ముంబై/బారామతి: మహారాష్ట్రలోని బారామతి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో దివంగత నేత అజిత్ పవార్ భార్య, ఎన్‌సీపీ చీఫ్సునేత్రా పవార్ ఘన విజయం సాధించింది. లక్షకు పైగా ఓట్ల భారీ మెజార్టీతో తిరుగులేని ప్రభంజనం సృష్టించింది. అజిత్ పవార్ అకాల మరణంతో వచ్చిన ఈ ఉప ఎన్నికల్లో 13వ రౌండ్ ముగిసేసరికి ప్రత్యర్థులకు చుక్కలు చూపించారు.
22 మంది ప్రత్యర్థులకు 5 వందల ఓట్లు కూడా రాలేదు. సోమవారం ఆమె కుమారుడు జయ్ పవార్ విలేకరులతో మాట్లాడుతూ అత్యధిక మెజార్టీతో గెలిపించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. అయితే, నాన్నగారు లేని లోటుతో పాటు పొరుగునే ఉన్న భోర్ తహసీల్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన తమను కలిచివేస్తోందని, అందుకే విజయ యాత్రలు వద్దని కార్యకర్తలను కోరారు.
అజిత్ పవార్ వారసుడిగా ఇకపై ప్రతి గురువారం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. మహారాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ పదవి చేజారడంపై ముఖ్యమంత్రితో చర్చిస్తామని పేర్కొన్నారు. ఎవ్వరూ ఎదురు నిలవలేని పవార్ల కోటలో ఈ విజయం అజిత్ దాదా జ్ఞాపకార్థం ప్రజలు ఇచ్చిన తీర్పుగా భావిస్తున్నామని పేర్కొన్నారు.
