హైదరాబాద్, వెలుగు: డీజీపీ నియామకానికి సంబంధించిన ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే పూర్తి చేయనుందని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) సుదర్శన్‌రెడ్డి హైకోర్టుకు హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన సిఫారసుల నేపథ్యంలో యూపీఎస్సీ ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేర్ల జాబితాను గత మార్చి 12న పంపిందని చెప్పారు. ఈ జాబితా రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని, త్వరలోనే శాశ్వత ప్రాతిపదికపై డీజీపీ నియామకం పూర్తి చేసేందుకు రాష్ట్రం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం డీజీపీగా శివధర్‌రెడ్డిని నియమించిందంటూ హైదరాబాద్‌కు చెందిన టి. ధనగోపాల్‌రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని జస్టిస్ బి. విజయ్‌సేన్‌రెడ్డి ఇటీవల విచారణ చేపట్టారు. యూపీఎస్సీ ప్యానెల్ ముగ్గురు సీనియర్ అధికారులతో జాబితా పంపిందని, వాటిని ప్రభుత్వం పరిశీలిస్తున్నదని ఏజీ వెల్లడించారు. విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది.

