ఏనుగమ్మా ఏనుగు! నాలుగుకాళ్ల ఏనుగు… మా ఊరొచ్చింది ఏనుగు…అంటూ చిన్నతనంలో
ప్రతి ఒక్కరూ ఏనుగుని చూసి సంబరపడుతూ చప్పట్లు కొట్టి ఉంటారు. ఏనుగు ఊళ్లోకి వస్తేనే ఇంత హడావుడి ఉంటే మీ ఇంటికొస్తే.. మీతో కలిసి ఆటాడుకుంటే.. అంతెందుకు మీతో ఫ్రెండ్షిప్ చేస్తే .. కానీ అలా జరగదుగా అంటున్నారా! కానీ జరిగింది! ఏంటి నమ్మబుద్ధి కావట్లేదా? అయితే జింబాబ్వేకి చెందిన ఈ ఏనుగు కథ చదవాల్సిందే.
అనగనగా ఒకరోజు ఓ బుజ్జి ఏనుగు తల్లి ఏనుగు నుంచి తప్పిపోయింది. వారం రోజుల పిల్ల కావడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు పాపం ఆ ఏనుగుకి. దాంతో ‘నన్ను వెతుక్కుంటూ అమ్మ వస్తుందిలే’ అని ఎక్కడికీ వెళ్లకుండా తప్పిపోయిన చోటే కూర్చుంది. కానీ ఎంత సేపు ఎదురుచూసినా అమ్మ రాలేదు. అమ్మ వెంటలేకపోవడంతో చాలా భయపడి ఏడ్చింది. చేసేదేంలేక నెమ్మదిగా కూర్చున్న చోటి నుంచి లేచి అమ్మ కోసం వెతుకులాట మొదలుపెట్టింది. చిన్నచిన్న అడుగులతో కొద్దిదూరం నడవగానే నీళ్ల చెరువు కనిపించింది. అమ్మతో కలిసి నీళ్లతో ఆడిన జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చినట్టున్నాయ్. సరదాగా కాసేపు ఆడుకుందాం అనుకుంది. కానీ నీళ్ల ప్రవాహానికి ఆ బుజ్జి ప్రాణం ఎదురునిలబడలేకపోయింది.
అయ్యో…
నీట మునిగింది పాపం. ఆ నీటి నుంచి బయటకు ఎలా రావాలో అర్థం కాక ఊపిరాగిపోయినంత పనైంది. ఎవరైనా ఆ నీటి నుంచి బయటపడేయకపోతారా అని ఆశగా ఎదురు చూస్తోంది. సరిగ్గా ఆ టైంలోనే ‘ వైల్డ్ ఈజ్ లైఫ్ ’ జంతువుల్ని కాపాడే ఆర్గనైజేషన్ ఫౌండర్ రాక్సీ డ్యాక్వర్ట్స్ ఆ పక్కగా కారులో వెళ్తూ… ఏనుగుని గమనించింది. ఆమె జంతు ప్రేమికురాలు కావడంతో ఏనుగుని ఆ స్థితిలో చూసి తట్టుకోలేకపోయింది. వెంటనే
కారు దిగి చెరువు దగ్గరికి పరిగెత్తింది. చుట్టుపక్కల వాళ్లందరినీ పిలిచి సాయం అడిగింది. కొందరు ముందుకు రావడంతో ఏనుగుని బయటకు తీసి ఆర్గనైజేషన్‌కి తరలించింది.
ఆ తర్వాత
నీళ్లలో మునిగిపోవడం, తల్లి పక్కన లేకపోవడంతో ఏనుగు ఆరోగ్యం పూర్తిగా పాడయింది. ఆ ఏనుగు పరిస్థితిని చూసి రాక్సీ చాలా బాధపడింది. తనకు తెలిసిన పెద్ద పెద్ద డాక్టర్లందరినీ పిలిచి దాన్ని బాగుచేయమని కోరింది. మూడు రోజుల ట్రీట్మెంట్ తర్వాత ఏనుగు స్పృహ లోకి వచ్చింది. ప్రాణానికైతే ముప్పు తప్పింది. కానీ, చాలా వీకైపోయింది ఏనుగు. బరువు కేవలం 56 కేజీలే ఉంది. ఏనుగు బాధని చూసి తట్టుకోలేకపోయింది రాక్సీ. దాన్ని మామూలు కండీషన్‌కి తీసుకురావడానికి ఇంటికి తీసుకొచ్చింది.
స్నేహం కుదిరింది

ఏనుగు ఆలనా పాలనా అన్నింటిని దగ్గరుండి చూసుకోవడం మొదలుపెట్టింది రాక్సీ. ప్రతిరోజూ స్నానం చేయించి, మంచి తిండి తినిపించింది. పైగా ‘మొయొ’ అని పేరు కూడా పెట్టింది ఆ బుజ్జి ఏనుగుకి. రాక్సీ తనపై చూపిస్తున్న ప్రేమని చూసి మొయొ చాలా సంతోషపడింది. అమ్మలేదనే లోటు తెలియకుండా రాక్సీ చూసుకోవడంతో అన్నింటినీ మర్చిపోయి రాక్సీతో ఆడిపాడటం మొదలుపెట్టింది. రాక్సీ స్నేహం మొయొ ఆరోగ్యాన్ని బాగుచేసింది.
ఫాలో.. ఫాలో
రోజురోజుకి రెక్సాకీ, మొయొకి మధ్య స్నేహం పెరుగుతూ వచ్చింది. ఎంతలా అంటే ఒకర్ని విడిచి మరొకరు బతకలేనంతలా.. రాక్సీ ఏదైనా పనిమీద బయటికి వెళ్లినా మొయొ ఊరుకునేది కాదు. వెళ్లొద్దు అంటూ గోలగోల చేసేది. కళ్లు కప్పి వెళ్లినా కారు వెనకే పరిగెడుతూ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్లేది. చుట్టు పక్కల వాళ్లు ‘‘ఎవరైనా ఏనుగుతో సావాసం చేస్తారా దాన్ని అడివిలో వదిలేయ్’’ అంటూ రాక్సీని తిట్టేవాళ్లు. కానీ ఆమాటలన్నింటినీ ర్యాక్సీ పట్టించుకోకుండా మొయొని దత్తత తీసుకుని దానికి రెండో అమ్మ అయింది.

ఓవర్ కమ్
మొయొ బాగోగులు చూసుకోవడం ఒక ఎత్తైతే, దాని భయాలను దూరం చేయడం ఒక సవాలుగా మారింది రాక్సీకి. నీళ్లల్లో ప్రాణాలతో పోరాడటంతో కాలువలు, చెరువులు చూస్తే ఆమడ దూరం పరిగెత్తేది మొయొ. మళ్లీ అలానే అవుతుందనే భయం బలంగా నాటుకుపోయింది దానిలో. ఆ భయాన్ని పోగొట్టడానికి రాక్సీ చాలా ప్రయత్నాలు చేసింది. 15 నెలల పాటు థెరపీ కూడా చేయించింది. ఆ థెరపీ వల్ల మొయొ నీళ్ల భయంపై గెలిచింది. ఇప్పుడు మూడునాలుగు రోజులకొకసారి చెరువు దగ్గరికి స్నానానికి కూడా వెళ్లి వస్తుంది.
ఏం చేస్తుందో తెలుసా?
రాక్సీ మొయొ కోసం ఇంట్లో ఒక గది కట్టించింది. ఆ గదిలో మొయొ కోసం బెడ్‌తో పాటు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసింది. కేవలం ఆ రూమే కాదు ఇల్లంతా చక్కర్లు కొడుతుంది మొయొ. టీవీ రిమోట్‌ని ఆపరేట్ చేస్తూ సోఫాలో కూర్చొని నచ్చిన షోస్ చూస్తుంది. మంచి బీట్ సాంగ్ వినపడితే ర్యాక్సీతో కలిసి స్టెప్పులేస్తుంది కూడా.
ఎంత బాగుంది కదా! ఎక్కడో నీళ్లలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న మొయొకి, రాక్సీ సాయం దొరకడం. తర్వాత ఎన్ని మార్పులో. గత ఐదేళ్ల నుంచి వీళ్ల బంధం అలానే కొనసాగుతూ ఉంది. రాక్సీ లాంటి మంచి మనసున్న మనుషులు మొయొలాంటి జంతువులన్నింటికీ దొరికితే ఎంత బాగుంటుంది.

‘ఆకారం భారీగా ఉంటుందని, ఇళ్లలో పెంచుకోరు. కానీ.. వన్యప్రాణుల్లో ఏనుగులంత విశ్వాసం చూపేజీవి మరొకటి ఉండదేమో. ఏనుగులు చూపే ప్రేమ.. ఆప్యాయత ఎలా ఉంటుందో ఒక్క మాటలో చెప్పాలంటే మా మొయొని కలవాల్సిందే. ఇప్పటికి ఐదు సంవత్సరాలైంది మొయొ నా జీవితంలోకి వచ్చి. ఇన్ని రోజుల్లో వాడ్ని నేనెంత ప్రేమించానో వాడు తిరిగి నాకూ అంతే ప్రేమను అందిస్తోంది’ అంటోంది రాక్సీ.
