ఎంట్రప్రెన్యూర్ గా ఎదగాలంటే ఈరోజుల్లో ఎన్నో కష్టాలుఎదుర్కోవాలి. మగవాళ్లతో పోలిస్తే ఆడవాళ్లకు ఎన్నోఅడ్డంకులు ఎదురవుతుంటాయి. ఒకవేళ వాళ్లు గృహిణిలు అయితే అదనంగా అయితే మరిన్ని బాధ్యతలు తోడవుతాయి.అయితే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించి సక్సెస్ శిఖరాలు అందుకుంటున్నవాళ్లు లేకపోలేదు. అలాంటిజర్నీతో సక్సెస్ ఫుల్ ఎంట్రప్రెన్యూర్స్‌గా ఎదిగిన నలుగురి విజయగాథలివి.
థింక్ పాజిటివ్
‘ఏదైనా ఒక పనిని ప్రారంభించే ముందు మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. ఎన్నిఆటంకాలు ఎదురైనా డీలా పడకూడదు. చిరునవ్వుతో సమస్యల్ని అధిగమించి ముందుకు సాగాలి. అప్పుడే విజయం మీసొంతం అవుతుంది’.. ఆటంకాల్నిఅధిగమించి ఎంట్రప్రెన్యూర్ గా ఎదిగిననమత్రా గోయెంకా చెబుతున్న మాటలివి. బెంగళూరుకు చెందిన నమ్రత ‘గ్రీన్ఆప్రాన్’ సంస్థ వ్యవస్థాపకురాలు. కెమికల్ ఫ్రీఫుడ్ ను అందించడం ఈ సంస్థ చేసే పని. ఒక కొడుకు పుట్టాక అప్పటివరకు చేస్తున్నన్యాయవాద వృత్తిని వదిలేసిందామె. తర్వాత ఇంట్లో ఖాళీగా ఉండటం ఇష్టం లేక ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్’లో ఒక కోర్స్ చేసింది. ఇంటిటెర్రస్ పై కూరగాయల్ని పండిం చడం మొదలుపెట్టింది. అప్పుడే ఆమెకు గ్రీన్ఆప్రాన్ స్థాపించాలన్న ఆలోచన కలిగింది. రసాయనాలను వాడకుండా సహజ సిద్ధమైన పద్ధతుల్లో కూరగాయల్నిపండించి.. వ్యాపారం చేయాలన్నది ఆమె ఉద్దేశం. అయితే రెగ్యు లర్ పంటలతో పాటు ఇండియన్ మార్కెట్లో అరుదుగా దొరికేపుట్ట గొడుగు రకాలను పండించడం ప్రారంభించింది. మొదట్లో అమ్మకాలు సరిగ్గా లేకపోవడంతో నష్టాలు వచ్చాయి. దీంతో వ్యాపారాన్ని మూసేయమని భర్త సలహా ఇచ్చాడు. అయినప్పటికీ తన సేవింగ్స్ తో గ్రీన్ ఆప్రాన్ నుకొనసాగించింది నమ్రత. రెండేళ్ల కష్టనష్టాల తర్వాత ఎట్టకేలకు వ్యాపారం ఒక గాడినపడింది. అప్పటికి బెంగళూరులో ఫుడ్ కల్చర్ విస్తరించడంతో నమ్రత పండించే పుట్టగొడుగులకు ఫుల్ గిరాకీ రావడం మొదలైంది. అలా మూడు నెలలు తిరగకముందే లక్షల ఆదాయం సంపాదించింది ఆమె. గతేడాది చివర్లో ఆన్ లైన్ స్టోర్ ను ప్రారంభించిన నమ్రత.. ఇతర రాష్ట్రాలకు కెమికల్ ఫ్రీ కూరగాయల్ని రవాణా చేసే స్థాయికి ఎదిగింది.
డిప్రెషన్ నుంచి సెలబ్రిటీగా…
కుకింగ్ వీడియోలతో ఆదరణ సంపాదించుకుంటున్న వాళ్లను చాలా మందినిమనం చూసుంటాం. కానీ, నోయిడాకు చెందిన యాభై ఐదేళ్ల నిషా మధులికా మాత్రం వెరీ స్పెషల్. పిల్లలు పెళ్లిళ్లయ్యి ఇంటి నుంచి వెళ్లిపోయాక ఆమె ఒంటరితనంతో బాధపడింది.ఆ బాధ నుంచి బయటపడేందుకు సరదా వ్యాపకాన్ని అలవాటు చేసుకుంది. సులువైన పద్ధతిలో వంటలు చేస్తూ యూట్యూబ్ లో అప్ లోడ్ చేయడం మొదలుపెట్టింది. ఆమె యూట్యూబ్ చానెల్ పేరు ‘నిషా ఆంటీజీ’. 2011లో మొదలైన ఆమె చానెల్‌కి, ఇప్పుడు 70 లక్షల మందికిపైగా సబ్ స్క్రయిబర్స్ ఉన్నారు. వందల కుకింగ్ షోలలో ఆమె పాల్గొంది. ‘నా వంటలు నచ్చితే ట్రై చేయండి. సిల్లీగా అనిపిస్తే కనీసం నా వంట వీడియోలైనా చూడండి’ అంటోందామె.
భర్త ఆశయం కోసం…
పిల్లలకు ఆరోగ్యవంతమైన జీవితాన్నిఅందించాలని ప్రతీ పేరెంట్స్ కోరుకుంటారు. తమిళనాడుకు చెందిన మేనక–తిలక్‌రాజ్ దంపతులు ఆ విషయంలో కొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకున్నారు. పిల్లలకు బలవర్థకమైన ఆహారాన్ని అందించాలని సొంతంగా ఆర్గానిక్ ఫుడ్ ను సాగు చేశారు.అప్పుడే తిలక్ కి ఒక ఆలోచన వచ్చింది. సంప్రదాయ రకాల వరి వంగడాలను పండించి.. వ్యాపారం మొదలుపెట్టాడు. ‘అస్వత్ ఇకో ఆర్గానిక్స్ ’ కంపెనీ స్థాపించి కనుమరుగైన 25 రకాల వరి వంగడాలను వాడుకలోకి తెచ్చాడు. కొన్నాళ్లకు తిలక్ చనిపోవడంతో కుటుంబ, వ్యాపార బాధ్యతలు మేనకపై పడ్డాయి. కొడుకు, కూతురి బాగోగులు చూసుకుంటూ.. బిజినెస్ లో ఎంట్రప్రెన్యూర్ గా రాణిస్తోందామె. ఇంకోవైపు రైతులకు సంప్రదాయ వంగడాలపై అవగాహన కల్పించేందుకు సెమినార్లు నిర్వహిస్తోంది. ఈ ప్రయాణంలో ఆమె కృషికి ఎన్నో అవార్డులు దక్కాయి. ‘ఒకప్పుడు మనదేశంలో లక్షకు పైగా వరి వంగడాలు ఉండేవి. దురదృష్టవశాత్తూ ఆ సంఖ్య ఇప్పుడు 30కి చేరింది. సంప్రదాయ పంటలుపండేందుకు ఎక్కువ టైం పడుతుంది.అందుకే నెల, రెండు నెలల్లో పండే పంటరకాల వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు రసాయనాలతో కల్తీకి పాల్పడుతున్నారు. సంప్రదాయ పంటల్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే ప్రజలకు ఆరోగ్యం, రైతులకు ఉపాధి దొరుకుతాయి’ అంటోంది మేనక. సంప్రదాయ పంటలపై ప్రజల్లోఅవగాహన పెంపొందించడం, ఇంటింటికి వాటిని పరిచయం చేయాలన్నతన భర్త ఆశయాన్ని సాధించడం ఇప్పుడు మేనక ముందున్న కర్తవ్యం.
తోపుడు బండితో మొదలై..
అవసరం అన్ని ఆవిష్కరణలకు కారణంఅంటోంది పత్రిషియా నారాయణ్. తమిళనాడులో సందీప రెస్టారెంట్లకు డైరెక్టర్ ఆమె. కానీ.. తోపుడు బండి, యాభైపైసలతో ముప్ఫై ఏళ్ల క్రితం మొదలైన ఆమె ప్రయాణం ‘చాలెంజ్ ’ సినిమాను తలపిస్తుంది. ఆమె ఎదుర్కొన్న కష్టాలు, ఉన్నత స్థాయికి చేరడానికి పడిన కష్టం ఎంతో మందికి స్ఫూర్తి ఇస్తుంది. పదిహేనేళ్లకే ప్రేమ పెళ్లి, పద్దెనిమిదేళ్లకే విడాకులు.. పత్రిషియాను మానసికంగా కుంగదీశాయి. ఇద్దరు పిల్లలతో రెండేళ్లపాటు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీసింది. చివరకు తల్లిదండ్రుల దగ్గరికిచేరినా.. వాళ్లకు భారం కాకూడదన్నఉద్దేశంతో ‘మొబైల్ కర్రీ పాయింట్’ఆలోచన చేసింది.పచ్చళ్లు, కూరలు తయారు చేసి ప్రభుత్వకార్యాలయాల చుట్టూ తిరిగి అక్కడి ఉద్యోగులకు అమ్మేది. ఆ తర్వాత తండ్రి సహకారంతో మెరీనా బీచ్ లో ఒకతోపుడు బండితో బజ్జీలు, చాయ్ అమ్మడం ప్రారంభించింది. అదేకాకుండా నగరంలోని గవర్నమెంట్ ఆఫీస్‌లకు భోజనం సరఫరా చేయడం మొదలుపెట్టింది.రెండు దశాబ్దాలపాటు తోపుడు బండి వ్యాపారం చేసింది. చివరకు ఆమె చేతివంటల రుచికి ఉన్న క్రేజ్ గుర్తించిన ఒక ప్రముఖ రెస్టారెంట్ తమ వ్యాపారంలో భాగస్వామిగా చేరాలని ఆహ్వానంపంపింది. 1998లో రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగుపెట్టిన ఆమెకి మరో అవాంతరం ఎదురైంది. కూతురు–అల్లుడు యాక్సిడెంట్‌లో చనిపోవడంతో ఆమె మళ్లీ డిప్రెషన్ లోకి వెళ్లింది. ఆ బాధ నుంచి తేరుకునేందుకు ఆమెకు రెండేళ్లు పట్టింది. చివరకు కూతురు జ్ఞాపకార్థం సందీప పేరు మీద 2006లో ఒక రెస్టారెంట్‌ను ప్రారంభించింది. ‘నేను హోటల్ ప్రారంభించినప్పుడు ఇద్దరు పనివాళ్లు ఉండేవాళ్లు.ఇప్పుడు రెండొందల మంది నా రెస్టారెంట్‌లలో పని చేస్తున్నారు. యాభై పైసలతో మొదలైన ప్రయాణం.. ఇప్పుడు రోజుకు రెండు లక్షలు సంపాదించే స్థాయికి ఎదిగింది. ఎంట్రప్రెన్యూర్ గా ఎదగాలంటే ఉన్నత చదువులతో పని లేదు. జీవితంలోతగిలే ఎదురు దెబ్బలు.. వాటి ద్వారా నేర్చుకునే పాఠాలు చాలంటోంది పత్రిషియా.
