పిల్లలు ఉప్మా తినడానికి మారాం చేస్తున్నారా ? అయితే ఈసారి ఇలా పన్నీర్, స్వీట్ కార్న్ చేసి పెట్టండి.. చక్కగా తినేస్తారు ! రెయిన్‌బో కలర్స్‌లో కనిపించే కూరగాయలు, మెత్తని పన్నీర్ ముక్కలతో నోరూరించే ఈ ఉప్మా పిల్లల లంచ్ బాక్స్‌లోకి కూడా చాలా బాగుంటుంది. ఆ రుచికరమైన రెసిపీ తయారీ విధానం ఏంటో చూద్దామా....
కావలసిన పదార్థాలు..
స్వీట్ కార్న్: అరకప్పు,
క్యాప్సికమ్: అర కప్పు,
క్యారెట్ తురుము : పావు కప్పు,
పచ్చిమిర్చి తరుగు : రెండు టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ తరుగు : అరకప్పు
గోధుమ రవ్పు: 1 కప్పు,
పన్నీర్ తురుము: 50గ్రా.
టొమాటో తరుగు : అర కప్పు
ఆవాలు : ఒక టేబుల్ స్పూన్
కరివేపాకు: రెండు రెమ్మలు,
నెయ్యి : ఒక టేబుల్ స్పూన్,
ఉప్పు: తగినంత
తయారీ విధానం
మొదట స్టవ్ మీద పాన్ పెట్టి రెండు కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. అందులో క్యారెట్, క్యాప్సికమ్, మొక్కజొన్న విత్తనాలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి ఉడికించాలి. మరోపాన్ లో నెయ్యి వేసి గోధుమ రవ్వ వేగించి పక్కన పెట్టాలి. అదే పాన్ లో నూనె వేసి ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయ తరుగు వేసి కొంచెం సేపు వేగించి అందులో పన్నీర్ తురుము వేసి రెండు నిమిషాలు వేగించాలి. తర్వాత ఉడికించిన కూరగాయల మిశ్రమాన్ని నీళ్లతో సహా వేసి కలపాలి. చిన్న మంట మీద ఉప్మా తయారయ్యే వరకు కలుపుతూ ఉండాలి. చివరగా కొత్తిమీర తరుగు, టొమాటో ముక్కలతో అలంకరించాలి.
