సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని జార్ఖండ్ గెలుచుకుంది. ఫైనల్లో హర్యానాపై గ్రాండ్ విజయం సాధించి టైటిల్ తమ ఖాతాలో వేసుకుంది. గురువారం (డిసెంబర్ 18) పూణే వేదికగా మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన తుది సమరంలో 69 పరుగుల తేడాతో ఈజీ విక్టరీ కొట్టింది. మొదట బ్యాటింగ్ లో ఇషాన్ కిషాన్ (101) సెంచరీకి తోడు కుశాగ్ర (81) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో పాటు.. బౌలర్లు సమిష్టిగా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. మొదట బ్యాటింగ్ చేసిన జార్ఖండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. ఛేజింగ్ లో హర్యానా 18.3 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది.
263 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన హర్యానా జట్టుకు ప్రారంభంలోనే ఘోరమైన ఆరంభం లభించింది. కెప్టెన్ అంకిత్ కుమార్, ఆశిష్ సివాచ్ డకౌట్ కావడంతో ఒక పరుగు వద్ద 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కాసేపాటికీ అర్ష్ రంగ (17) కూడా పెవిలియన్ చేరడంతో 36 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయి ఒత్తిడిలో పడింది. ఈ దశలో వికెట్ కీపర్ యశ్వర్ధన్ దలాల్ (53), నిశాంత్ సింధు జట్టును ముందుకు తీసుకెళ్లారు. మెరుపులు మెరిపిస్తూ విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. నిశాంత్ సింధు (31) ఔట్ కావడంతో హర్యానా ఓటమి ఖారారైంది. సమంత్ జఖర్ చివర్లో వేగంగా ఆడినా టార్గెట్ పెద్దది కావడంతో ఓటమి తప్పలేదు.
బ్యాటింగ్ లో చెలరేగిన జార్ఖండ్:
కెప్టెన్ ఇషాన్ కిషాన్ సెంచరీతో పాటు కుమార్ కుశాగ్ర (38 బంతుల్లో 81: 8 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీ చేయడంతో జార్ఖండ్ భారీ స్కోర్ చేసింది. ఆరంభంలో విరాట్ సింగ్ వికెట్ కోల్పోయినప్పటికీ కుశాగ్రతో కలిసి కిషాన్ ఓ రేంజ్ లో చెలరేగి ఆడాడు. ఇద్దరూ హర్యానా బౌలర్లపై ఆరంభం నుంచి ఎదురు దాడికి దిగారు. కిషాన్, కుశాగ్ర కలిసి రెండో వికెట్ కు ఏకంగా 82 బంతుల్లోనే 177 పరుగులు జోడించాడు. వీరిద్దరూ భారీ భాగస్వామ్యం తర్వాత స్వల్ప వ్యవధిలో ఔటైనా.. చివర్లో రాబిన్ మింజ్ (31), అనుకుల్ రాయ్ (40) చితక్కొట్టారు. దీంతో జార్ఖండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది.
