రుణమాఫీ చేయకపోతే మాకు అధికారం ఎందుకు? : సీఎం రేవంత్ రెడ్డి

రుణమాఫీ చేయకపోతే మాకు అధికారం ఎందుకు? : సీఎం రేవంత్ రెడ్డి
  • ఇందుకు మహా అయితే 30 వేల కోట్ల నుంచి 40 వేల కోట్లయితయ్: సీఎం రేవంత్ రెడ్డి
  • కేసీఆర్​ దోపిడీ కంటే క్రాప్​ లోన్​ మాఫీ ఖర్చు ఎక్కువేం కాదు
  • రైతులు మా కుటుంబ సభ్యులు, మా పరివారం 
  • పంద్రాగస్టులోపు రెండు లక్షల రుణమాఫీ గ్యారెంటీ
  • హరీశ్.. స్పీకర్​ ఫార్మాట్లో రాజీనామా చేసి, లేఖను జేబులో పెట్టుకో
  • రిజర్వేషన్ల రద్దుకు మోదీ కుట్రబీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ..
  • అప్రమత్తంగా ఉండాలి.. బీజేపీ తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి
  • సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం సమావేశం 

హైదరాబాద్​, వెలుగు: రైతులకు రుణమాఫీ చేయకపోతే తమకు ఈ అధికారం ఎందుకని, తామున్నదే రైతుల కోసమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులు ఎవరో కాదనీ, వాళ్లంతా తమ కుటుంబ సభ్యులేనని  చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు ఇచ్చిన మాట తప్పేది లేదని, పంద్రాగస్టు లోగా రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతానని తెలిపారు. శుక్రవారం జూబ్లీహిల్స్​లోని తన కార్యాలయంలో కాంగ్రెస్​ సోషల్​ మీడియా వారియర్స్​తో రేవంత్​రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘రైతులు ఎవరో కాదు.

వాళ్లు మా పరివారం. రుణమాఫీకి ఎంతవుతుంది.. మహా అయితే 30, 40వేల కోట్లవుతుంది. కానీ.. ఏమైతది.. అది కాళేశ్వరంలో కేసీఆర్​ దోచుకున్న లక్ష కోట్ల కన్నా ఎక్కువనా? హైదరాబాద్​ చుట్టుపక్కల మీరు (బీఆర్​ఎస్​) ఆక్రమించుకున్న వేల ఎకరాల కన్నా ఎక్కువనా?” అని ప్రశ్నించారు. కేసీఆర్​లా దోపిడీ చేయకుండా కడుపు కట్టుకుంటే రూ. 40 వేల కోట్లు బ్యాంకులకు చెల్లించవచ్చని అన్నారు. హరీశ్​రావు సవాల్​ను తాను మరోసారి స్వీకరిస్తున్నానని, ఆయనను రాజీనామా లేఖ  జేబులో పెట్టుకొని రెడీగా ఉండాలని సవాల్​ విసిరారు. అయితే, హరీశ్​రావు రాజీనామా చేసిన ఫార్మాట్​ సరిగ్గా లేదని, అదో నాటకంలా ఉందన్నారు. స్పీకర్​ ఫార్మాట్​లో ఆయన రాజీనామా లేఖ రాయడానికి బదులు తన మామ చెప్పినట్టుగా సీస పద్యం రాసుకొచ్చారని ఎద్దేవా చేశారు. అది చెల్లదని చెప్పారు. 

‘‘హరీశ్​​ నీ తెలివి తేటలు మోకాళ్లలో కాదు.. అరికాళ్లలోకి జారినట్లున్నయ్​. దూలం లెక్క పెరిగితే కాదు.. దూడకున్న బుద్ధి ఉండాలె.  ఆగస్టు 15 తర్వాత సిద్దిపేటకు నీ శని పోతుంది.” అని చురకలంటించారు.   చింతమడకకుపోయి చింత చెట్టుకింద పడుకోమని కూడా తాను హరీశ్​కు​ చెప్పానని రేవంత్​ తెలిపారు. ఏదైనా మోసం చేయాలనుకున్నపుడల్లా హరీశ్​కు అమరువీరుల స్తూపం గుర్తొస్తుందని, ఇయ్యాలకూడా అట్లనే అక్కడికే వెళ్లి అబద్ధాలు చెప్పారని అన్నారు. రుణమాఫీ అని రాజీనామా లేఖలో ఏవేవో విషయాలు రాసుకొచ్చారని,  హరీశ్​రావుకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఒక్క పదం పొల్లుపోకుండా ఫార్మాట్​లో రాజీనామా లేఖ రాయాలని రేవంత్​ సవాల్​ విసిరారు.

రైతులకు రుణమాఫీ చేసే విషయాన్ని సోషల్​మీడియా వారియర్స్​ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఇపుడు ఫైనల్స్​ జరుగుతున్నాయనీ, సెమీ ఫైనల్స్​లో బీఆర్ఎస్​ను ఓడించామని రేవంత్​రెడ్డి తెలిపారు. ఫైనల్స్​లో ఇపుడు బీజేపీతో తలపడుతున్నామనీ, మోదీని కూడా ఓడించాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల తరహాలో సోషల్​ మీడియా కార్యకర్తలు కష్టపడి పని చేయాలని, వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

రాష్ట్రం మీద కుట్రలు సాగుతున్నయ్​..

తెలంగాణలో కాంగ్రెస్​ అధికారంలోకి రావడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని, రాష్ట్రం మీద దాడి జరుగుతోందని రేవంత్​ అన్నారు. ‘‘ఈ రోజు మన మీద కుట్రలు జరుగుతున్నాయి. మీరు కష్టపడి తెచ్చిన ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నరు.  బీఆర్ఎస్​ ఎట్లా తయారయ్యిందంటే నేను పోతే చాలు అనుకుంటున్నరు. ఎందుకంటే నేనున్నంత సేపు వాళ్ల ఆటలు సాగవు. కథలు చెల్లవు. తండ్రీ కొడుకులకు మనల్ని చూస్తేనే పాములు జెర్రులు పాకినట్లు అవుతున్నది. వాళ్ల ప్యాంట్లు కూడా పచ్చిగయినట్లున్నయి’’అని రేవంత్​ ఎద్దేవా చేశారు.

అందుకే వాళ్లు ఎవ్వరితోనైనా కలిసేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఒక సభలో కేటీఆర్​ తమకు 12 సీట్లు ఇవ్వాలని, ఏడాదిలో తమ ప్రభుత్వమే వస్తదని అంటున్నాడని, ఇది ఎట్లా సాధ్యమని రేవంత్​ ప్రశ్నించారు. ‘‘అంతా అల్లాటప్పాగా ఇక్కడ కూసోని ఉన్నమా? లేకపోతే నీలెక్క అయ్య పేరు చెప్పుకొని కుర్చీల కూసున్నమా”అని కేటీఆర్​ను రేవంత్​ నిలదీశారు. బీజేపీ, బీఆర్ఎస్​ కలిసి ఇలాంటి ఎన్నో కుట్రలు చేస్తున్నాయని, అందరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోషల్​ మీడియా వేదికగా కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ‘‘రేపు జరగబోయే లోక్​సభ​ ఎన్నికల్లో ఒక్కటే లెక్క.. 14 పక్కా.. అనే నినాదంతో మీరందరూ పని చేయాలి. యుద్ధ సమయాల్లో సైనికుల్లెక్క కష్టపడాలి’’అని సూచించారు. 

తెలంగాణపై బీజేపీ ముప్పేట దాడి

ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్​ షా, జేపీ నడ్డా, ఇతర నాయకులు తెలంగాణపై ముప్పేట దాడి చేసి.. ఎట్లాగైనా గెలవాలని చూస్తున్నారని రేవంత్​ రెడ్డి అన్నారు. దీని కోసం తమ వాళ్లనే కాకుండా కిరాయి మనుషులను కూడా పెట్టుకొని తప్పుడు వార్తలను ప్రచారం చేస్తూ.. ప్రజాస్వామ్యం మీద దాడి చేస్తున్నారని ఆరోపించారు. భారత రాజ్యాంగం ప్రకారం వచ్చిన రిజర్వేషన్ల మీద దాడి చేస్తున్నారని మండిపడ్డారు. దీని కోసం మతాన్ని, ప్రభుత్వ ఏజెన్సీలను వాడుకుంటున్నారని ఆరోపించారు. ‘‘ఎట్లాగైనా 400 సీట్లు తెచ్చుకొని రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తున్నరు.

వాళ్లు గతంలో ట్రిపుల్​ తలాక్​, పౌరసత్వ సవరణ చట్టం, యూనిఫామ్​ సివిల్​ కోడ్​, ఆర్టికల్​ 370,  నోట్ల రద్దు, జీఎస్టీ , రైతు వ్యతిరేక నల్ల చట్టాల్లాంటి వాటిని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నా సింపుల్​ మెజారిటీ సరిపోతుందని ఇష్టారాజ్యంగా మార్పులు చేర్పులు చేశారు. కానీ ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలంటే మూడింట్లో రెండో వంతు మెజారిటీ కావాలి. దాని కోసం కంకణం కట్టుకున్నరు. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని చూస్తున్నారు’’అని  రేవంత్​ అన్నారు. దీని కోసం మతాన్ని అస్త్రంగా వాడుతున్నారని చెప్పారు.

శ్రీరామ నవమి వస్తే దాన్ని ఒక సమస్యలాగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. బతుకమ్మ, బోనాలను మనకు కవితమ్మ నేర్పినట్టు, రామనవమి, హనుమాన్​ జయంతి గురించి గుండు, అర గుండు  కలిసి నేర్పుతున్నారని బండి సంజయ్​, అరవింద్​నుఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘మనమెప్పుడూ శ్రీ రామ నవవి చేసుకోలేదా? పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మలకు మొక్కులు తీర్చుకోలేదా? వీళ్లేందో ఇపుడు కొత్తగా వచ్చి చెప్తున్నరు’’అని విమర్శించారు. ఇంతకు ముందే చెప్పినట్లు దేవుడు గుడిలో, భక్తి గుండెల్లో ఉండాలన్నారు. కానీ దీన్ని రాజకీయం కోసం వాడుకొని ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్న బీజేపీ ప్రయత్నాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరి మీదా ఉన్నదని ఆయన వారియర్స్​కు ఉద్బోధించారు. 

ఆర్ఎస్ఎస్​, బీజేపీది ఒకే విధానం

బీజేపీ, ఆర్ఎస్ఎస్​ భావజాలం ఒక్కటేనని రేవంత్​రెడ్డి అన్నారు. రిజర్వేషన్లు రద్దు చేయాలన్నది ఆర్ఎస్ఎస్​ విధానమని చెప్పారు. ‘‘నాడు ఈస్టిండియా కంపెనీ గుజరాత్​లోని సూరత్​లో అడుగు పెట్టి చిన్న చిన్నగా దేశంలోని సంస్థానాలన్నీ ఆక్రమించుకున్నది. దేశంలోని పరిస్థితులు, మన మధ్య సఖ్యతలేని విషయాన్ని గుర్తించి బ్రిటిషర్లు సక్సెస్​ అయ్యిండ్రు.

ఇపుడు అదే గుజరాత్​ నుంచి వచ్చిన మోదీ, అమిత్​ షా కూడా బ్రిటిషర్ల విధానాలనే పాటిస్తూ.. మన మధ్య ఉన్న చిన్న తగాదాలు ఉపయోగించుకొని దేశాన్ని ఆక్రమించాలని అనుకుంటున్నారు’’అని రేవంత్ పేర్కొన్నారు. బీజేపీ అంటే ‘భారతీయ జనతా పార్టీ’ కాదని, అది ‘బ్రిటిష్​ జనతా పార్టీ’ అని కొత్త నిర్వచనం చెప్పారు. ఈ కుట్రలన్నింటిపై అప్రమత్తంగా ఉండాలని, ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాలని, నాయకులకు, ప్రజలకు మధ్య  అనుసంధాన కర్తలుగా ఉండాలని సోషల్​మీడియా వారియర్లకు రేవంత్​ సూచించారు.

పదేండ్లలో రూ.113 లక్షల కోట్ల అప్పు చేసిన మోదీ

ప్రధాని మోదీ దేశాన్ని అంబానీ, అదానీలకు తాకట్టుపెట్టాలని చూస్తున్నారని రేవంత్​ అన్నారు. రిజర్వేషన్లను తొలగించి ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు అప్పజెప్పాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇందులో భాగంగానే 60 లక్షల కోట్ల విలువ చేసే కంపెనీలను ఆరు వేల కోట్లకే  పల్లీబఠానీల లెక్క అమ్మేశారన్నారు. ‘‘గత 67 ఏండ్లలో దేశాన్ని పరిపాలించిన 14 మంది ప్రధానులు కలిసి రూ. 55 లక్షల కోట్లు అప్పు చేస్తే, మోదీ మాత్రం పదేండ్లలో రూ.113 లక్షల కోట్లు అప్పు చేశారు. దేశానికి ఇప్పుడు రూ. 168 లక్షల కోట్ల అప్పు ఉంది. ఆ సొమ్మంతా ఎక్కడికి పోయిందని మోదీని అడిగితే చెప్పరు. గట్టిగా అడిగితే జై శ్రీరామ్​, జై హనుమాన్​ అంటరు. ఒక ఎమోషనల్​ సీన్​ క్రియేట్​చేస్తరు’’అని విమర్శించారు. ఏడు లక్షల కోట్ల అప్పుచేసిన కేసీఆర్ సైతం పైసల గురించి అడిగితే ‘జై తెలంగాణ’ అంటారని విమర్శించారు. రాముడిపేరిట బీజేపీ కప్పుకున్న ముసుగు తొలిగిందని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీ నడ్డి విరుస్తారని అన్నారు. 

ఈ రోజు మన మీద కుట్రలు జరుగుతున్నాయి. మీరు కష్టపడి తెచ్చిన ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నరు.  బీఆర్ఎస్​ ఎట్లా తయారయ్యిందంటే నేను పోతే చాలు అనుకుంటున్నరు. ఎందుకంటే నేనున్నంత సేపు వాళ్ల ఆటలు సాగవు. కథలు చెల్లవు. తండ్రీ కొడుకులకు మనల్ని చూస్తేనే పాములు, జెర్రులు పాకినట్లు అవుతున్నది. వాళ్ల ప్యాంట్లు కూడా పచ్చిగయినట్లున్నయి.
- సీఎం రేవంత్​రెడ్డి