హైదరాబాద్, వెలుగు: హార్టికల్చర్ వర్సిటీ ఉండగా అగ్రికల్చర్ వర్సిటీలో హార్టికల్చర్ సీట్లను కేటాయించడమేంటని పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులు ప్రశ్నించారు. ఈ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం సిద్దిపేట జిల్లా ములుగులోని హార్టికల్చర్ యూనివర్సిటీ ప్రాంగణంలో విద్యార్థులు నిరసన చేపట్టారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అగ్రికల్చర్ యూనివర్సిటీలో బీఎస్సీ హార్టికల్చర్‌కు 30 సీట్లు, ఎంఎస్సీకి 8 సీట్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
హార్టికల్చర్ కోర్సులు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న హార్టీకల్చర్వర్సిటీ ఉన్నప్పటికీ మళ్లీ అగ్రికల్చర్ వర్సిటీలోనూ ఇదే కోర్సులకు సీట్లు కేటాయించడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఈ చర్యతో హార్టికల్చర్ వర్సిటీ ప్రాధాన్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లోగా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

