సబ్‌స్టేషన్‌లోనే సూసైడ్ చేసుకున్న ఆపరేటర్

సబ్‌స్టేషన్‌లోనే సూసైడ్ చేసుకున్న ఆపరేటర్

జగిత్యాల మండలం పొలాస సబ్‌స్టేషన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికుడు అంకం బుచ్చిరాజం సబ్‌స్టేషన్‌లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ ప్రభుత్వం కల్పించినట్లుగా కేటీఆర్ ప్రకటించిన 1.32 లక్షల ఉద్యోగాలలో 22,738 మంది ఆర్టిజన్స్ కూడా ఉన్నారు. అంతకు ముందు కాంట్రాక్ట్ వర్కర్లుగా పనిచేస్తున్న వీరందరనీ రెగ్యులర్ చేసి కొత్త ఉద్యోగాలు ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. అయితే కేటీఆర్ స్టేట్మెంట్ ఇచ్చినప్పటి నుంచి మిగతా ఉద్యోగుల మాదిరిగా సర్వీస్ బుక్స్, వేతనాలు ఇవ్వడంలేదని ఆర్టిజన్స్ నిరసన వ్యక్తంచేస్తున్నారు. ఈ నిరసనకు ఆర్టిజన్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజు నాయకత్వం వహిస్తుండటంతో.. శనివారం నాగరాజును టీఎస్ఎస్పీడీసీఎల్ యాజమాన్యం సస్పెండ్ చేసింది. దాంతో మనస్థాపం చెందిన అంకం బుచ్చిరాజం.. తన తోటి కార్మికులందరికీ పే స్కేల్స్ ఇవ్వాలంటూ సూసైడ్ లెటర్ రాసి సబ్‌స్టేషన్‌లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. తనలా ఆపరేటర్లుగా పనిచేస్తున్న 23 వేల మంది ఆర్టిజన్ సోదరులకు ఏపీఎస్ఈబీ రూల్స్ వర్తింపజేయాలని కోరుతూ రాజం తన సూసైడ్ లేఖలో పేర్కొన్నాడు. రాజంకు భార్యా, ఓ కొడుకు ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. రాజం మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.