- 250 బెడ్లకుపైగా ఉన్న హాస్పిటల్‌లో ఫైర్ సేఫ్టీ కమిటీ, క్వాలిఫైడ్ ఆఫీసర్ ఉండాల్సిందే
- ప్రతి మూడు నెలలకు ఒకసారిఫైర్ సేఫ్టీపై రివ్యూ తప్పనిసరి
- ఫైర్ సేఫ్టీపై కేంద్రం కొత్త గైడ్ లైన్స్
- ఆస్పత్రుల్లో జరిగే 80 శాతం ప్రమాదాలకు ఎలక్ట్రికల్ ఫాల్ట్స్ కారణమని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: హాస్పిటల్స్‌లో అగ్నిప్రమాదాలను అరికట్టేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ కొత్త గైడ్‌లైన్స్ విడుదల చేసింది. గత ప్రమాదాలపై స్టడీ చేసిన కేంద్రం.. మెజారిటీ ప్రమాదాలకు షార్ట్ సర్క్యూటే కారణమని తేల్చింది. దీనికోసం హాస్పిటల్ నిర్మాణంలోనే మంటలు వ్యాపించని నాన్ -కంబస్టబుల్ మెటీరియల్, ఐఎస్ఐ ముద్ర ఉన్న ఎలక్ట్రికల్ వస్తువులనే వాడాలని స్పష్టం చేసింది. ప్రతి ఫ్లోర్‌లో ఎగ్జిట్ రూట్లు క్లియర్‌గా ఉండేలా ఎవాక్యుయేషన్ మ్యాప్స్ ఏర్పాటు చేయాలని, ఆక్సిజన్ సిలిండర్లు, మెడికల్ గ్యాస్ పైప్ లైన్ల దగ్గర అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది.
ఫైర్ సేఫ్టీ కమిటీ మస్ట్...
హాస్పిటల్ సేఫ్టీని పర్యవేక్షించేందుకు ప్రతి హెల్త్ కేర్ సెంటర్‌లో అడ్మినిస్ట్రేషన్, ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్లతో కూడిన ఫైర్ సేఫ్టీ కమిటీ ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా15 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న బిల్డింగులు లేదా 250 బెడ్ల సామర్థ్యం ఉన్న హాస్పిటల్స్‌కు కనీసం మూడేండ్ల అనుభవం ఉన్న స్పెషల్ ఫైర్ సేఫ్టీ ఆఫీసర్‌ను నియమించాలి. తమను తాము రక్షించుకోలేని స్థితిలో ఉండే ఐసీయూ, ఎన్ఐసీయూ పేషంట్ల కోసం స్పెషల్ ఎవాక్యుయేషన్ ప్రొటోకాల్స్ ఉండాలని కేంద్రం పేర్కొంది. పసిపిల్లల వార్డుల్లో ప్రతి బెడ్ దగ్గర ఫైర్ ఎవాక్యుయేషన్ కిట్ సిద్ధంగా ఉంచాలని, ఎమర్జెన్సీ సమయంలో శిశువులను సురక్షితంగా తరలించేలా సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని మార్గదర్శకాల్లో సూచించింది.
ఏటా రెండు సార్లు మాక్ డ్రిల్..
ప్రమాదం జరిగినప్పుడు సిబ్బంది తక్షణమే స్పందించేలా ఆర్ఏసీఈ ప్రొటోకాల్ (రక్షించడం, అలారం మోగించడం, మంటలను ఆపడం, ఆర్పివేయడం) ను పీఏఎస్ఎస్ (అగ్నిమాపక యంత్రం వాడే పద్ధతి) ఫార్ములాలను అమలు చేయాలని కేంద్రం ఆదేశించింది. కేవలం ట్రైనింగ్‌తో సరిపెట్టకుండా ఏటా కనీసం రెండు సార్లు ఫైర్ మాక్ డ్రిల్స్ నిర్వహించి రికార్డులను భద్రపరచాలి. ప్రతి ఏటా గుర్తింపు పొందిన థర్డ్ పార్టీ ద్వారా ఎలక్ట్రికల్, ఫైర్ ఆడిట్ చేయించుకోవడంతో పాటు, ఫైర్ డిపార్ట్‌మెంట్ నుంచి పొందిన సేఫ్టీ సర్టిఫికెట్‌ను ఎప్పటికప్పుడు రెన్యూవల్ చేసుకోవాలి. ఈ రూల్స్ అతిక్రమించి రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడే హాస్పిటల్స్ పై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.
