V6 News

సంజయ్ కపూర్ రూ.30 వేల కోట్ల ఆస్తుల గొడవలో బిగ్ ట్విస్ట్..!

సంజయ్ కపూర్ రూ.30 వేల కోట్ల ఆస్తుల గొడవలో బిగ్ ట్విస్ట్..!

సంజయ్ కపూర్.. ఇండియాలో ధనవంతుల్లో ఆయన ఒకరు. అతని ఆస్తుల విలువ 30 వేల కోట్ల రూపాయలు. ఈ సంజయ్ కపూర్ ఎవరు అంటారా.. సినిమా మాజీ హీరోయిన్ కరిష్మా కపూర్ మాజీ భర్త. విడాకుల తర్వాత సంజయ్ కపూర్ ప్రియా సచ్ దేవ్ అనే ఆమెను పెళ్లి చేసుకున్నారు. అనుకోకుండా.. అకస్మాత్తుగా సంజయ్ కపూర్ చనిపోవటంతో.. కుటుంబంలో ఆస్తుల గొడవ మొదలైంది. ఆస్తుల విలువ 30 వేల కోట్ల రూపాయలుగా ఉండటంతో.. సంజయ్ కపూర్ భార్యలు, పిల్లలు, తల్లి అందరూ కోర్టుకెక్కారు. 2026, ఏప్రిల్ 30వ తేదీ కోర్టు ఇచ్చిన ఆదేశాలతో అందరికీ షాక్ అయినట్లు అయ్యింది.

పారిశ్రామికవేత్త, సోనా కామ్‌స్టార్ ఛైర్మన్ సంజయ్ కపూర్ వదిలి వెళ్లిన రూ.30వేల కోట్ల ఆస్తి వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. గతేడాది జూన్ 12న లండన్‌లో పోలో ఆడుతూ తేనెటీగ కుట్టడం వల్ల గుండెపోటుతో మరణించారు. ఆయన మరణం తర్వాత ఆస్తుల పంపకంపై సంజయ్ 3వ భార్య ప్రియా సచ్‌దేవ్ కపూర్ ఒకవైపు, ఆయన 2వ భార్య నటి కరిష్మా కపూర్ పిల్లలు కియాన్, సమైరాలు మరోవైపు న్యాయపోరాటం చేస్తున్నారు.

వివాదానికి ప్రధాన కారణం ఏంటి?
సంజయ్ కపూర్ రాసినట్లుగా చెబుతున్న ఒక వీలునామా ఇప్పుడు వివాదానికి కేంద్రబిందువైంది. ఈ వీలునామా ప్రకారం సంజయ్ తన వ్యక్తిగత ఆస్తులన్నింటినీ 3వ భార్య ప్రియా కపూర్‌కే రాసిచ్చినట్లు ఉంది. అయితే ఇది ఫోర్జరీ చేసిన వీలునామా అని కరిష్మా కపూర్ పిల్లలు ఆరోపిస్తున్నారు. వీలునామాలో పురుషుడికి వాడాల్సిన పదాలకు బదులు స్త్రీకి సంబంధించిన పదాలు ఉండటం, సంజయ్ తల్లి రాణి కపూర్ పేరు ఎక్కడా లేకపోవడం వంటి అంశాలను వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఖరీదైన గుర్రాలు, లగ్జరీ వాచీలు ఎక్కడ?
సంజయ్ కపూర్ ఆస్తుల వెల్లడిలో ప్రియా కపూర్ పారదర్శకంగా లేరని పిల్లలు వాదిస్తున్నారు. సంజయ్‌కి ఉన్న అత్యంత ఖరీదైన పోలో గుర్రాలు, ఆడిమర్స్ పిగెట్, రోలెక్స్ వంటి లగ్జరీ రిస్ట్ వాచీలను ఆస్తి జాబితాలో చేర్చలేదని వారు పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఢిల్లీ హైకోర్టు.. ఆస్తులను పాడుచేయకూడదని, వాటిని విక్రయించకుండా ప్రియా కపూర్‌పై స్టే విధించింది. అలాగే విదేశీ బ్యాంకు ఖాతాలు, క్రిప్టోకరెన్సీ లావాదేవీలపై కూడా ఆంక్షలు విధించింది కోర్టు.

తల్లి వర్సెస్ కోడలు..
మరోవైపు సంజయ్ కపూర్ తల్లి 80 ఏళ్ల రాణి కపూర్ కూడా తన కోడలు ప్రియాపై సుప్రీంకోర్టులో పోరాడుతున్నారు. తనను ఫ్యామిలీ ట్రస్ట్ నుంచి అక్రమంగా తొలగించారని, తన ఆస్తులను కాజేయడానికి కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నారు. ఈ వయస్సులో పోరాటాలు వద్దు, మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. కోట్ల విలువైన ఆస్తుల కోసం ఒక సంపన్న కుటుంబం నడిరోడ్డుపై ఇలా గొడవలు పడటం దురదృష్టకరమని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.