ఫాల్తా నియోజకవర్గం మొత్తం రీపోలింగ్‌‌... మొత్తం 285 బూత్లలో ఈ నెల 21న పోలింగ్

ఫాల్తా నియోజకవర్గం మొత్తం రీపోలింగ్‌‌... మొత్తం 285 బూత్లలో ఈ నెల 21న పోలింగ్

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) శనివారం ఒక అరుదైన, సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఫాల్తా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్న మొత్తం 285 పోలింగ్ కేంద్రాల్లో తిరిగి ‘కొత్తగా’ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ప్రజాస్వామ్య ప్రక్రియకు తీవ్ర విఘాతం కలిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ పేర్కొంది. సాధారణంగా హింస జరిగిన కొన్ని కేంద్రాల్లోనే రీపోలింగ్ నిర్వహిస్తుంటారు. 

కానీ, ఒక నియోజకవర్గం మొత్తం మళ్లీ ఎన్నిక జరపడం చాలా అరుదు. ఫాల్తాలో మే 21వ తేదీన పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించిన ఓట్ల లెక్కింపును మే 24న చేపడతామని ఎన్నికల సంఘం అధికార ప్రతినిధి వెల్లడించారు. ఏప్రిల్ 23, 29న రెండు దశల్లో జరిగిన ఎన్నికల సమయంలో ఫాల్తాలో భారీగా అక్రమాలు జరిగినట్లు నివేదికలు అందాయి. ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడిచేలా అక్కడ పరిస్థితులు ఉండటంతో ఈసీ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

మే 4 న మిగతా ఫలితాలు

రాష్ట్రంలోని మిగిలిన అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు షెడ్యూల్ ప్రకారం మే 4వ తేదీనే జరగనుంది. అయితే, ఫాల్తా నియోజకవర్గ ఫలితం మాత్రం మే 24న వెలువడనుంది. ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.