వీధి కుక్కలపై మా తీర్పు మారదు.. వ్యాక్సినేషన్ వేసినా వదలొద్దు : సుప్రీంకోర్టు

వీధి కుక్కలపై మా తీర్పు మారదు.. వ్యాక్సినేషన్ వేసినా వదలొద్దు : సుప్రీంకోర్టు

వీధి కుక్కల నియంత్రణపై సుప్రీం కోర్టు అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేసింది. పాఠశాలలు, ఆసుపత్రులు, కళాశాలలు, బస్సు రైల్వే స్టేషన్ల వంటి బహిరంగ, ప్రభుత్వ విద్యా సంస్థల ప్రాంగణాల నుండి వీధి కుక్కలను తక్షణమే తొలగించాలంటూ గతంలో నవంబర్ 25న ఇచ్చిన ఉత్తర్వులను మార్చడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఆయా ప్రాంతాల నుండి కుక్కలను పట్టుకెళ్లి, వాటికి వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ పూర్తి చేసినప్పటికీ.. వాటిని తిరిగి అదే పబ్లిక్ ప్రాంగణాల్లోకి వదిలిపెట్టకూడదనే నిబంధన కచ్చితంగా అమలులో ఉంటుందని కోర్టు క్లారిటీ ఇచ్చింది. యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా వీధి జంతువులపై జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను సుప్రీం కోర్టు ఈ సందర్భంగా పూర్తిగా కొట్టివేసింది.

అలాగే దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న వీధి కుక్కల జనాభాను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల వైఫల్యాన్ని ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది. వీధి కుక్కల నియంత్రణకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించటంలో రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతర ప్రయత్నాలు చేయడం లేదని న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. నిధుల కొరత, సరైన ప్లానింగ్ లేకపోవడం వల్లే ఈ సమస్య జటిలమవుతోందని ధర్మాసనం పేర్కొంది.

జంతువుల జనన నియంత్రణ రూల్స్ అమలు దేశవ్యాప్తంగా చాలా చోట్ల అస్తవ్యస్తంగా, అరకొర నిధులతో, కేవలం అప్పుడప్పుడు మాత్రమే సాగుతోందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. స్థానిక సంస్థలు, రాష్ట్ర యంత్రాంగాలు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోకపోవడం వల్లే ప్రజలపై వీధి కుక్కల దాడులు పెరుగుతున్నాయని ధర్మాసనం మండిపడింది. తక్షణమే ఇందుకోసం అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేసి, పబ్లిక్ ఏరియాల్లో భద్రతను పర్యవేక్షించాలని కోర్టు ఆదేశించింది.