IPL 2026: కోట్ల రూపాలు తీసుకునే ముందే తెల్వదా: ఓవర్సీస్ ప్లేయర్లపై గవాస్కర్ ఫైర్

IPL 2026: కోట్ల రూపాలు తీసుకునే ముందే తెల్వదా: ఓవర్సీస్ ప్లేయర్లపై గవాస్కర్ ఫైర్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఫారెన్ ప్లేయర్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఫ్రాంచైజీలు పోటీ పడి మరీ కోట్లు కుమ్మరించి ఓవర్సీస్ ఆటగాళ్లను కొనుగోలు చేస్తాయి. కానీ కోట్ల జీతం తీసుకుంటున్నా విదేశీ ఆటగాళ్లు కొందరు లీగ్‎కు అందుబాటులో ఉండటం లేదు. కొందరు వేలంలో పాల్గొని ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాక మేం ఆడమని చెబుతున్నారు. ఇంకొందరు లీగ్ స్టార్ట్ అయ్యాక వివిధ కారణాలతో టోర్నీ నుంచి వైదొలుగుతున్నారు. వీళ్ల తీరుతో జట్టు సమతుల్యం దెబ్బతిని ఆయా ప్రాంఛైజీలకు ఇబ్బందిగా మారుతోంది. ఈ క్రమంలో ఓవర్సీస్ ప్లేయర్ల తీరుపై భారత మాజీ క్రికెటర్ గవాస్కర్ ఫైర్ అయ్యారు. 

తమ హెల్త్ కండిషన్ ఎలా ఉంది..? టోర్నీకి పూర్తిగా అందుబాటులో ఉంటామా లేదా అనే విషయం ఆటగాళ్లకు ముందే తెలియదా అని ప్రశ్నించారు. తమకు చేతకాదని తెలిసినప్పుడు టోర్నీలో ఆడతామని రావడం ఎందుకని నిలదీశారు. టీ20ల్లో ఒక బౌలర్ కేవలం నాలుగు ఓవర్లు మాత్రమే వేస్తాడని.. ఆ నాలుగు ఓవర్లు వేసేందుకు కూడా శరీరం సహకరించపోతే క్రికెట్ ఆడటం కన్నా రెండు నెలలు రెస్ట్ తీసుకోవడమే మంచిదని చురకలంటించారు. 

అంతేకానీ కోట్లకు కోట్ల రూపాయలు జీతం తీసుకుంటూ ఫ్రాంచైజీలను ఇబ్బంది పెట్టడం సబబు కాదని అన్నారు. ఒక ఆటగాడికి దేశమే ముఖ్యం ఇందులో ఎలాంటి సందేహాం లేదు.. కానీ కోట్ల రూపాయలు తీసుకుంటున్న ఫ్రాంచైజీల పట్ల కూడా నిబద్ధత చూపించాలి కదా అని అన్నారు. షెడ్యూల్ అడ్జస్ట్‎మెంట్ కాకపోతే మొత్తం టోర్నీకి  దూరంగా ఉంటే ఎవరికీ ప్రాబ్లమ్ ఉండదని.. కానీ ఫ్రాంచైజీలు కొనుగులు చేసిన తర్వాత మధ్యలోనే వదిలి వెళ్లడం ఏ మాత్రం సమంజసం కాదన్నారు.

 కొన్ని దేశాల క్రికెట్ బోర్డులు ఐపీఎల్ ఆడేందుకు ఆటగాళ్లకు ఎన్వోసీ ఇవ్వకపోవడంపై కూడా గవాస్కర్ సీరియస్ అయ్యారు. ప్రతి విదేశీ ఆటగాడి ఐపీఎల్ జీతంలో 10% ఫీజును ఆయా దేశాల క్రికెట్ బోర్డులు తీసుకుంటాయి. ప్రపంచంలోని మరే ఇతర టీ20 లీగ్‌లోనూ ఇలాంటి నిబంధన లేదు. ఐపీఎల్ కేవలం విదేశీ ఆటగాళ్లకే కాకుండా వారి బోర్డులకు కూడా కాసుల పంట పండిస్తున్నప్పుడు టోర్నీలో ఆడేందుకు ఎందుకు అనుమతి నిరాకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ , జోష్ హేజిల్‌వుడ్ వంటి ఆటగాళ్లు వివిధ కారణాలతో ఐపీఎల్ 2026లో ఇంకా ఆడలేదు. ఫిట్‌నెస్ పరీక్షలలో ఉత్తీర్ణులు కాలేదని శ్రీలంక క్రికెట్ బోర్డు వనిందు హసరంగా, ఈషాన్ మలింగ, మతీష పతిరానా ఎన్వోసీ ఇవ్వలేదు.