- సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సూర్యాపేట, వెలుగు : రానున్న వేసవి కాలంలో జిల్లాలోని గ్రామాల్లో నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సమీకృత కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వెబెక్స్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు.
జిల్లాలోని 818 ఆవాసాలకు మిషన్ భగీరథ ద్వారా నిరంతరాయంగా నీటి సరఫరా జరగాలని, రెడ్, ఆరెంజ్, ఎల్లో కేటగిరీల్లో ఉన్న గ్రామాలను గ్రీన్ కేటగిరీలోకి మార్చేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. శనివారం నాటికి 2026-–27 సంవత్సరానికి సంబంధించిన ‘సమ్మర్ యాక్షన్ ప్లాన్’ సిద్ధం చేయాలని, పైప్‌లైన్ లీకేజీలు, మోటర్లు, హ్యాండ్ పంపుల రిపేర్లను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలన్నారు.
అవసరమైన చోట గ్రామ పంచాయతీ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని, క్లోరినేషన్ కోసం బ్లీచింగ్ పౌడర్ అందుబాటులో ఉంచడంతో పాటు శిక్షణ పొందిన మంచినీటి సహాయకులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. నిధుల సమస్య ఉంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు మంచినీటి సరఫరా ఆగకూడదని అధికారులకు
సూచించారు.
ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం
సూర్యాపేట జిల్లాలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హెచ్చరించారు. బుధవారం ఎస్పీ కె. నరసింహతో కలిసి నిర్వహించిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇసుక రీచ్‌లలో అక్రమ రవాణా చేసే వాహనాలపై బైండోవర్ కేసులు నమోదు చేసి జరిమానాలు విధించాలని ఆదేశించారు.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇసుక కొరత లేకుండా ఆన్‌లైన్ ద్వారా సకాలంలో సరఫరా చేయాలని, అక్రమాలను అరికట్టేందుకు పోలీస్, రెవెన్యూ, మైనింగ్ విభాగాలతో ప్రత్యేక మొబైల్ టీమ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు.
ఏప్రిల్ 1 నుంచి మ్యాన్యువల్ విధానాన్ని రద్దు చేసి, కేవలం ఆన్‌లైన్ ట్రాన్సిట్ పాస్ సిస్టమ్ ‘మన ఇసుక వాహనం’ యాప్ ద్వారానే సరఫరా జరుగుతుందని స్పష్టం చేశారు. ఆమోదం పొందిన 729 ఇసుక ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు అంటించాలని, హై-ఎండ్ సీసీ కెమెరాలు, ఏఎన్‌పీఆర్ కెమెరాల నిరంతర పర్యవేక్షణ ద్వారా అక్రమ వాహనాలను గుర్తించి బ్లాక్ చేయాలని అధికారులను
ఆదేశించారు.
