గుడికి వెళితేనే హిందూవు కాదు.. భక్తి ఉంటే చాలు : సుప్రీంకోర్టు

గుడికి వెళితేనే హిందూవు కాదు.. భక్తి ఉంటే చాలు : సుప్రీంకోర్టు

 హిందూ మతంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గుడికి వెళ్తే..ఆచారాలు పాటిస్తేనే హిందూవు కాదని..మనసులో భక్తి ఉంటే చాలని వ్యాఖ్యానించింది. హిందూమతం అంటే కేవలం ఒక మతం కాదు  అది ఒక జీవన విధానం అని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. 

శబరిమల ఆలయ ప్రవేశం, మత స్వేచ్ఛకు సంబంధించిన అంశాల పిటిషన్లపై  విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు  మే 13న  సంచలన వ్యాఖ్యలు చేసింది.  హిందువుగా కొనసాగడానికి ప్రతిరోజూ గుడికి వెళ్లాల్సిన అవసరం లేదు.. కచ్చితంగా ఆచారాలు పాటించాలన్న నిబంధన కూడా ఏమీ లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక వ్యక్తి తన ఇంట్లో లేదా గుడిసెలో చిన్న దీపం వెలిగించినా.. అది అతని భక్తిని, మతాన్ని చాటుకోవడానికి సరిపోతుందని ధర్మాసనం  తెలిపింది.  

 ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని 9  మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. 15వ రోజు విచారణ సందర్భంగా.. న్యాయవాది మోహన్ గోపాల్ వాదనలు వినిపిస్తూ, హిందువులందరూ వేదాలను అత్యున్నత ప్రమాణాలుగా అంగీకరిస్తారా? అని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన జస్టిస్ నాగారత్న, హిందూమతం ఒక విశాలమైన జీవన విధానమని.. ఇందులో బాహ్య ఆచారాల కంటే వ్యక్తిగత విశ్వాసానికే ప్రాముఖ్యత ఉంటుందని వివరించారు.

ప్రతి చిన్న మతపరమైన ఆచారాన్ని కోర్టుకు తీసుకువచ్చి ప్రశ్నిస్తే, మతాల ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని.. వందలాది పిటిషన్లతో హిందూ వ్యవస్థ విచ్ఛిన్నం అవుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. 2018లో శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై ఇచ్చిన తీర్పు నేపథ్యంలో, ప్రస్తుతం మత స్వేచ్ఛ పరిధిని ఈ తొమ్మిది మంది న్యాయమూర్తుల బెంచ్ నిశితంగా పరిశీలిస్తోంది.