అక్రమ చొరబాటుదారులకే ఇబ్బంది.. ముస్లింలకు కాదు

అక్రమ చొరబాటుదారులకే ఇబ్బంది.. ముస్లింలకు కాదు
  • బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్
  • నిజామాబాద్​లో సీఏఏ, ఎన్నార్సీలకు మద్దతుగా సభ

నిజామాబాద్, వెలుగు:

పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి అక్రమంగా చొరబడి ఈ దేశంలో టెర్రరిజాన్ని ప్రోత్సహించే వారిని తరిమేయడానికే సీఏఏ, ఎన్నార్సీలను కేంద్ర ప్రభుత్వం తీసుకురానుందని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవదర్ అన్నారు.    నిజామాబాద్ లోని కలెక్టరేట్ గ్రౌండ్‍లో శుక్రవారం సీఏఏ, ఎన్నార్సీకి మద్దతుగా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, ఎంపీ అర్వింద్‍ధర్మపురితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవదర్ మాట్లాడుతూ దేశంలోని ముస్లింలు ఎవరికీ ఈ చట్టాలతో ఇబ్బంది ఉండదన్నారు. నిజామాబాద్ లో కొద్దిరోజుల క్రితం సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్‍ఎస్‍ఎస్‍, బీజేపీలను చించేస్తానని అసదుద్దీన్ ఒవైసీ అనడంపై దేవదర్ మండిపడ్డారు. బీజేపీ, ఆర్‍ఎస్‍ఎస్‍లను చించడం మాట అటుంచి కనీసం ‘టచ్‍’ చేయాలని చూసినా ఛాతీ పగిలి పోతుందని హెచ్చరించారు.

అంగుళం భూమి కూడా పోనివ్వం

బీజేపీ బతికున్నంత కాలం భారత భూభాగంలో అంగుళం భూమి కూడా అటూ ఇటూ కాకుండా కాపాడుకుంటామని దేవదర్​అన్నారు.  మోడీ తీసుకుంటున్న నిర్ణయాలను అడ్డుకోవాలనే దురాలోచనతో సీఏఏను అడ్డం పెట్టుకుని రోడ్లమీద పడ్డారని ఎద్దేవా చేశారు. అఖండ భారత్ నినాదం చేసిన కాంగ్రెస్, తర్వాత ముస్లిం లీగ్‍, మహ్మద్ అలీ జిన్నాకు భయపడి దేశ విభజనకు ఒప్పుకుందన్నారు. అప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవన్న సంగతి ఒవైసీ గుర్తించాలని సూచించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్ తమ దేశాలు ముస్లిం దేశాలని అధికారికంగా ప్రకటించుకున్నాయని, భారతదేశం ఎప్పుడూ హిందూ దేశమని ప్రకటించుకోలేదని అన్నారు. ముస్లిం దేశాల్లో ముస్లిం తప్ప ఇతర మతస్తులెవరూ రాష్ట్రపతి కాలేరని, సుప్రీం కోర్టు జడ్జి కూడా కాలేరని తెలిపారు. కానీ భారత దేశంలో ఫక్రుద్దీన్ అలీ, జాకీర్ హుస్సేన్, ఏపీజే అబ్దుల్ కలాం వంటి ముస్లింలు రాష్ట్రపతులయ్యారన్న విషయాన్ని ఒవైసీ గుర్తించాలన్నారు. దమ్ముంటే నీ సెక్యులరిజం ప్రసంగాలు  కరాచీ, లాహోర్, ఢాకాలో చేయాలని సూచించారు. ప్రసంగం మధ్యలో తెలుగులో మాట్లాడి అందరినీ ఉత్సాహపరిచారు. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణను బీజేపీ తన ఖాతాలో కలిపేసుకుంటుందని చెప్పారు.

స్టేట్ ను ఒవైసీ నడిపిస్తున్నడా!

తెలంగాణ రాష్ట్రాన్ని ఎంఐఎం నేత అసదుద్దీన్ నడిపిస్తున్నాడనే అనుమానాలు కలుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు సీఎం కేసీఆర్ మూడు నిమిషాలు కూడా సమయమివ్వడని, ఒవైసీకి మాత్రం మూడు గంటలు ఏకాంతంగా మాట్లాడేందుకు టైం ఇవ్వడం పట్ల లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ చూస్తుంటే కేసీఆర్ ఒవైసీ కన్నా పెద్ద ముస్లింలా కనిపిస్తున్నాడన్నారు. తనకంటే పెద్ద హిందువెవరూ లేరని, యజ్ఞాలు, యాగాలు తాను చేసినన్ని ఎవరూ చేయరని చెప్పే కేసీఆర్ కు అవి అసురులు కూడా చేస్తారనే విషయం తెలియదేమోనని ఎద్దేవా చేశారు. భద్రాచలంలో సీతారాముల కల్యాణానికి తలంబ్రాలు మనవడితో పంపి హిందువుల మనోభావాలను దెబ్బతీసిన కేసీఆర్ గొప్ప హిందువెలా అవుతాడని ఆయనన్నారు. సమావేశంలో ప్రజలు సీఏఏ, ఎన్నార్సీలకు చేతులెత్తి తమ మద్దతు ప్రకటించారు.

ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నరు

సీఏఏ చట్టం గురించి చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ కొందరు దాన్ని వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. దేశవిభజన జరిగినపుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్ దేశాల్లో మైనారిటీల సంఖ్య 23 శాతం ఉంటే, ఇప్పుడు 3 శాతానికి పడిపోయిందన్నారు. మన దేశంలో మైనారిటీల శాతం 8 నుంచి  17 శాతానికి పెరిగిందన్నారు. ఇక్కడ మైనారిటీలకు ప్రభుత్వాలు అన్ని హక్కులు కల్పిస్తే, అక్కడ మాత్రం నిరాదరణకు , హింసకు గురవుతున్నారని  తెలిపారు. ఒవైసీ, కేసీఆర్ ముస్లింలలో అనవసర భయాలు కలిగిస్తున్నారన్నారు.