ఎల్బీ నగర్, వెలుగు: వీధి కుక్క దాడిలో ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. పాతబస్తీలోని సంతోశ్ నగర్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంతోష్ నగర్ లో ఉండే బాలుడు అబ్దుల్ రఫి(5) సోమవారం సాయంత్రం ఇంటి ముందు నిలబడి ఉన్నాడు. అదే టైమ్ లో ఓ కుక్క విచక్షణా రహితంగా బాలుడిపై దాడికి పాల్పడింది. గమనించిన స్థానికులు కుక్కను తరిమి వేశారు. తీవ్రంగా గాయపడ్డ రఫిని ఆస్పత్రికి తరలించారు.
వీధి కుక్కల బెడదపై జీహెచ్ఎంసీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాలుడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కాగా బాలుడిపై కుక్క దాడి చేస్తున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ కుక్కను పట్టుకున్నట్లు వెటర్నరీ అధికారులు తెలిపారు. దాన్ని అబ్జర్వేషన్ లో పెట్టేందుకు చుడిబజార్ లోని యామిమల్ కేర్ సెంటర్ కు తరలించినట్లు పేర్కొన్నారు.

