ను ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంది. 2016లో ఐపీఎల్‌‌ అరంగేట్రం చేసిన ముస్తాఫిజుర్‌‌ 2022, 2023లో డీసీకి ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్‌‌ కెరీర్‌‌లో 38 మ్యాచ్‌‌లు ఆడిన ముస్తాఫిజుర్‌‌ 7.84 ఎకానమీతో 38 వికెట్లు తీశాడు. బంగ్లాదేశ్ తరఫున ముస్తాఫిజుర్  106 టీ20ల్లో 132 వికెట్లు పడగొట్టాడు. 

ముస్తాఫిజుర్ లేకపోయినా కేకేఆర్ జట్టులో చాలా ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. శ్రీలంక యువ పేస్ సంచలనం మతీషా పతిరానాను రూ.18 కోట్లకు కేకేఆర్ జట్టు దక్కించుకుంది. హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, ఉమ్రాన్ మాలిక్, ఆకాష్ దీప్, కార్తీక్ త్యాగి లాంటి ఇండియన్ పేసర్లతో కేకేఆర్ జట్టు ఈ విభాగంలో పటిష్టంగా కనిపిస్తోంది.